డ్రగ్స్ తీసుకున్న హీరోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్


ప్రస్తుతం టాలీవుడ్‌ అంతా కూడా డ్రగ్స్‌ వ్యవహారంలో షేక్‌ అవుతున్న విషయం తెల్సిందే. అగ్ర హీరో రవితేజ, అగ్ర దర్శకుడు పూరి జగన్నాద్‌, హీరోయిన్‌ ఛార్మి వంటి వారు ఈ వ్యవహారంలో పోలీసుల నుండి నోటీసులు అందుకున్న నేపథ్యంలో టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. నోటీసులు అందుకున్న వారికి డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు డ్రగ్స్‌ కూడా సేవించి ఉంటారు అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

ఇన్ని రోజులు స్టార్స్‌గా వెలుగు వెలిగిన వారు ఇప్పుడు మసకబారి పోయారు. వారి జీవితం ఇక నాశనం అయినట్లే, సినిమాల్లో వారికి స్థానం ఉండకపోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది. టాలీవుడ్‌ పరువు తీసినందుకు గాను వారిని కఠినంగా శిక్షించాలని సినీ పెద్దలు భావిస్తున్నారు. వారిని అయిదు నుండి పది సంవత్సరాలు లేదా జీవితాంతం టాలీవుడ్‌కు దూరం చేయాలనేది కొందరి వాదన. ఈ విషయమై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. అంతా కూడా డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న వారికి వ్యతిరేకంగా స్పందించారు. వారు అంతా కూడా తప్పు చేశారు అని తేలితే శిక్షించాల్సిందే అంటున్నారు.

ఇక ఈ కేసుపై పవన్‌ కళ్యాణ్‌ కూడా అనధికారికంగా స్పందించారు.
ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్‌ కళ్యాణ్‌ విషయం తెలిసిన వెంటనే సన్నిహితులతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. విషయంకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్‌ కేసులో పేర్లు ఉన్న సెలబ్రెటీలపై వెంటనే విమర్శలు చేయవద్దని, వారు నిందితులు అని తేలిన తర్వాత వారి గురించి ఆలోచించాల్సిందిగా పవన్‌ ఆలోచనగా తెలుస్తోంది. డ్రగ్స్‌ తీసుకుని టాలీవుడ్‌ పరువు తీసిన వారి పట్ల సినిమా పరిశ్రమ మరియు పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పవన్‌ అభిప్రాయ పడ్డాడు.

అయితే నోటీసులు అందుకున్న వారిలో కొందరు నిర్దోషులు ఉన్నారు అని కొందరు భావిస్తున్న నేపథ్యంలో విచారణ సమగ్రంగా జరిగి అసలైన దోషులు మాత్రమే శిక్షింపబడాలని, నిర్దోషులు బయటకు రావాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక తాను పని చేసిన పూరి జగన్నాధ్‌ డ్రగ్స్‌ సేవిస్తాడు అనే ఆరోపణలు వస్తున్న విషయంపై పవన్‌ స్పందించేందుకు నిరాకరించాడు. పూరి సన్నిహితుడే, అయితే డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా నిరూపితం అయితే శిక్ష పడాల్సిందిగానే తాను కోరుకుంటున్నట్లుగా పవన్‌ తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడట.
మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పకనే చెబుతున్నాడు.

No comments