నా ఫ్యాన్స్ కి, చిరంజీవి గారి ఫ్యాన్స్ కి పడదు - మహేష్ బాబు


టాలివుడ్లో మహేష్ బాబుకి జంటిల్మన్ అనే పేరుంది. అందుకు కారణం మహేష్ తో ఎవరికి ఎలాంటి వివాదస్పదమైన అనుభవాలు లేకపోవటమే. అసలు మహేష్ ఇండస్ట్రీ జనాలతో కలిసి ఉండేదే తక్కువ, అందుకే ఉంటే గింటే స్నేహమే తప్ప, శతృత్వం ఉండదు. మహేష్ కి ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్ లో మెగాస్టార్ ఫ్యామిలి ఒకటి. మహేష్ ఇటు చిరంజీవికి, అటు చరణ్ కి బాగా క్లోజ్. మహేష్ కొత్త సినిమా ఏది విడుదలైనా, మొదట ఫోన్ వచ్చేది ఈ ఇద్దరి నుంచే. మెగాస్టార్ మహేష్ తో గంటలకొద్దీ ఫోన్లో మాట్లాడతారట. ఇక మహేష్ – చరణ్ ఎలాగో కలిసి విదేశాలు చుట్టివస్తుంటారు. వీళ్ళ మధ్య ఇలాంటి సత్సంబంధాలు ఉన్నా, ఫ్యాన్స్ లో మాత్రం గొడవలు ఉంటాయి.

ఇదే విషయాన్ని మన సూపర్ స్టార్ ప్రతిష్ఠాత్మక తమిళ మ్యాగజీన్ ఆనంద వికటన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. నిన్న “SPYDER” ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో మహేష్ అభిమానుల్లో గొడవలపై మాట్లాడుతూ, “తమిళనాడుతో పోల్చుకుంటే తెలుగులో అభిమానుల గొడవలు ఇంకా పెద్దగానే ఉంటాయి. నేను చిరంజీవి సర్ కి, వాళ్ళబ్బాయి చరణ్ కి బాగా క్లోజ్. కాని మా అభిమానులకి పడదు. ఎప్పుడూ బాక్సాఫీస్ విషయాల మీద గొడవలు పడుతూ ఉంటారు” అంటూ కామెంట్ చేసాడు మహేష్.

ఇక తమిళ ఇండస్ట్రీలో తనకి విజయ్ మంచి స్నేహితుడు అంట. నిజానికి మహేష్ – విజయ్ కలిసి మణిరత్నం దర్శకత్వంలో ఓ మల్టిస్టారర్ చేయాల్సింది కాని, కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. ఆ విషయాన్ని కుడా ప్రస్తావించిన మహేష్ భవిష్యత్తులో తమ కాంబినేషన్లో మల్టిస్టారర్ ఉంటే మాత్రం అది కేవలం మురుగదాస్ దర్శకత్వంలోనే సాధ్యపడుతుందని తెలిపాడు.

No comments