బ్రేకింగ్: ఫోన్ లో 'ఎస్' అని చెబితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ.. ఇది కొత్త మోసం!!
అపరిచిత వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడేప్పుడు అవతలి వాళ్లు అడిగిన ఏదో ఒక ప్రశ్నకు మీ నోటితో ‘ఎస్’ అన్నారో ఇక ఎంత తీవ్రమైన చిక్కుల్లోకి పడతారో చెప్పడం కష్టమేనని సైబర్ క్రైం నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఏమరుపాటుగా అన్నారా ఆపైన మీ జేబు గుల్ల అవడం ఖాయమట. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద ఫోన్ కుంభకోణం జరుగుతోందట. అందులో భాగంగా అవతలి వాళ్లు ముందు ఏదో ఒకటి మాట్లాడి.. ‘నేను మాట్లాడేది మీకు బాగా వినిపిస్తుందా?’ అని అడుగుతారట. మనం దీనికి ‘ఎస్’ అని సమాధానం ఇస్తే.. ఆ ఒక్క మాటను జాగ్రత్తగా వాళ్లు రికార్డు చేసి పెట్టుకుని.. ఆ తరువాత కావలసిన చోట కట్ పేస్ట్ చేసుకుని వాడేసుకుంటున్నారట.
దాని ఆధారంగా మన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు నొక్కేయడానికి కావలసినన్ని ప్లాన్లు వేస్తారట. ఇలాంటి ఘటనలను ఇప్పటికే అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో వెలుగు చూశాయి. వాళ్లు తమ వస్తువులు లేదా సేవలను మనకు ఇచ్చినట్లుగా వాయిస్ రికార్డు చేసి, అవి మనకు అందినట్లు, దానికిగాను డబ్బు చెల్లించడానికి మన అంగీకారం కోరినట్లుగా ముందు వాయిస్ రికార్డ్ చేస్తారట. ఆ తరువాత మనం ఎప్పుడో చెప్పిన ‘ఎస్’ అనే సమాధానాన్ని ఇక్కడ వాడుకుంటారట. ఒకవేళ మనం మనకు ఆ వస్తువులుగాని, సేవలుగాని అందలేదని, అందువల్ల డబ్బు చెల్లించే సమస్యే లేదని చెబితే.. ముందు చెప్పిన సమాధానం తాలూకు ఆడియో క్లిప్ ఆధారంగా మన మీద కేసులు వేసి మరీ డబ్బు దండుకుంటారట.
చాలా వరకు కంపెనీలు తమ వ్యాపారాల కోసం ఫోన్లోనే వాయిస్ సిగ్నేచర్స్ తీసుకుంటున్నాయి. అలాంటి వారికి ఇప్పుడు ఈ స్కామ్ స్టర్లతో పెద్ద ప్రమాదమే వచ్చిపడిందని చెబుతున్నారు సైబర్ నిపుణులు. కాబట్టి అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం ‘ఎస్’ అనే సమాధానాన్ని ఎప్పడు పడితే అప్పుడు చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు.
Post a Comment