తెలుగు సినిమా హాస్యనటుల జన్మ స్థలాలు..!!


ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి బోసినవ్వులతో..మొదలౌతుంది మన జీవితం.. ముఖంపై చిరునవ్వు ఉంటే ఆ మనిషి జీవితంలో ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు భావిస్తారు. ఇక సినిమా ఇండస్ట్రీకి వస్తే హాస్య రసం లేని ఏ సినిమా ఉండదు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం , నవ్వలేకపోవడం ఒక రోగం " అన్నారు సినీ రచయిత.  ఒకప్పటి సినిమాల్లో వినోదం కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ పెట్టేవారు. కాల క్రమేన ఈ కామెడీ సందర్భాన్ని బట్టి వస్తున్నాయి. ప్రపంచంలో ఏ భాషా చిత్రాలైనా  హాస్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. 

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే.. ప్రపంచంలో ఎక్కడా లేని హాస్య నటులు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇక్కడ ఆ నటులు మద్య ఉన్న ప్రశాంత వాతావరణమే కారణం.. ఎలాంటి పోటీ లేకుండా ఎవరి టాలెంట్ వారు నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారు ఇక్కడి హాస్య నటులు. నిమాలో నవ్వు పుట్టించడం కేవలం హాస్య నటులకే సుసాధ్యం. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తున్న కొందరు ప్రముఖ హాస్య నటులు ఎక్కడ పుట్టరో వారి జన్మస్థలాలు ఎక్కడో చూద్దామా..!!

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య, వెండితెరకు స్వర్ణయుగం లాంటి రోజుల్లో ప్రజల గుండె తెరపై నవ్వుల నయాగరాల ఉప్పొంగిన హాస్య గంగ. ఈయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కి 75 కి. మీ. దూరంలో ఉన్న రావులపాడు లో జన్మించాడు. శ్రీకృష్ణ తులాభారం లో రేలంగికి చిత్రాలలో మొదటి అవకాశం వచ్చినా, పన్నెండేళ్ళ తర్వాత గుణసుందరి కథ చిత్రంలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చి రేలంగికి హాస్యనటుడిగా స్థిరపడిపోయాడు. రేలంగి ఇంట నిత్యం అన్నదానములు జరిగేవట!! పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు మన రేలంగి కావడం విశేషం.

వివాహ భోజనంబు చిత్రంలో సుత్తివీర భద్రారావు, బ్రహ్మానందం

 అల్లు రామలింగయ్య అల్లు రామలింగయ్య రాజమండ్రి కి 70 కి. మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు లో జన్మించాడు. ఈయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను వేయించారు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. ఈయన నటించిన ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు ఈయన సృష్టించినవే.

 పాత తరం హాస్యనటులంతా కలిసి చేసిన అద్భుత చిత్రం పరమానందయ్య శిశ్యుల కథ

  తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటుని గా వెలిగిన రాజబాబు "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి. రాజమండ్రి కి 65 కి. మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో జన్మించినాడు. రాజ బాబు కి మొదటి సారి తెరపై కనిపించిన చిత్రం సమాజం. ఆ తరువాత వచ్చిన అంతస్తులు చిత్రానికి గాను మంచి గుర్తింపు లభించింది. ఈయన వరుసగా 7 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొన్న మొట్టమొదటి హాస్య నటుడు, తాత్విక ఆలోచనలు గలవాడు.

 

పద్మనాభంహాస్య నటుడిగా పేరు గాంచిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించినాడు. మాయాలోకం సినిమాలో కోరస్ పాడటమే కాక అందులో మొదటిసారి నటించే అవకాశం పద్మనాభంకి వరించింది. పాతాలభైరవి సినిమా లో నటించిన తీరు చూసి విజయా సంస్థ వారు ఆయనతో మూడు సంవత్సారాల పాటు అగ్రిమెంట్ కుదుర్చుకునారు. దాంతో ఆయన వెనుదిరిగి చూడలేదు. దర్శకుడిగా, నిర్మాతగా మరి కొన్ని చిత్రాలను కూడా తీశారు. ఆయన నిర్మాతగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం తో ఎస్పీ బాలసుబ్రమణ్యం ను గాయకుడిగా పరిచయం చేసినాడు.  

నగేష్ :  దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ప్రసిద్ధ హాస్య నటుడు. తెలుగు, తమిళం,కన్నడ, మళయాళం వంటి భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి అందరినీ నవ్వించాడు. ఈయన కర్నాటక రాష్ట్రం లో బెంగళూరు నగరానికి 70 కి. మీ. దూరంలో ఉన్న తుంకూర్ తాలూకా చెయ్యూరు అనే గ్రామంలో జన్మించినాడు. ఈయన నవ్విస్తూనే ఏడిపీంచేవారట. అందుకే ఈయనను దక్షిణాది చార్లీ చాప్లీన్ అని అభిమానులు పిలుస్తుంటారు. తమిళంలో వచ్చిన నీర్ కుమిలి ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసినాడు. తెలుగు లో దేవత చిత్రంతో పాటుగా, వేటగాడు, కొండవీటి సింహం, శుభాకాంక్షలు వంటి చిత్రాలలో నటించి మెప్పించాడు.

సూర్యకాంతం:  ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈవిడ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో జన్మించింది. మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. ఐతే ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.

రమాప్రభ : దక్షిణ భారతదేశపు సినిమాల్లో ప్రముఖ హాస్య నటీమణిగా రమాప్రభ పేరు తెచ్చుకున్నారు. ఈవిడ అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కి 40 కి. మీ. దూరంలోని కదిరి లో జన్మించింది. దక్షిణాది చిత్రాల్లో ఇప్పటివరకు 1400కు పైగా చిత్రాల్లో చేసి ఎంతో పాపులారిటీ సంపాదించారు. హాస్య నటులు రాజబాబు, అల్లు రామలింగయ్యలకు జంటగా చేసి వారితో హిట్‌ కాం బినేషన్‌గా పేరుతెచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు తాత మనవడు, బడి పంతులు, విచి త్ర బంధం, జీవన జ్యోతి, ప్రాణం ఖరీదు, పట్నం వచ్చిన పతివ్రతలు, అప్పుల అప్పారావు, దేవదాసు వంటి హిట్‌ చిత్రాల్లో చేసి హాస్య నటిగా రాణించారు.

సుత్తి వేలు : తన సుత్తి తో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులను రెండు దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు సుత్తి వేలు కృష్ణా జిల్లాలోని విజయవాడ కి 70 కి. మీ. దూరంలో ఉన్న భోగిరెడ్డిపల్లి లో జన్మించినాడు. ‘ముద్ద మందారం' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినా కూడా ‘నాలుగుస్తంభాలాట' చిత్రంలో ఆయన పోషించిన సుత్తి పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సుత్తి వేలు గారు సుమారు 200 పైగా చిత్రాల్లో నటించారు.

సుత్తి వీర భద్ర రావు : హస్య బ్రహ్మ జంధ్యాల పరిచయం చేసిన సుత్తి వీర భద్ర రావు గోదావరి జిల్లాలో పుట్టినప్పటికీ, విజయవాడ నే స్వస్థలంగా మారిపోయింది. చిన్నతనం నుంచే నటన మీద ఉన్న ఆసక్తి తో ఎలా గైనా సినిమాలో కనిపించాలనే ఉద్దేశంతో 'నాలుగుస్తంభాలాట' చిత్రంలో హీరో కి తండ్రి క్యారెక్టర్ లో కనిపించి మొదటి చిత్రం తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సుమారుగా 50 చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందినాడు.

బ్రహ్మానందం : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అసలు పేరు కన్నె గంటి బ్రహ్మానందం. ఈయన గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించాడు. నరేశ్ నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో హీరోకి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "అహ నా పెళ్ళంట". తెలుగులో 900కి పైగా సినిమా ల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఘనత ఈ హాస్యనటుడికి దక్కుతుంది. ఒకే భాషలో అత్యధికంగా సిని మాలు చేసిన బ్రహ్మానందం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించడం విశేషం.

ధర్మవరపు సుబ్రమణ్యం : తెలుగు సినిమా హాస్యనటుడు. ఈయన ప్రకాశం జిల్లా లోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం లో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొన్న ఈయన జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురా లో అవకాశం వచ్చింది. సినిమాల్లోచేసి హాస్య నటునిగా టాలీవుడ్‌ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. హాస్యనటుడిగానే కాదు సినీ దర్శకుడిగా సైతం చిత్రాలు చేశారు

ఆలీ: తెలుగు సినిమాల్లో హాస్య నటునిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు ఆలీ. ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి లో జన్మించాడు. సీతాకోక చిలుక చిత్రం ద్వారా బాల నటుడుగా పరిచయమైన అలీ , ఇప్పటి వరకు 800 పై చిలుకు చిత్రాలలో నటించాడు. ఇక ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, అలాగే పవన్ కల్యాణ్ తన ప్రతి చిత్రంలో ఆలీని పెట్టుకోవడం సెంటిమెంట్ గా పడిపోయింది.

ఎమ్. ఎస్. నారాయణ :  మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. ఎమ్. ఎస్. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని నిడమర్రు. వీరిది రైతు కుటుంబము. ఈయన దాదాపు 700 చిత్రాలలో నటించారు. ఈయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ.

సుధాకర్ సుధాకర్ : ప్రధాన నటుడిగాను, హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు. సుధాకర్ కర్నూలు జిల్లా బనగానపల్లె కు కేవలం 15 కి. మీ. దూరంలోని కోయిలకుంట్లలో పుట్టాడు. తెలుగులో ఇతడి మొదటి చిత్రము సృష్టి రహస్యాలు. సుధాకర్ ప్రముఖ నటుడు చిరంజీవి కి మంచి మిత్రుడు. చెన్నైలో నటనలో శిక్షణ తీసుకుంటున్నప్పటి నుంచి వీరిద్దరి పరిచయం ఉంది. ఇతను పరుగో పరుగు, యాముడికి మొగుడు చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించాడు.

 source:apherald.com

1 comment:

  1. Telugu Panthulu in Bangalore
    Goodness, what a wonderful blog. I value your sharing this superb information. Is it true that you are searching for Telugu Pandits in Bangalore? for pooja, contact purohits.

    ReplyDelete