స్వేచ్చకు సంకేతం – స్వాతంత్ర్యదినోత్సవo !
జయజయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అంటూ 127 కోట్ల భారతీయుల స్వేచ్చకు ప్రతిరూపమైన భారతదేశ స్వాతంత్ర్యానికి నేటితో 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. భారతీయుల కీర్తికి ఆశలకు ప్రతిరూపమైన మన మువ్వన్నెల జెండా ఈరోజు మన దేశంలోని ప్రతి గల్లీగల్లీ లోను గర్వంగా ఎగురుతూ భారతజాతి కీర్తిని ఎర్రకోట సాక్షిగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతోంది. మహాత్మాగాంధీ శాంతి అనే ఆయుధాన్ని చేతబూని మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన చరిత్రలో ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలతో ఈరోజు మనం బ్రిటీష్ బానిసత్వం నుండి విముక్తులమై స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నాము అంటే ఆ మహానుభావుల త్యాగాలకు భారత జాతి ఎంత ఋణపడి ఉందో అర్ధం అవుతుంది.
స్వతంత్రo అంటే మనమంతా స్వేచ్ఛగా జీవించటమొకటే కాదు ఆ స్వేచ్ఛను గౌరవించటం, సమానత్వానికి పాటుపడటం అనే భావం స్వాతంత్ర దినోత్సవంలో ఉంది. 68 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బిలియనీర్ల సంఖ్య పెరిగినంత వేగంగా మన దేశంలో సగటు భారతీయుడి అభివృద్ధి జరగలేదు అన్నది వాస్తవం. ఇప్పటికీ మన దేశ జనాభాలో 30 శాతం మంది కనీస అవసరాలకు కూడ నోచుకోలేని దుర్భర దారిద్ర్యంలో జీవితాలను గడుపుతున్నారు అన్న వాస్తవాలను చూస్తే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని పధకాలు ప్రవేశ పెట్టినా సగటు మనిషి జీవితం మటుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఇప్పటికీ ఎటువంటి మార్పు లేని స్థితిలో ఎందరో తమ జీవితాలలోని వెలుగుల కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు అన్నది వాస్తవం.
అందరికీ విద్య అన్నది మనకు ప్రాధమిక హక్కుగా పొంది కొన్ని దశాబ్దాలు గడిచి పోయినా ఇప్పటికీ మనదేశంలో అనేక చోట్ల రేపటి భావి భారత పౌరులు అయిన పిల్లలు కనీస చదువుకు కూడ నోచుకోకుండా వారి బాల్యాన్ని తాకట్టు పెట్టి అనేక చోట్ల పని పిల్లలుగా మారి అనేక రకాల పనులు చేసుకుంటూ కనిపించే దృశ్యాలను చూసినప్పుడు 68 సంవత్సరాల దేశాభివృద్ధి ఏమైంది అని అనిపించడం సహజం. అర్దరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగిన నాడే నిజమైన స్వాతంత్రం అన్న మహాత్ముడి మాటలు కాలగర్బంలో కలిసిపోయి ప్రస్తుతం మన దేశంలో ప్రతి అర్ధ గంటకు భారతదేశంలో ఎదో ఒకచోట స్త్రీల పై అత్యాచారాలు జరుగుతూనే ఉన్న నేపధ్యంలో నిజంగానే మన దేశానికి అసలు స్వాతంత్రం వచ్చిందా అని సందేహం కలుగుతుంది.
ఒకవైపు అంతరిక్షయానంలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన అమెరికా జపాన్ చైనా లాంటి దేశాలకు సవాలు విసిరే స్థాయికి మనదేశం ఎదుగుతూ ఉంటే ఇప్పటికీ నిరక్షరాస్యత అజ్ఞానం అవినీతి కులం మతం అనే జాడ్యాల ఊబిలొ భారతీయత ప్రాంతాల వారిగా విడిపోయి ఈ దేశం ఏమైపోతుందో అన్న భయాన్ని సగటు మనిషికి కలిగిస్తోంది. కానీ ప్రతి స్వాతంత్ర దినోత్సవంనాడు స్వేచ్చగా ఎగిరే మన జాతీయ జెండాను చూసినప్పుడల్లా ఎదో ఒక అద్భుతమైన ఆనందం. ఆ ఆనందమే దేశభక్తి అని భావించాలి ‘కలలు కనండి ఆ కలలను సాకారం చేసుకొండి’ అని భారతరత్న అబ్దుల్ కలాం అన్నట్లుగా 127 కోట్ల భారతీయుల కలలను నిజం చేసే స్పూర్తిని ఈ 69వ స్వాతంత్ర ఉషోదయం భారతీయులందరికి కలగచేయాలని ఆకాంక్షిస్తూ TRENDI INDIA తరఫున అందరికీ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.
source: apherald.com
Post a Comment