దేశ విభజనను వ్యతిరేకించిన ఉర్దూ రచయిత సాదత్‌ హసన్‌ మంటో


అవిభక్త భారతదేశంలో అంటే 1947కి ముందు భారత ఉపఖండంలో జన్మించిన ఉర్దూ రచయిత సాదత్‌ హసన్‌ మంటో. ప్రధానంగా కథా రచయిత. ఈయన కథలు తెలుగుతో సహా వివిధ భారతీయ/ ప్రపంచ భాషల్లోకి అను వాదమై బహుళ జనాదరణ పొందాయి. మంటో కథల్లో- ఏడు ఇటీవల తెలుగులోకి అనువాదమయ్యాయి. ఎజి యతిరాజులు అనువదించిన ఈ చిన్న సంపుటం -సాహితీ స్రవంతి (ప్రజాశక్తి) వారు ప్రచురించారు. (2012- 80 పేజీలు). 1947నాటి దేశ విభజన అనేక మందిలో విషాదాన్నే మిగిల్చింది. అనేక వందలమంది సామాన్య/ అమాయక ప్రజల జీవితాల్లో బాధ రగిల్చింది. అన్నదమ్ముల వలె ఎంతో అవ్యాజాను రాగంతో సఖ్యమైన జీవితాన్ని గడుపు తున్న ప్రజల్లో దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. దీన్ని కొలవడం దుస్తరం. ఆనాటి కన్నీటి జీవితాన్ని కళ్ళారా చూసినవాడు, స్వయంగా అనుభవించినవాడు సాదత్‌ హసన్‌ మంటో. మాతృభాష ఉర్దూలోనే కథారచన చేశాడు. ఆయన కథలు ఆనాటికి జీవితవాస్తవ బాధలకి అద్దం పట్టాయి. ఆ కథలు చదవడం నిజంగా ఒక గొప్ప సాహిత్యానుభూతి. మంటో మాతృభాష ఉర్దూ అయిన, ఆయన కథలు వివిధ భారతీయ/ ప్రపంచ భాషల్లోకి అనువాదమై బహుళ జనాదరణ పొందాయి.
నిజానికి ఉర్దూ భారతీయ భాషే. కోట్లాదిమందికి అది మాతృభాష. మంటో ఆ కమ్మని భాషలో పుఖాను పుంఖాలు గా కథలు రాశాడు. ఆయన కథారచనలో నిష్ణాతుడనీ, మిక్కిలి ప్రతిభావంతుడనీ ఆయన కథలు యువ కథారచయితలకు పాఠ్యగ్రంథాల వంటివి అని చెప్పడం ఎంత మాత్రం అతి శయోక్తి కాదు. తెలుగులో అనువాదమై అవి తెలుగు కథల వలనే పాఠకులకు అనుభూతిని కలిగిస్తాయి. సాదత్‌ హసన్‌ మంటో - అవిభక్త భారత ఉపఖండంలో మే-11, 1912- లూఢియానాలో జన్మించాడు. నడివయసుకు ముందే, మంచి నడి యౌవనంలో లాహోర్‌లో 1955లో జనవరి-18న మరణించాడు. కేవలం 42సంవత్సరాల జీవిత కాలంలో 22 కథాసంపుటాలు, 7 రేడియో నాటికలు, 3 వ్యాస సంపుటాలు, ఒక నవల రచించారు. అంటే ఎంతో పుష్టికరమైన రచయిత అని భావించవచ్చును. 37 సంవత్సరాల కాలం భారతదేశంలో నివసించి 1947 తరువాత దేశ విభజనా నంతరం పాకిస్తాన్‌కు తరలి వెళ్ళిపోయాడు. దేశ విభజన వల్ల ఎంతో ఖేదం అనుభవిం చాడు. ఆయన దృష్టిలో భారత ఉపఖండం ఒక్కటే తన మాతృదేశం. బాల్యంలో చదువు మీద చెప్పుకోదగిన ఆసక్తి లేదు. మాతృభాష ఉర్దూ కంటె -ఇంగ్లీషు అంటే మిక్కిలి ఇష్టం.1930లో తండ్రి మరణించాడు. ఆ విషాదం మంటో మీద గట్టి ప్రభావం చూపింది. అప్పటికతను టీనేజ్‌లో ఉన్న లేలేత నూనూగు మీసాల యువకుడు. అమృతసర్‌లోని ఆలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీలో డిగ్రీ చదివారు. ఆ రోజుల్లోనే గోర్కీ, విక్టర్‌ హ్యూగో, పుష్కిన్‌, ఆస్కార్‌ వైల్డ్‌, చెహోవ్‌, మోపాసా మొదలైన ప్రపంచ ప్రసిద్ధ రచయితల్ని బాగా చదివాడు.
కొన్నాళ్ళు అమృతసర్‌లో ''మసావత్‌'' అనే దినపత్రికలో పనిచేశారు. హిందీ సినీమా రంగంలో కథ, డైలాగులు రాస్తూ కొన్నాళ్ళు గడిపాడు. కిషన్‌ కనహాయి, అప్ని నగరియా చిత్రాలకు పనిచేశాడు. 1939 ఏప్రిల్‌ 26న సఫియా అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. 1941 జనవరిలో బొంబాయి నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో ఆకాశవాణి కేంద్రంలో 18నెలలపాటు పనిచేశారు. ఆ కాలంలోనే- ఆవో, మంటోకి డ్రామా, జనజ్‌, తీన్‌ ఔరతే అనే నాలుగు శ్రవ్య నాటికలు రేడియోకి రాశారు. తన రెండ కథాసంపుటి ''ధౌన్‌'', ఒక వ్యాస సంపుటి ప్రచురించారు. 1942లో ఆకాశవాణి నుంచి విరమించి బొంబాయి తిరిగి వచ్చి హిందీ సినీమాలకు పనిచెయ్యనారంభించాడు. తరువాత లాహోర్‌ వెళ్ళిపోయాడు సకుటుంబంగా. లాహోర్‌లో ఉంటున్న పత్రికలకు రచన చేశాడు. ఖోవ్‌ దో, ధండా ఘోష్‌- అనే కథలు రాశాడు. ఆ సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. మద్య పానానికి బానిసయ్యాడు. మిత్రులకు క్రమంగా దూర మయ్యాడు. మంటోకి ముగ్గురు కుమార్తెలు. 1955 జనవరి 18న లాహోర్‌లో చివరి శ్వాస విడిచాడు. 2005 మంటో 50వ వర్థంతి సందర్భంగా పాకిస్తాన్‌ ప్రభుత్వం మంటో పేరున ఒక పోస్టల్‌ స్టాంపు విడుదల చేసింది. దేశ విభజన కాలం నాటి అనేక సంఘటనలను గ్రంధస్థం చేశారు. ఆ విషాద సంఘటనలకు మంటో కంటె మరెవరూ అంత ప్రతిభా వంతంగా రాసి ఉండలేదు. ఆయన ఈ విషయంలో పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి రచన చేశాడు. ఆయన్ని ఆయన సమకాలికులు ఎంతో అభిమానంగా మంటో మామ అని పిలిచేవారు. భారతదేశ సాహిత్య చరిత్రాకాశంలో 20వ శతాబ్దిలో సాదత్‌ హసన్‌ మంటో స్థానం అజరామరం, శాశ్వతం.

No comments