ఒమర్ షరీఫ్


నా నట జీవితంలో నాకు బాగా కలసివచ్చింది నా ముఖం.ఇది నాకు ముందుగా తెలియదు. సహజంగా చిన్న చిలిపితనం, పెంకితనం కలిసివచ్చే ముఖం. అందుకనే ఈ ముఖానికి 'దుర్మార్గపు ఛాయల్ని మప్పితే ఒక కొత్త రసాయనం తయారయింది. అది నా నటజీవితానంతటికీ పెట్టుబడి. నా ' ఇంట్లో-రామయ్య-వీధిలో-కృష్ణయ్య ' కన్నడంలో ఫెయిలయ్యినప్పుడు ' మీ లంటి నటులు మా భాషలో లేరన్నడు ' ప్రముఖ కన్నడ హాస్యనటుడు ద్వారకేష్. ఆయన ఉద్దేశం దుర్మార్గానికి హాస్యాన్ని జతచేసే నటుడు లేడని. కానీ ప్రపంచ సినీరంగంలోనే అలాంటి గొప్ప నటుడు ఒకాయన ఉన్నాడు. ఆయన ఈమద్యే తన 83వ ఏట కన్నుమూశారు. ఆయన పేరు ఒమర్ షరీఫ్.

అతిషజమైన పెంకితనం అతని ముఖంలో పలికినట్టు నాకు మరే నటుడులోనూ కనిపించదు. అలాంటి మరో గొప్ప నటుడు పీటర్ ఓ టూల్. విశేష్మెమిటంటే వీరిద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి  డేవిడ్ లీన్ గొప్ప చిత్రం ' లారెన్స్ ఆఫ్ అరేబియా 'లో పనిచేసారు.

మిత్రుడు గిరిబాబు ' ది గుడ్ బాడ్ అండ్ అగ్లీ' తెలుగు అనుసరణని (మెరుపుదాడి) తీస్తున్నప్పుడు 'అగ్లీ' పాత్రకి ఎంపిక చేసాడు. ఆరోజుల్లో పాత్రీకరణలకు ముందుగా మేకప్ లు చేఇంచి పాత్రలను గుర్తుపట్టే పని దర్శకుడు గిరిబాబు చేశాడు. ఇంగ్లీష్ సినిమాలో మరో గొప్ప నటుడు ఎలీ వాలాక్ ఆ వేషాన్ని చేశాడు. ఎలీ వాలాక్ బాగా నటించాడు. కాని- అక్కడ ఒమర్ షరీఫ్ ఉంటే పాత్రలో కూర్చుంటాడు. నేను ఆ చిత్రమంతా ఒమర్ షరీఫ్ నే మనసులో నిలుపుకున్నను.

బెల్లించే నవ్వు, నిలదీసే ఉడుకుమోత్తనం, సహజమైన పెంకితనం, ఆకర్షణీయంగా కనిపించే దురాశ - ఇవన్నీ పలకాలంటే అక్కద ఒమర్ షరీఫ్ నిలుచుంటే చాలు. ఆయన గ్రీస్ దేశస్థుడు. అతనికి చాలా భాషలు వచ్చును. ఇంగ్లీష్ అంతంత మాత్రంగానే వచ్చును. అందులో పరాయి యాస ఉంటుంది. స్వభావంలో మనం అంగీకరించలేని లక్షణాన్ని మన భాష కాని ఒక నటుడు మాట్లాడితే? ఆ పాత్రకి కొత్త రుచి వస్తుంది. ఇంగ్లీష్ని పరాయి భాషలాగా, పరాయి భాష్ అని గుర్తు చేస్తూనే మాట్లాడుతూ కనిపించే ఒమర్ షరీఫ్ తెర మీద కనిపిస్తే చాలు ప్రయత్నం లేకుండానే పాత్రని పలికించేవాడు. 'మెకన్నాస్ గోల్డ్' లో ఆయన పాత్ర ఒక బంగారు గని అంటాను నేను.

తను ప్రేమించిన అమ్మయి - ఈజిప్ట్ నటీమణి ఫతే హమామా కోసం మతం మార్చుకుని ఇస్లాం మతాన్ని పుచ్చుకున్నాడు. పేరూ మార్చుకున్నాడు. ఆనాటి ఈజిప్ట్ నాయకులు నాసర్ విధించిన ప్రయాణపు ఆంక్షల వల్ల తన దేశానికి దూరంగా ఉన్నాడు. ఒక కొడుకు పుట్టాక తన జీవనం కారణంగా  వివాహం దెబ్బతింది. దాదాపు ఎక్కువ భాగం విదేశాలలో హోటళ్లలో గడిపాడు. హాలీవుడ్లో ఆయన విజయాలగురించి ప్రశ్నించినప్పుడు ' అది సంతోషమే, అయినా నెను నా దేశాన్ని, నా ప్రజలను నష్టపోయాను. నన్ను జీవితంలో బాధించే ఒకే ఒక్క పెద్ద శాపం - ఒంటరితనం' అన్నాడు. అయితే హమామా, షరీఫ్ జీవితాంతం స్నేహితులుగానే ఉన్నారు.

రష్యా విప్లవం నేపధ్యంగా, నోబెల్ బహుమతిని పుచ్చుకున్న బోరిన్ పాంటర్ నాక్ 'డాక్టర్ ఝివాగో' ని ఎవరు మరిచుపోగలరు? ఆనాటి ప్రముఖ గాయకురాలు బార్బరా స్ట్రీసాండ్  మొదటిసారిగా నటించిన 'ఫన్నీ గర్ల్ ' లో నటించి ఈజిప్ట్ ప్రభుత్వ కోపాన్ని కొని తెచ్చుకున్నాడు. తర్వాత తన ప్రేమలో పడ్డాడు. పడ్డానని తనే చెప్పుకున్నాడు.

ఒమర్ షరీఫ్ ప్రపంచంలో 50మంది గొప్ప బ్రిడ్జి ఆటగాళ్ళలో ఒకరు. ఫ్రాన్స్ లో కేసీనోలలో పేకాట టేబిళ్ళ దగ్గర తరచుగా దర్శనమిచ్చే వ్యక్తులలో ఒమర్ ఒకరు. ఆయన్ని రెండు రకాల అభిమానులు దర్శించేవారట. నటుడిని, అంతకన్నా ఎక్కువగా పేకాట (బ్రిడ్జి) నిపుణుడిని.

                                                                    సాక్షి జీవన కాలం
                                                                   గొల్లపూడి మారుతీరావు

No comments