ప్రపంచ చలనచిత్ర చరిత్ర పార్ట్ -1


అది 1878 జూన్ 19 తేది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలోఆల్టో అనే నగరంలోని ఒక మైదానం. అనేకమంది ప్రేక్షకులు, పత్రికా విలేఖరులు ఉత్కంఠతతో చూస్తున్నారు. అప్పటికే ప్రముఖ ఫొటోగ్రాఫర్‌గా పేరు పొందిన ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్ తన ఇరవైనాలుగు కెమెరాలను సరిచూసుకోని తెల్ల గడ్డం నెమురుకుంటూ కూర్చున్నాడు. ఆ ఇరవై నాలుగు కెమెరాలు ఒక దాని పక్కన ఒకటి ఇరవై ఏడు అంగుళాల దూరంలో పెట్టబడి వున్నాయి. అన్ని కెమెరాలు సెకనులో ఇరవై అయిదో వంతు కాలం తేడాతో ఫోటోలు తీసేట్టుగా ఒక వైర్ సాయంతో ఎర్పాటు చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త స్టాన్‌ఫోర్డ్ ఆదేశం రావడమే తరువాయి.
ప్రేక్షకులకి ముందు వరుసలో కూర్చోని వున్నాడు స్టాన్‌ఫర్డ్ (తరువాతి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతమైన “స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం” ఈయనపేరు మీద నెలకొల్పబడింది.) స్టాన్‌ఫోర్డ్ మనసులో అతనకుముందు జరిగిన సంఘటన పదే పదే గుర్తుకు వస్తోంది.
“గుర్రం పరుగు మీద వున్నప్పుడు తన నాలుగు కాళ్ళని గాల్లోకి లేపుతుంది” అన్నాడు ఫొటోగ్రాఫర్ ఎడ్వర్డ్. స్టాన్‌ఫోర్డ్ అందుకు వొప్పుకోలేదు.
“నాలుగు కాళ్ళని గాలిలో నిలపడం అసాధ్యం” అన్నాడు.
ఇద్దరికీ వాదన పెరిగింది. “నిరూపించగలవా?” అన్నడు స్టాన్‌ఫోర్డ్. సై అంటే సై అనుకున్నారు.
ఇరవై అయిదు వేల డాలర్లకి పందెం వేసుకున్నారు. ఆ పందెం పర్యవసానమే ఈ ఫోటో ప్రహసనం. 25 వేల డాలర్లంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం.
డోం అనే రౌతు శాలీ గార్డ్నర్ అనే గుర్రం మీడ ఎక్కి దాన్ని దౌడు తీయించడానికి సిద్ధంగా వున్నాడు. స్టాన్‌ఫోర్డ్ గాల్లో చేతిని వూపగానే గుర్రాన్ని దౌడు తీయించాడు. గంటకి 36 మైళ్ళ వేగం మించకూడదని ఎడ్వర్డ్ ముందే చెప్పాడు కాబట్టి సరిగ్గా అదే వేగంతో నడుపుతున్నాడు. గుర్రం పరుగెత్తే ట్రాక్ పక్కనే వున్న ఇరవై నాలుగు కెమెరాలను అనుసంధానం చేసే వైరుని స్థిరంగా పట్టుకున్నాడు ఎడ్వర్డ్. గుర్రం మొదటి కెమెరా ముందుకు రాగానే ఆ వైరును లాగాడు.
క్లిక్.. క్లిక్… క్లిక్..
ఇరవై నాలుగు కెమెరాలు ఒక్క సెకనులో ఫోటోలు తీసాయి. ఇరవై నాలుగు ఫొటోలు ఆ ఇరవై నాలుగు కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. ఆ ఫోటోలలో ఏముందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోను కనిపిస్తోంది. అయితే వాళ్ళకి తెలియని మరో మహా విప్లవం ఆ ఫొటోల్లో దాగుందని అక్కడ ఎవరికీ తెలియదు.
తరువాత ఫోటోలను చూస్తే గుర్రం నాలుగు కాళ్ళను గాల్లో వుంచి ఎగురుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఎడ్వర్డ్ గెలిచాడు. అతని గెలుపు ఆ ఫోటోలతో పూర్తికాలేదు. కదులుతున్న బొమ్మలను ఫోటో తీసిన మొదటివాడయ్యాడు. ఆ రోజు ఎడ్వర్డ్ తీసిన ఇరవై నాలుగు కదిలే బొమ్మలే కాలక్రమంలో సినిమా రూపొందడానికి దోహదపడ్డాయి.
ఎడ్వర్డ్ చేసిన ప్రయోగం కేవలం బొమ్మలు తీయడానికే పరిమితమైతే ఆ తరువాత మొదటి చలన చిత్రం రూపొందడానికి దాదాపు పదేళ్ళు పైనే పట్టింది. ప్రపంచ వ్యాప్తంగా థామస్ ఆల్వా ఎడిసన్‌తో సహా ఎందరో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుండగా, ఇంగ్లాండ్‌కు చెందిన లూయిస్ లీ ప్రిన్స్ అనే శాస్త్రవేత్త చేసిన ప్రయోగం ఫలించింది. 1888 అక్టోబరు 14న లీ ప్రిన్స్ తీసిన “రౌన్‌ధే గార్డెన్ సీన్” ప్రపంచంలోనే మొట్టమొదటి చలన చిత్రంగా రూపుదిద్దుకుంది.
కేవలం రెండు సెకండ్ల వ్యవధితో తయారైన ఈ చిత్రం “సినిమా” అనే అద్భుత మాయాలోకాన్ని సృష్టించడానికి దోహదపడింది. ఈ చిట్టి చిత్రాన్ని లూయిస్ తన అత్తగారి ఇంటి పెరట్లో తీసాడు. అక్కడ లూయిస్ అత్తగారు సారా, మామగారు జోసఫ్, పెద్దకొడుకు అడోల్ఫే తోపాటు హేరియట్ హార్ట్లే అనే స్త్రీ అందరూ అటూ ఇటూ నడుస్తుండగా లూయిస్ తన సింగిల్ లెన్స్ కెమెరాలో, ఈస్ట్‌మాన్ ఫిలిం (తదనంతరం ఇదే కోడక్‌గా మారింది) పైన ఈ చిత్రాన్ని షూట్ చేశాడు. సెకనుకి 12 ఫ్రేములతో ఈ చిట్టి చిత్రం తయారయ్యింది (ఇప్పుడు మన చూసే చిత్రాలలో సెకనుకి 24 ఫ్రేములు వుంటాయన్న సంగతి తెలిసిందే).
అయితే ప్రపంచ తొలి సినిమా కథ ఇంతటితో అయిపోలేదు. అనూహ్యంగా జరిగిన అనేక సంఘటనలతో ఈ సినిమా చుట్టూ కొన్ని అంతుచిక్కని మిస్టరీలు పుట్టుకొచ్చాయి. ఈ చిత్రంలో గమనిస్తే, కుడివైపు చివరగా నల్లటి గుడ్డ ఒకటి కనిపిస్తుంది. ఆ ఎగురుతున్న గుడ్డ ఏమిటి? అది ఎవరిదై వుంటుంది? అని కొంతమందికి అనుమానాలు కలిగాయి. అయితే అది ఈ చిత్ర దర్శకుడు లీ ప్రిన్స్ కోటు అయ్యి వుంటుందని చాలామంది నిర్ధారించారు. అదలావుంటే ఈ షూటింగ్ జరిగిన సరిగ్గా పది రోజులకి, అంటే అక్టోబర్ 24 తేదీన ఈ చిత్రంలో నటించిన లీ ప్రిన్స్ అత్తగారు సారా వైట్లే అకస్మాత్తుగా మరణించింది. ఆమె వసు 72 అయినా అప్పటిదాకా ఆరోగ్యంగా వున్న వ్యక్తి అలా అకస్మాత్తుగా చనిపోవటమేమిటని చాలా మంది ఆశ్చర్యపోయారు. మరి కొంతకాలానికి మరో విచిత్రమైన సంఘటన జరిగింది.
తన ఆద్భుత ఆవిష్కరణకి పేటంట్ సంపాదించాలని లీ ప్రిన్స్ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే 1890 సెప్టంబర్లో ఒక శుక్రవారం డిజాన్ నుండి ప్యారిస్ వెళ్ళే రైలు ఎక్కాడు. ఆ తరువాత వచ్చే సోమవారం అతను తన స్నేహితులను కలుస్తానని, అంతా కలిసి తిరిగి లండన్ వెళ్ళాలని అతను మాట ఇచ్చాడు. అయితే ఆ స్నేహితులని ఆ సోమవారం కలవనే లేదు. ట్రైన్ వున్న వాడు వున్నట్టుగా లగేజ్‌తో సహా మాయమయ్యాడు. పోలీసులు, అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతవెతికినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికీ అతని అదృశ్యం అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. అప్పటికే ఫోటోలు తీయించుకోవడం ప్రాణాంతకమనీ, శరీరంలోని శక్తిని లాగేస్తుందని నమ్మిన కొంతమంది ఛాందసవాదుల వాదన సినిమా విషయంలో కూడా వూపందుకుంది.
అయితే అదృష్టవశాత్తు ఆ వాదనని ప్రపంచం పట్టించుకోలేదు. ముఖ్యంగా లుమినరి సోదరులు, థామస్ ఆల్వా ఎడిసన్, దాదా సాహెబ్ ఫాల్కే లాంటి వాళ్ళు పట్టించుకోలేదు. అందువల్లే తరువాత వారి వారి ప్రయత్నాల ఫలితంగా చలన చిత్రం మన ముందుకొచ్చింది.

No comments