చంద్రుడి పదహారు కళలు...
చంద్రుడు దేవతలందరిలోకీ అందగాడు. చల్లని వాడు. పదునాలుగు లోకాల వారికీ ఇష్టుడు.
అశ్విని మొదలైన ఇరవై ఏడుగురు నక్షత్ర కన్యలు దక్షప్రజాపతి కుమార్తెలు. వాళ్లందరూ అందగత్తెలే. వాళ్లందరినీ దక్షుడు చంద్రుడికిచ్చి వివాహం కావించాడు. చంద్రుడు వాళ్లందరినీ అనురాగంతోనే చూశాడు. కానీ, రోహిణిపైన మాత్రం కొంచెం ఎక్కువ స్నేహం కనబరిచాడు. అదిచూసి మిగతా వారు అసూయ చెంది, లోలోపల కుమల సాగారు. వారందరూ కలిసి పుట్టింటికి వెళ్లి తమ దౌర్భాగ్యాన్ని తండ్రితో చెప్పుకొని కంటనీరు పెట్టుకున్నారు.
దక్షుడు వారి పట్ల జాలిపడి, చంద్రుణ్ని తన ఇంటికి పిలిచి తన కుమార్తెలందరిపట్ల సమానమైన ఆదరం కనబరచవలసిందని హితవు చెప్పి పంపాడు. కానీ చంద్రుడు తన పక్షపాతాన్ని మానుకోలేకపోయాడు.
దక్షుడు ఆగ్రహం చెంది, అల్లుడని కూడా ఆలోచించక, చంద్రుడికి క్ష్యయవ్యాధి కలగాలని శపించాడు. ఆ కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించిపోసాగాడు. అతని నుండి వెన్నెల వర్షించటం ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. రాత్రులు గాఢాంధకారంతో నిండి, భయంకరంగా మారాయి. ఆ చీకటిలో రాత్రించరులైన రాక్షసులు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభించారు.
లోకాలకు ఉల్లాసం కలిగించే చంద్రుడు అలా నానాటికీ కృశించిపోవటం చూసి ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు దుఃఖించి, చంద్రుణ్ని పిలుచుకొని బ్రహ్మ వద్దకు వెళ్లి, చంద్రుడికి రోగ విముక్తి కలిగించమని ప్రార్థించారు. బ్రహ్మ చంద్రుడితో, 'సుధాకరా! నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్లి మృత్యుంజయుడైన పరమ శివుణ్ని గూర్చి తపస్సు చెయ్యి. దానివల్ల నీ క్షయవ్యాధి పోయి విశ్వశాంతి ఏర్పడగలదు' అన్నాడు.
చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ఆరు మాసాలపాటు తపస్సు చేశాక, ఈశ్వరుడు భవానీ సమేతంగా ప్రత్యక్షమై, 'వత్సా! దక్షశాపం వల్ల కృశించిపోతున్నానని విచారపడకు. నీకు కృష్ణ పక్షంలో ప్రతిరోజూ ఒక్కొక్క కళ క్షీణిస్తుంది. ఈ విధంగా నువ్వు నెలకొకసారి పూర్ణ చంద్రుడివై ప్రకాశిస్తావు' అని వరమిచ్చాడు. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడికి పదహారు కళలు లభించాయి. సకల ప్రాణులకూ సంతోషం కలిగింది.
Post a Comment