సిట్ విచారణలో నిజం ఒప్పుకున్న శ్యామ్ కె నాయుడు
టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ డీలర్ కెల్విన్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, అతడి నుండి పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా అనుమానిస్తూ సిట్ అధికారులు 12 మంది సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు అయిన విషయం తెల్సిందే.
దాదాపు 11 గంటల పాటు ఆయన్ను విచారించిన అధికారులు నేడు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడును విచారించారు. విచారణలో భాగంగా పలు ప్రశ్నలను ఆయన ముందు ఉంచిన సిట్ అధికారులు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. పూరిని 11 గంటలు విచారించిన పోలీసులు శ్యామ్ కే నాయుడును మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు విచారించి పంపించారు.
ఈ విచారణలో ఆయన నుండి సిట్ అధికారులు పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. కెల్విన్‌తో పరిచయం ఉందని, అయితే అది సినిమాల వరకు మాత్రమే పరిమితం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
కెల్విన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తాడు అనే విషయం తనకు తెలియదు అన్నట్లుగా మొదట చెప్పేందుకు ప్రయత్నించిన ఆయన ఆ తర్వాత ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సమయంలో కెల్విన్ డ్రగ్స్ డీలర్ అనే విషయం తెలుసు అంటూ నిజం ఒప్పుకున్నాడు. పూరి ద్వారా ఒక సినిమా సమయంలో కెల్విన్ పరిచయం అయినట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు.
మొత్తానికి పలు కీలక విషయాలను శ్యామ్ కే నాయుడు నుండి రాబట్టినట్లుగా తెలుస్తోంది. నిన్న పూరి, నేడు నాయుడు గారు ఇద్దరు కూడా విచారణకు పూర్తిగా సహకరించారు అని, వారి తరహాలోనే మిగిలిన అంతా కూడా విచారణకు హాజరు అయ్యి, మాకు సహకరించాలని సిట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post a Comment