బ్యాటరీ, కరెంటు అవసరం లేని ఫ్యాన్‌ను తాత కోసం తయారు చేశాడు… ఆ చెన్నై యువకుడు..!
ఎండాకాలం ఇప్పటికే మొదలైంది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో ఫ్యాన్లు, ఏసీలు ఎడ తెరిపి లేకుండా తిరుగుతున్నాయి. అయితే కరెంటు ఉన్నంత వరకు ఫ్యాన్ లేదా ఏసీ ఏది తిరిగినా ఓకే, మనకు చల్ల గాలి వస్తుంది. మరి కరెంటు లేకపోతే..? అప్పుడు ఉసూరంటూ వేడి గాలిలో ఉండక తప్పదు. కానీ… అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చెన్నైకి చెందిన ఓ యువ ఇంజనీర్ బ్యాటరీ, విద్యుత్ అవసరం లేకుండా నడిచే ఫ్యాన్‌ను సృష్టించాడు. అవును, మీరు విన్నది కరెక్టే..! ఇంతకీ అతను ఎవరో, ఎందుకు దాన్ని తయారు చేశాడో తెలుసా..?
అతని పేరు దినేష్. చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అతని తాత చేనేత కార్మికుడు. నిత్యం మగ్గం పైనే పని చేసి జీవనం సాగిస్తుంటాడు. అయితే ఇప్పుడు వచ్చిన వేసవి కాలం దృష్ట్యా చెన్నైలో పవర్ కట్స్ పెరిగిపోయాయి. దీంతో దినేష్ తాత ఎండ వేడికి, ఉక్కపోతకు గురవుతూ, ఆ ఇబ్బందితోనే మగ్గంపై పనిచేస్తున్నాడు. దీంతో తాతా పడుతున్న అవస్థను చూడలేక దినేష్ ఏకంగా బ్యాటరీ, విద్యుత్ అవసరం లేని ఓ ఫ్యాన్‌ను తయారు చేశాడు..
ఆ ఫ్యాన్‌ను దినేష్ తన తాత మగ్గానికి అమర్చాడు. మగ్గంపై పనిచేస్తున్నప్పుడు అది కదులుతుంటే దాని వేగానికి ఫ్యాన్ రెక్కలు తిరిగి గాలి వస్తుంది. దీంతో దినేష్ చేసిన ప్రయోగానికి అతని తాత అమితానందం వ్యక్తం చేశాడు. కరెంట్ లేకున్నా ఇప్పుడతను మగ్గంపై పనిచేస్తూ దాని మీద ఉంచిన ఫ్యాన్‌తో సేద తీరుతున్నాడు. అయితే దినేష్ అలా తాను తయారు చేసిన ఫ్యాన్ వీడియోను ఫేస్‌బుక్‌లో ఉంచాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. కావాలంటే మీరూ ఆ వీడియోను వీక్షించవచ్చు..!
Post a Comment