వినాయకుడి - ఆధ్యాత్మిక రహస్యం .. విఘ్నేశ్వరుడుకి తల్లిదండ్రులు ఎవరు..??
.
భారతదేశంలో జరిగే పండుగలలో గణపతి ఉత్సవాలు ప్రత్యేకమైనవి. చాలా మం దికి గణపతి ఇష్టదైవం. శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తియగుటకు మొదట గణపతిని పూజించుట అనవాయితీ. వ్యాపారస్తులు తాము కూర్చునే స్థలం దగ్గర గణపతిని స్వస్తిక్ రూపంలో రాయించి శుభం-లాభం కలగాలని కోరుకుంటారు. పురాణాల్లో పరమాత్ముని దివ్యగుణాలు, శక్తులు, మహాత్యమును దేవతల రూపాలు,ఆకారములో చూయించినారు. పరమాత్ముని జ్ఞానము ధారణ చేసి సర్వశక్తులు పొందిన వారిలో ప్రథమంగా గణపతి అయినందున సమస్త దేవతలందరిలో ప్రథమ పూజలందుకునే అధినాయకుడుగా పేర్కొననైనది. విఘ్నేశ్వరుని మహాత్యమును పలువిధాలుగా కొనియాడుతూ కథలు చెప్పుకుంటారు. గణపతిని గజరూపంలో చూయించడంలో ఆధ్యాత్మిక రహస్యం కలదు.
ఏనుగు ముఖం: ఏనుగు తల జంతువుల కెల్ల పెద్దది.అన్ని జంతువుల కన్న తెలివైనది. విశాల ముఖం కలది. ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలకు ప్రతీక. చిన్న ముఖం బలహీనతకు నిదర్శనం. ఆశించిన ఫలితం సిద్ధించనప్పుడుగాని, ఎవరైనా నిందించినప్పుడు వ్యక్తి ముఖం చిన్న బుచ్చుకున్నాడనుట ప్రతీతి. వివేకవంతుడు సమాజ శ్రేయస్సు కోసం తలపెట్టిన కార్యము విశాల మనస్సుతో నిర్విఘ్నంగా ముందుకు తీసుకపోవాలన్నదే దీని భావం.ఏనుగును ఎవరైనా ఆటంకపరిచినా, ఎన్ని కోతులు, కుక్కలు అరచి వెంటపడిన లెక్కచేయక తొండము అటు ఇటు ఊపుతూ ముందుకు సాగిపోతుంది.అలాగే జ్ఞానవంతులు కూడా, మూర్ఖులు ఎంత మంది ఆటంకపరచినా, నిందించినా బాధపడకుండా తమ కార్యాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకపోతారన్నదే విఘ్నేశ్వరుని ముఖంలోని పరమార్థం.
తొండం: ఏనుగు తన తొండముతో బలమైన చెట్లను పెకలించి వేయడమే కాకుండా సూది లాంటి చిన్న వస్తువులను కూడా తీసి ఇవ్వగలదు. వివేకవంతులు కూడా పెద్ద సమస్య ఎదురైన కానీ ధైర్యంతో ఎదుర్కొంటారు. చిన్న పొరపాటు కూడా చేయరు. ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారన్నదే దీని పరమార్థం.
కన్నులు: ఏనుగుది భారీ కాయం. కానీ కళ్ళు మాత్రం చాలా చిన్నవి. దానికి ఎంత చిన్న వస్తువైనా పెద్దదిగా కనిపిస్తుంది. ఎవరికి హానీ చేయదు.ఒకవేళ ఇతరులు చిన్నగా కన్పించినచో అందరిని తొక్కి ప్రాణహాని కలిగించేది. వివేకవంతులకు బాహ్యదృష్టి ఎక్కువ కావున ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి, జాతి కుల, మత, బేధాలు లేకుండా అందరిని ఆత్మీయులుగా భావిస్తారన్నదే దీని భావన.
చెవులు: ఏనుగు చెవులు చాటలవలె పెద్దవి. జ్ఞానేంద్రియాలలో చెవులకు అధిక ప్రాధాన్యత కలదు. విన్న విషయాలలో మంచిని గ్రహించాల్నన్నదే దీని భావన. రహస్య విషయాలు, మంత్రోపదేశాలు, గీతోపదేశమును అర్జునుడు చాలా ఏకాగ్రతతో విన్నట్లు పేర్కొన్నారు. వివేకవంతులు లక్ష్యసాధనలో ఆధ్యాత్మిక విషయాలను శ్రద్ధగా విని ధారణ చేస్తారనేదే దీని భావన.
ఏకదంతం: సాధారణంగా ప్రతి ఏనుగుకు రెండు దంతాలుంటాయి కానీ గణపతికి మాత్రం ఒకే దంతం ఉంటుంది. మనం ఇతరులకు మేలు చేస్తున్నప్పటికి మన ఆత్మరక్షణకు మాత్రం ఒక దంతం ఉంచుకొని ఇతరులకు హాని కలిగించకుండా సమాజ శ్రేయస్సు గురించి మరొకటి త్యజించాలన్నదే ఏకదంత భావన.
విఘ్నేశ్వరుడుకి తల్లిదండ్రులు ఎవరు...??
యుగయుగాల్లో గణపతికి తల్లిదండ్రులు ఎవరని తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. కృతయుగంలో ఈయన తల్లిదండ్రులు అదితి కశ్యపులు. బంగారు శరీరచ్ఛాయతో పది చేతులతో సింహవాహనమెక్కి మహోత్కట గణపతి పేరుతో ప్రసిద్ధుడై దేవాంతక నరాంతక రాక్షసుల్ని వధించాడు.
త్రేతాయుగంలో గణనాధుని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. స్ఫటిక శరీరచ్ఛాయతో 8 చేతులవాడై మయూర వాహనం ఎక్కి మయూర గణపతిగా ఖ్యాతి నార్జించి సింధువనే రాక్షసుణ్ణి చంపాడు.
ద్వాపరయుగంలో పార్వతి నలుగుమట్టి ద్వారా పుట్టి, కుంకుమరంగు శరీరచ్ఛాయతో 4 చేతులవాడై ఎలుక వాహనాన్ని ఎక్కి గజావన గణపతి పేరుతో విఖ్యాతుడై సిందూరడనే రాక్షసుడిని మట్టుపెట్టాడు.
కలియుగంలో తనంత తానుగా (స్వయంభువు) పుట్టి పొగ రంగు శరీరచ్ఛాయతో రెండు చేతులవాడై అశ్వ వాహనాన్ని ఎక్కి ధూమకేతు గణపతి పేరిట కలియుగంలోని మొదటి పాదం దాటాక (1,80,000 సంవత్సర మీదట) దుర్జనులందర్నీ వధిస్తాడు.
Post a Comment