కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ విశేషాలు
స్థలపురాణం :
పూర్వం మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గరు అన్నదమ్ములు ఈ కాణిపాక ప్రాంతంలోనే నివసిస్తుండేవారు. వారికి కాణి మడి (భూమి) వుండేది. ఆ భూమిలో ఏతం తొక్కడానికని ఒకరోజు ఒక చిన్నబావిని తవ్వాలనుకుని నిర్ణయించుకుంటారు. దాంతో వారు ముగ్గురు కలిసి తమకు అనుగుణంగా ఒక చిన్న బావిని తవ్వుకున్నారు. అందులో వచ్చిన నీటితో సేద్యం చేసుకుంటూ హాయిగా బతికేవారు.
కొంతకాలం తరువాత ఆ ప్రాంతంలో కరువు ఏర్పడింది. దీని ప్రభావంతో వారు ముగ్గరు తవ్వుకున్న చిన్న బావిలోని నీరు చాలకపోవడంతో... ఇంకా లోతుగా తవ్వాలని అనుకుంటారు. అలా నిర్ణయించుకున్న వారు బావిని మరింత లోతుగా తవ్వడం ప్రారంభిస్తారు. అలా బావిని తవ్వగా తవ్వగా... కొంతసేపటి తరువాత వారు తవ్వడానికి ఉపయోగిస్తున్న గునపం ఒక రాయికి తగిలి.. దానినుంచి రక్తం ఉవ్వెత్తున వారి ముగ్గురి చిందింది. ఆ రక్తం వారి మీద పడిన మరుక్షణమే.. వారికున్న వైకల్యాలు తొలగిపోయి మామూలుగా మారిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు తండోపతండాలుగా ఆ ముగ్గరు బావి తవ్విన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ వున్న మట్టిని శుభ్రపరిచి చూడగానే వారందరికీ వినాయకుని రూపంలో వున్న ఒక విగ్రహం కనిపించింది. ఆ విధంగా వెలిసిన వినాయకుని విగ్రహానికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంగా పేరు పొందింది. ఇప్పటికీ ఆ స్వామివారి అంతరాలయం బావిలోనే వుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్నవారికి వినాయకుడు సిద్ధి, బుద్ధుని ప్రసాదిస్తాడని... అలాగే తప్పు చేసిన వారికి తగినవిధంగా శిక్షలు వేసి దండిస్తారని ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు. అందువల్లే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎవ్వరైనా అసత్యాన్ని పలకరు.
ఆలయ విశేషాలు :
శ్రీ వరసిద్ధి వినాయకుని కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువై వుంది. పురాతన కథనాల ప్రకారం స్వామివారు ఈ ప్రదేశంలో వున్న బావిలో స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని కొన్ని శాసనాల ప్రకారం తెలుస్తోంది.
ఈ ఆలయంలో రెండు ప్రత్యేకమైన విశేషాలు వున్నాయి. అవేమిటంటే.. స్వామివారు కొలువైవున్న బావిలో నీరు భూభాగానికి సమానంగా ఎల్లప్పుడూ వుంటాయి. ఆ నీటినే భక్తులకు తీర్థంగా ప్రసాదిస్తారు అర్చకులు. ఇందులోనే మరో విశేషం ఏమిటంటే.. ఎప్పుడూ నీళ్లతో నిండి వుండే ఆ బావి చుట్టుపక్కల వున్న ప్రదేశంలో 40 అడుగుల లోతువరకు తవ్విచూసినా.. నీరు అస్సలు దొరకవని అక్కడున్న ప్రజలు చెబుతున్నారు.
ఈ ఆలయానికి చుట్టు వరదరాజస్వామి, మణికంటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి మొదలగు ఆలయాలు వెలిసి వున్నాయి. వినాయకచవితి ఉత్సవాలను కాణిపాకంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మొత్తం 20 రోజులవరకు జరిగే ఇక్కడ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు.
Post a Comment