దిష్టి ప్రభావం నుంచి బయటపడాలంటే ?

సాధారణంగా తమ పిల్లలు నలుగురిలోకి వెళ్లి వచ్చి కాస్త నీరసంగా వుందన్నా ... కడుపులో వికారంగా అనిపిస్తుందని చెప్పినా పెద్దవాళ్లు వెంటనే వాళ్లకి దిష్టి తీసేస్తుంటారు. ఇక ఈ దిష్టి విధానం కూడా వివిధ రకాలుగా వుంటుంది. దిష్టి తీయడానికి ఉప్పు ... ఎండు మిరపకాయలు ... చెప్పు ... చీపురు వంటివి ఉపయోగిస్తుంటారు. మరికొందరు నూనెలో ముంచిన గుడ్డను కాల్చి తలపై నుంచి గుండ్రంగా తిప్పడం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల దిష్టి తొలగిపోయి వికారం తగ్గుతుందని విశ్వసిస్తుంటారు. 

ఇక చిన్నప్పుడు మాత్రమే కాదు ఆ పిల్లలు ఎదిగి విద్యా వ్యాపార రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ... క్రీడారంగంలో రాణిస్తూ నలుగురి దృష్టిలో పడినప్పుడు కూడా ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దవాళ్లు దిష్టి తీస్తూ వుంటారు. ఇక దిష్టి తీయడమనే ప్రక్రియ ప్రాచీనకాలం నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పిరావడం ... వికారపెట్టడం ... వాంతులు కావడం జరుగుతూ వుంటుంది.

ఇక నిద్రలేవగానే గానీ ... ధ్యానంలో నుంచి బయటికి వస్తూ గాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెప్పారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణు ... మధ్యలో సరస్వతీదేవి ... చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని సెలవిచ్చారు. 

ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు ... మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే, ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను ... వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు, దిష్టి తగిలిన వాళ్లు ఇబ్బందిపడుతూనే వుంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ... ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 

No comments