ఫేస్‌బుక్ దెబ్బకు గూగుల్ ఢమాల్


తాజాగా న్యూస్‌ సైట్ల రద్దీపై Parse.ly అనే ఎనలైటిక్స్‌ సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం వెల్లడైంది. న్యూస్‌ సైట్ల రద్దీలో గూగుల్‌ను ఫేస్‌బుక్ వెనక్కు నెట్టింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ లో షేర్ చేసిన లింకులు ఇంటర్‌నెట్ వినియోగదారులకు వార్తల కోసం ప్రధాన వనరుగా మారాయని సంస్థ పేర్కొంది. మీడియా సైట్లకు సంబంధించి 43 శాతం రద్దీ ఫేస్‌బుక్  వేదికగా నడుస్తోందని, ఈ విషయంలో గూగుల్ ట్రాఫిక్ 35 శాతానికే పరిమితమైందని Parse.ly తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వివిధ వార్తల కోసం వెబ్ సైట్లను గూగుల్‌.కామ్‌…గూగుల్ న్యూస్ కన్నా ఫేస్‌బుక్‌లో ఉండే లింక్స్ ద్వారానే అత్యధికంగా ప్రజలు చూస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది.

ప్రముఖ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’, సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్’ మధ్య మొదటి స్థానానికై గత కొన్నాళ్ల నుంచి గట్టిపోటీ నడుస్తూ వస్తోంది. నిజానికి ఇంటర్నెట్ లో ‘గూగుల్’ ఆధిపత్యం చాలాకాలం నుంచి నడుస్తూనే వుంది. మధ్యలో ఇతర మాధ్యమాలు ఎన్ని వచ్చినప్పటికీ అవి గూగుల్ ధాటికి నిలబడలేకపోయాయి. దీంతో దీనికి పోటీ మరొకటి రాదని అంతా భావించారు కానీ.. ఇంతలోనే ఫేస్ బుక్ ప్రాభవం పెరుగుతూ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న న్యూస్ సైట్ల ట్రాఫిక్ రేసులో ఫేస్‌బుక్ గూగుల్‌ను అధిగమించడం ఇదే తొలిసారి కాదు. గత అక్టోబరులోనే  ఫేస్‌బుక్ స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది. కానీ ఇప్పుడు ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం కొత్త ప్రణాళికలు రచించుకోవడమే కారణం! ఉదాహరణకు ఈ ఏడాది ఆరంభంలో ఫేస్ బుక్‌ ‘ఇన్‌స్టెంట్ ఆర్టికల్స్’ అనే యాప్‌ని తీసుకొచ్చింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తా సంస్థలు తమ వార్తలను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. న్యూయార్స్ టైమ్స్‌, అట్లాంటిక్‌, రాయిటర్స్ లాంటి ప్రముఖ వార్త సంస్థలు  ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా తమ వెబ్‌సైట్ల ట్రాఫిక్‌ను బాగా పెంచుకున్నాయి

అయితే, వివిధ విషయాలపై సెర్చ్ చేయడానికి ఇప్పటికీ గూగుల్‌ సెర్చ్‌నే నెట్‌జన్లు వాడుతుండటం గూగుల్‌ సంస్థకు కాస్త ఊరటనిచ్చే విషయమని Parse.ly సీటీవో ఆండ్రూ వ్యాఖ్యానించారు. తాము చేసిన సర్వే మొత్తం వెబ్ ప్రపంచంలో ఓవరాల్‌ వెబ్ ట్రెండ్‌కు సంబంధించింది కాదని, కేవలం మీడియా ఇండస్ట్రీ ట్రెండ్‌కు సంబంధించింది మాత్రమేనని ఆయన అన్నారు. ఇన్నాళ్లు  వెబ్‌ మీడియా ప్రపంచంలో కూడా గూగుల్‌ ఆధిపత్యం చలాయించిందని, అయితే, ఆ స్థానాన్ని ఫేస్‌బుక్‌ ప్రస్తుతం గండికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా, చూసుకుంటే ఈ విషయంలో గూగుల్‌కు ఫేస్‌బుక్ ఈ స్థాయిలో చెక్‌ పెడుతుందని తాము ఊహించలేదని ఆండ్రూ పేర్కొన్నారు.

మరి.. ఈ దెబ్బతో ‘గూగుల్’ తేరుకుని సరికొత్త ఐడియాలతో ఫేస్‌బుక్‌తో పోటీని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు చేపడుతుందో, లేదో వేచి చూడాలి!

source:Korada.com

No comments