సత్యజిత్ రే - చిత్రసీమకు మణిహారం
ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు వాస్తవ పరిస్థితులవైపు అత్యంత కళాత్మకంగా మరల్చి భారతీయ సినిమాకే నవ్యత్వాన్ని అందించిన వాడు సత్యజిత్ రే. రే కృషి సినిమాకు మానవతీయతను నేర్పి నవ్య వాస్తవికతను సంతరింపజేసి నూతన పథాన్ని నిర్దేశించింది. భారతీయ చలనచిత్ర రంగంలో నవ్య సినిమా, సమాంతర సినిమా, ఆర్ట్ సినిమా తదితర పేర్లతో పిలువబడుతున్న సరికొత్త సినిమాకు ఊపిరి పోసింది.
తన ముప్పై ఎనిమిది సంవత్సరాల సినీరంగ జీవితంలో రే ’పథేర్ పాంచాలి’ నుంచి ’అగంతుక్’ వరకు 30 పూర్తి నిడివి చిత్రాలు అనేకానేక డాక్యుమెంటరీలు నిర్మించాడు. ఆయన తీసిన ప్రతి చిత్రం ఓ కళాఖండమై నిలిచింది. ప్రపంచంలో అనేకానేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు రివార్డులు అందుకోవడంతో పాటు ఆయన చిత్రాలు ఆ తర్వాతి తరం సినీ దర్శకులకు పాఠ్యాంశాలుగా మారాయి.
సినిమా నిర్మాణానికి జీవితమే ముడి పదార్థమని విశ్వసించిన రే భారతీయ సినిమా మరింత సమగ్రతని, ఊహాత్మకతని సంతరించుకోవాలని సూచించేవారు. అంతేకాదు మన సినిమా భారతీయతను ఇముడ్చుకున్న స్టెయిల్ ఈడియమ్ లను నేర్చుకోవాలని సూచించారు. సినిమా గురించిన ఆయన భావాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, నిర్మించిన చిత్రాలన్నింటిని క్రోడీకరించి చూస్తే ఆయన చలనచిత విజ్ఞాన సర్వస్వం లాగా గోచరిస్తాడు. 1966 లోనే లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిలిం ప్రొఫెసర్ థోరాల్డ్ డికిన్సన్ రే గురించి ఇలా అన్నాడు. “సినిమా పుట్టినప్పటి నుంచి బ్రిటన్ లో చిత్రాలు తీస్తూనే వున్నారు కానీ సత్యజిత్ రే లాంటి ఒక్క కళాకారుణ్ణి కూడా సృష్టించలేకపోయారు”. ఈ మాటలు చాలు రే లోని కళాత్మక పటిమను గుర్తించడానికి.
1921 లో మే 2 న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీరంగంలోనే గడిపినప్పటికీ ఆయన రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్ గా, బాల సాహిత్య సృష్టికర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా, తనదైన ముద్రగల సృజన చేశాడు. సినీ రంగంలో సైతం ఆయన దర్శకత్వానికి తోడు సంగీతం, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రచన, మాటల రచన బాధ్యతల్ని స్వయంగా నిర్వహించాడు.
కథ స్క్రిప్ట్ రచనలతోపాటు సన్నివేశాలకు సంబంధిమ్చిన స్కెచెస్ వేసుకుని ఆయన తన చిత్రాలని రూపొందించేవారు. ’పథేర్ పాంచాలి’ చిత్ర విషయంలో కెమెరా మూవ్‍మెంట్ సైతం మొదట స్కెచెస్ గా రూపొందించుకుని మరీ తీశాడు. ఒక చిత్ర నిర్మాణం విషయంలో రే తీసుకున్న శ్రద్ధ, పడిన శ్రమ అపురూపమైంది, అరుదైంది. అంతటి మధనం నుంచి వెలువడ్డాయి కనుకనే ఆయన చిత్రాలు అంతటి మహత్తర కళాఖండాలుగా భాసిల్ల్లాయి.
మొదట సాహితీవెత్తగా మొదలైన రే చిత్ర రంగానికి వచ్చేసరికి ఆయా కథా రచయితల మనోభావాల్ని అందిపుచ్చుకుని తన ఊహాత్మకత రంగరించి ప్రతి సన్నివేశం మూల రచయిత భావాల్ని మరింత స్పష్టంగా కళాత్మకంగా చిత్రాల్లో చూపించగలిగాడు. చైతన్య స్రవంతి రీతిలో చెప్పిన పాత్రల మనోభావాల్ని సైతం రే తన కెమెరాతో పలికించాడు. అలా సాహిత్యానికి సినిమాకి వారధిగా నిలిచి సినిమాని పరిపుష్టం చేశాడు. రే, టాగూర్, విభూతిభూషన్ బందోపాధ్యాయ, తారాశంకర్ బందోపాధ్యాయ, ప్రేంచంద్, నరేంద్రనాథ్ గంగోపాధ్యాయ, మైత్ర, సునీల్ గంగోపాథ్యాయ తదితర భారతీయరచయితల రచనలే కాకుండా ఇబ్సెన్ లాంటి విదేశీ రచయితల రచనల్ని కూడా తెర పైకి ఎక్కించి రే చలనచిత్ర పరిభాషతో తన చిత్రాలను కళాఖండాలుగా తీర్చి దిద్దాడు.
రే తన ముప్పై ఫీచర్ ఫిల్ములతో ప్రపంచ ఖ్యాతినార్జించినప్పటికి ఆయన షార్ట్ ఫిల్మ్ ల నిర్మాణంలో సైతం విశేష ప్రతిభ కనబర్చారు.1961 లో రవీంద్రనాథ్ ఠాగోర్ జీవితంపై ఆయన నిర్మించిన డాక్యుమెంటరీ రాష్ట్రపతి గోల్డ్‍మెడల్ ని అమ్దుకోవడంతోపాటు లోకొర్నో ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ సీల్ బహుమతిని అందుకుంది. 1964 లో ఎస్సో వారి కోసం రే ’టూ’ అన్న డాక్యుమెంటరీ నిర్మించాడు.ఆ తర్వాత 1971లో సిక్కిం పై డాక్యుమెంతరీ నిర్మించాడు. అయితే ఆ చిత్రం ఇంతవరకూ భారతదేశంలో ప్రదర్శనకు నోచుకోలేదు. ఇకపోతే 1972 లో శాంతినికేతన్ కు చెందిన బినోద్ బిహారీ మిఖర్జీ జీవితంపై ’ది ఇన్నర్ ఐ’ అన్న డాక్యుమెంటరీ నిర్మించి ప్రశంసలు అందుకున్నాడు. 1976 లో బాలసరస్వతిపై ’బాల’అనే లఘు చిత్రాన్ని నిర్మించాడు. అలా భావస్ఫోరకంగా రే తీసిన డాక్యుమెంటరీలు సైతం విశ్వవిఖ్యాతి గడించాయి.
నవ్య సినిమా ఉద్యమానికి దీపధారుడిగా ఉండడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా నిర్మింపబడుతున్న సమాంతర సినిమాల్ని వీక్షించే అవకాశాన్ని సైతం భారతీయ ప్రజలకి కల్పించాడు. వ్యాపార రంగంలో విడుదలకి నోచుకోని అత్యంత కళాత్మక చిత్రాల్ని వ్యాపార తీరాలకు దూరంగా ఉన్న ఉత్తమ చితాల్ని చూసేండుకు కళాభిమానులంతా ఒకటై ఫిలిం సొసైటీల్ని ఏర్పాటు చేసుకోవచ్చునని భారతీయులకు నేర్పింది సత్యజిత్ రే. ఆయన 1949 లో చిదానందదాస్ గుప్తా, నిమయ్ ఘోష్, హరినందన్ దాస్ గుప్తాలతో కలిసి కలకత్తా ఫిలిం సొసైటి ని స్థాపించాడు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఏర్పాటయిన ఫిల్మ్ సొసైటీల సమాఖ్య ఏర్పడినపుడు సత్యజిత్ రే దాని అధ్యక్షుడిగా, ఇందిరా గాంధీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అప్పటి నుండి రే ఆమరణాంతం రే ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడీగా కొనసాగాడు.అంతే కాదు, అనేక సందర్భాల్లో భారత ప్రభుత్వంతో ఫిలిం సొసైటిలకిచ్చే గ్రాంట్ల విషయంలో, టాక్స్ మినహాయింపు విషయంలో జోక్యం కల్గించుకుని ఆయా కాలాల్లోని ప్రధానుల్ని ఒప్పించి అదేశాలిప్పించారు. అలా ఫిలిం సొసైటిల ఉద్యమంలో ఆయనది ప్రధాన పాత్ర.
’పథేర్ పాంచాలీ’ నుంచి ’అగంతుక్’ వరకు ఆయన నిర్మించిన చిత్రాల్లో మానవ జీవితంలోని అనేక కోణాల్ని స్పృశించిన సత్యజిత్ రే తన తొలి చిత్ర నిర్మాణ విషయంలో అనేకానేక కష్టాలు చవిచూశాడు. నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన తరుణంలో అప్పటి బెంగాళ్ ముఖ్యమంత్రి బి.సి.రాయ్ చొరవతో ప్రభుత్వం అందించిన రుణంతో నిర్మాణం పూర్తయి ’పథేర్ పాంచాలి’ దేశ విదేశాల్లో ఖ్యాతిని అర్జించుకుంది. ఆ తర్వాత ఆయన తీసిన చిత్రాలు అప్రతిహతంగా విజయఢంకా మోగిస్తూ అభినందనల్నీ, అభివందనాల్నీ, బహుమతుల్నీ అందుకున్నాయి.
సుకుమార్ రే, సువ్రతల కుమారుడిగా 1921లో కలకత్తాలో జన్మించిన రే తన రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1936 లో మెట్రిక్యులేషన్ చదువు పూర్తిచేసిన రే బాయ్స్ ఓన్ జర్నల్ లో ఫోటోగ్రఫీకి ప్రధమ బహుమతి అందుకున్నాడు. అదే ఏడూ ప్రెసిడెన్సి కాలేజిలో చేరి, 1940 లో శాంటినికేతన్ లో చేరాడు. 1941లో అజంతా ఎల్లోరా సాంచి ఖజురహో తదితర కళా కేంద్రాల్ని సందర్శించాడు. అదే ఏడు రే తొలిసారిగా రాసిన ఇంగ్లీషు కథ ’అబ్‍స్ట్రాక్షన్’ ప్రచురితమయింది. శాంతినికేతన్ లో చదువు పూర్తి చేయకుండానే తిరిగి వచ్చి రే 1943 లో బుక్ పబ్లిషింగ్ కంపెనీలో చిత్రకారుడిగా చేరాడు. ’పథేర్ పాంచాలి’ నవల బాలల ఎడిషన్ కు 1945 లో రే రేఖా చిత్రాలు గీశాడు. 1944 లోనే సినిమా స్క్రిప్ట్ రచనను ఆరంభించిన రే 1946 లో టాగోర్ నవల ’ఘరే బాయిరే’ కు స్క్రిప్టును సిద్ధం చేసుకున్నారు. 1947 లో కలకత్తా ఫిలిం సొసైటీ ని స్థాపించి 1948 లో సినిమా వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. మొదటిసారిగా ’ఎ పర్‍ఫెక్ట్ డే’ అన్న యాడ్ ఫిలిం కి రే స్క్రిప్ట్ రాశాడు.1948 లో ’ది రివర్’ చిత్రం నిర్మించడానికి వచ్చిన విశ్వ విఖ్యాత దర్శకుడు జీన్ రినోయర్ ని కలిసిన రే లో నూతన ఉత్తేజం పెల్లుబుకనారంభించింది. ఆ తర్వాత రే జరిపిన విదేశీ పర్యటనలో ఆరు నెలల కాలంలో వంద ఉత్తమ చిత్రాల్ని చూడటంతో ఆయన జీవన రీతే మారిపోయింది.
1951లో రష్యన్ దర్శకుడు పొడువికిన్ కలకత్తా వచ్చి ఫిలిం సొసైటీలో ఇచ్చిన ఉపన్యాసంతో ప్రేరితుడైన సత్యజిత్ రేలో ’పథేర్ పాంచాలి’ చిత్రాని తీయాలనే కోరిక కలిగింది. 1952 లో ఆయన షూటింగ్ ప్రారంభించాడు. అనేక కష్టనష్టాల కోర్చి పూర్తి చేసిన ‘పథేర్ పాంచాలి’ చిత్రం 1955 ఆగస్ట్ 26 న కలకత్తాలో విడుదలయింది. అదే సంవత్సరం న్యూయార్క్ లోని మ్యూజియం ఆఫ్ మాడర్న ఆర్ట్ లో సైతం ఆ చిత్ర ప్రదర్శన జరిగింది. 1956 లో కేన్స్ అంతర్జాతీయ ఉత్సవంలో ’పథేర్ పాంచాలీ’ చిత్రానికి బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్ అవార్డు రావడంతో భారతీయ సినిమాకి ప్రపంచ ఖ్యాతి లభించింది.
అక్టోబర్ 11, 1956 రోజున సత్యజిత్ రే రెండవ చిత్రం అపరాజిత విడుదలయ్యింది. 1957 లో ’అపరాజిత’ కు వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ లయన్ బహుమతి లభించింది. 1959 లో భారత ప్రభుత్వం రేని పద్మశ్రీ అవార్డు తోను, సంగీత నాటక అకాడమి అవార్డుతోనూ సత్కరించింది. తన తండ్రి ప్రారంభించి వదిలేసిన ’సందేశ్’ పిల్లల పత్రికను రే పునరుద్ధరించి అమ్దులో అనేక కథలు, కవితలు రాశాడు. 1966 లో పద్మభూషన్ అవార్డును అందుకున్నాడు. అదే ఏడు బెర్లిన్ చిత్రోత్సవంలో ప్రత్యేక అవార్డు, 1967 లో మెగసెసె అవార్డును గెలుచుకున్నాడు.
1973 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం, 1974 లో లండన్ రాయల్ కాలేజి, 1978 లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1980 లో జాదవ్‍పూర్ విశ్వవిద్యాలయం, 1981 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, 1981లో నార్త్ బెంగాల్ విశ్వవిద్యాలయం, 1985 లో కలకత్తా విశ్వవిద్యాలయాలు సత్యజిత్ రేకు డి.లిట్ డిగ్రీలు ప్రధానం చేశాయి.
1973 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం, 1974 లో లండన్ రాయల్ కాలేజి, 1978 లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1980 లో జాదవ్‍పూర్ విశ్వవిద్యాలయం, 1981 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, 1981లో నార్త్ బెంగాల్ విశ్వవిద్యాలయం, 1985 లో కలకత్తా విశ్వవిద్యాలయాలు సత్యజిత్ రేకు డి.లిట్ డిగ్రీలు ప్రధానం చేశాయి.
ఇక రే 1958 లో బ్రసెల్స్ ఫెస్టివల్ సెలక్షన్ ప్యానల్ మెంబర్ గా, 1960 లో వియెన్నా ఫెస్టివల్ జ్యూరీ సభ్యుడిగా, 1961 లో బెర్లిన్ ఫిలిం ఫెస్టివల జ్యూరీ చైర్మన్ గా, 1965 లో IFFI చైర్మన్ గా, 1968 లో మెల్బోర్న్ ఫెస్టీవల్ ముఖ్య అతిధిగా, 1971 లో టెహరాన్ ఫెస్టివల జ్యూరీ సభ్యుడిగా, 1972 లో టోరొంటో జ్యూరీ సభ్యుడిగా , 1975 లో IFFI చైర్మన్ గా, 1982 లో మనీలా ఫెస్టివల్ జ్యూరీ చైర్మన్ గా ఇంకా అనేకానేక ఫెస్టివల్స్ లో అతిధిగా హాజరయ్యారు. 1976 లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న రే తన కథల పుస్తకం ప్రొఫెసర్ శంఖును 1965 లో వెలువరించారు. అది 1967 లో అవార్డును అందుకుంది. 1969 లో రే ’ఫెలుదా’ బాద్‍షాహీ ఆంగ్తీ పుస్తకాల్ని 1969 లో వెలువరించారు.
1983 లో రేకు బ్రిటిష్ ఫిలిం ఇన్‍స్టిట్యూట్ ఫెలోషిఫ్ లభించింది.1985 లో దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు, 1987 లో దాదాభాయి నౌరోజి అవార్డు, చిల్డ్రన్స్ లిటరేచర్ అవార్డు, 1990 లో శిరోమణి అవార్డు లభించాయి. 1992 లో జాతీయ ప్రొఫెసర్ గా నియుక్తులైన రేకు టోక్యో ఫిలిం ఫెస్టివల్ లో కురుసోవా అవార్డు లభించింది. అప్పటి వరకు ఒక్క చాప్లిన్ కి మాత్రమే ఈ పురస్కారం దక్కింది.వీటన్నింటికి తోడు 1987 లో ఫ్రాన్స్ దేశపు లీజియన్ డినోర్ అవార్డు రే ను వరించిన విశిష్ట పురస్కారం. ప్రపంచ దేశాలన్నీ వేనోళ్ళ పొగిడిన అనంతరం భారత ప్రభుత్వం కళ్ళు తెరిచి 1992 లోమరణశయ్యపై ఉన్న సత్యజిత్ రేకు ’భారత రత్న’ అవార్డును అందజేసింది.
లెక్కలేనన్ని అవార్డులు రివార్డులే కాకుండా ప్రపంచ ప్రజల మన్నల్ని అందుకుని కళాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సత్యజిత్ రే ఏప్రిల్ 23, 1992 న గురువారం రోజున సాయంత్రం 5-45 లకు కలకత్తాలోని బెల్లెవి నర్సింగ్ హోమ్ లో తుది శ్వాశ వదిలారు. రే భౌతిక కాయాన్ని కలకత్తాలోని నందన్ లో ఉంచారు. ఆ రోజు కలకత్తా దారులన్ని నందన్ కే పరుగులు తీశాయి. లక్షలాది మంది ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. ఆయన చిత్రాలు కళాభరణాలు.
Post a Comment