ముంబై పై కక్ష కట్టిన కిరాతకులు - మెమన్ సోదరులు
అసలు దావూద్ ఇబ్రహీం అనేవాడికి ముంబైలో వరస పేలుళ్ల ఆలోచనే లేదు. వాడిని రెచ్చగొట్టింది మెమన్ సోదరులే అని అంటారు ముంబై వరస పేలుళ్లపై పరిశోధన జరిపిన వారు. ప్రపంచంలోనే తొలి సీరియల్ బాంబ్ బ్లాస్ట్స్ గా నిలిచిన ముంబై వరస పేలుళ్ల వెనుక మెమన్ల కుటుంబం కసి మాత్రమే ఉంది. తమకు జరిగిన నష్టానికి పరిహారంగా కొన్ని వందల మందిని పొట్టనపెట్టుకొనే కుట్రను పన్నిన వారు మెమన్ సోదరులు.
ముంబై సీరియల్ బ్లాస్ట్స్ కు ముందు వీరిది ఒక సాధారణ కుటుంబం. చార్టెట్ అకౌంటెన్సీ కంపెనీని పెట్టుకొని తమ బతుకు తాము బతికేవారు. "మెహతా అండ్ మెమన్ చార్టెట్ అకౌంటెన్సీ''పేరుతో పనిచేసుకొంటూ వేరే వ్యాపారాలు కూడా చేసుకొనేవారు. ఇలాంటి సమయంలోనే ముంబైలో అల్లర్లు రేగాయి. బాబ్రీ మసీద్ విధ్వంసం అనంతరం హిందూ, ముస్లింలు కొట్టుకు చచ్చారు. ఈ విధ్వంసంలో అనేక మంది చనిపోయారు. ముంబై నగరంలో మహా విధ్వంసం చెలరేగింది. ఇలాంటి విధ్వంసంలో వీళ్ల చార్టెట్ అకౌంటెన్సీ ఆఫీస్ కూ దగ్ధమైంది. అంటే.. మెమన్లలో ఎక్కడలేని కసి పుట్టుకొచ్చింది.
తమకు జరిగిన నష్టానికి పరిహారంగా.. తమ షాప్ దగ్ధం చేసినందుకు ప్రతీకారంగా ముంబైనే దగ్ధం చేసే కుట్రను పన్నారు. తన వ్యాపారాలు.. స్మగ్లింగ్ లతో బిజీగా అప్పటికే విదేశాల నుంచి ముంబై చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న దావూద్ కు ఇలాంటి పేలుళ్లకు పాల్పడాలనే ఆలోచన కూడా లేదట. అయితే ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతోంది అంటూ మెమన్ల కుటుంబం తమకున్న సర్కిల్ ద్వారా దావూద్ కు సందేశం పంపింది. అయితే దావూద్ మొదట దీన్ని పట్టించుకొలేదు. దీంతో దావూద్ కు గాజులు, పూలు, జాకెట్ పీసులు ప్యాక్ చేసి పంపించారట.
ఇక్కడ వేల మంది ముస్లిం మహిళల గాజులు పగిలితే.. నువ్వు ఆడంగి వాడిలా స్పందిస్తున్నావ్ అంటూ మెమన్ అండ్ గ్యాంగ్ దావుద్ కు జ్ఞానబోధ చేశారు. దీంతో దావూద్ వీళ్లను అర్థం చేసుకొని పేలుళ్ల కుట్రకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. ముంబై పేలుళ్లపై పరిశోధన జరిపిన ముస్లిం తన పుస్తకంలో ఈ విషయాలను ప్రస్తావించాడు. బీజేపీ నేత అద్వానీని, శివసేన అధినేత బాల్ ఠాక్రేను చంపేద్దాం అనేది దావూద్ అభిప్రాయం. ఆ విధంగా ముంబై అల్లర్లపై ప్రతీకారం తీర్చుకోవాలనేది అతడి ఆలోచన.
అయితే మెమన్ల లెక్క మాత్రం అది కాదు. అద్వానీని , ఠాక్రేని చంపితే వాళ్లు హీరోలు అవుతారు తప్ప.. మొత్తం భారత్ పై ప్రతీకారం తీర్చుకొన్నట్టు కాదు. భారీ ఎత్తున విలయం సృష్టిస్తే తప్ప కసి తీర్చుకొన్నట్టు కాదు.. అనే విషయాన్ని దావూద్ కు చెప్పి.. భారీ ఎత్తున జన నష్టం కలిగేలా అంత వరకూ మానవ చరిత్రలో కనీవినీ ఎరగనటువంటి వరస బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారు. దాన్ని అమలు చేసి.. విధ్వంసం సృష్టించారు.
ఇలాంటి కుట్రలో క్రియాశీల పాత్ర పోషించిన యాకూబ్ మెమన్ చట్టపరంగా శిక్షించబడ్డాడు. అయితే అసలు దోషులు ఇంకో ఇద్దరు ఇంత వరకూ చట్టం పరిధిలోకి రాలేదు. వారే టైగర్ మెమన్, దావూద్ ఇబ్రహీం. వారిని పట్టి తెచ్చి శిక్షించినప్పుడే ముంబై శత్రు సంహారం పూర్తి అయినట్టు.
source:http://telugu.greatandhra.com/politics/gossip/mumbai-pai-kaksha-kattina-kiraathakulu-63982.html
Post a Comment