గొప్ప మేష్టారు - అబ్దుల్ కలాం
కలాం వేదికపై నిలబడితే ఉపాధ్యాయులైపోతారు.తన ముందు వున్న వాళ్ళని తన వాళ్ళుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు.
గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండేషన్ సభలకి ఉగ్గురిని ఆహ్వానించాలని తాపత్రయపడేవాళ్ళం - పి.వి.నరసిం హా రవు, శివాజీగణేశన్, అబ్దుల్ కలాం. అనారోగ్యం కారణంగా నరసిం హారావు గారు రాలేకపోయారు. శివాజీ గణేశన్ అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయారు.ఒక యువకుని కలల్ని మృత్యువు అర్దాంతరంగా అర్దాంతరంగా తుంచేయడం ఆయన్ని స్పందింపచేస్తుందని భావిస్తూ మాజీ రాష్త్రపతిని సంప్రదించాం. వారిని కలవడానికి నేను వెళ్ళలేకపోయాను. పిల్లలు వెళ్ళారు. మా కృషిని అభినందిస్తూ ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. అది మా దురదృష్టం.
జీవితంలో అవసరాల్ని అతివిచిత్రంగా కుదించుకున్న ఆయన గురించి ఎన్నో కధనాలున్నాయి. అన్నా విశ్వ విద్యాలయంలో ఆయన ఒక చిన్న గదిలో ఉండేవారట - ఒక పూర్తి ఇంటిని తీసుకోగలిగినా, ఆయనికి వంట చేసే తమిళుడు - ఆయన భోజనం గురించి చెప్పేవాడు. వెర్త కుళంబు, చారు, వడియాలు - ఇంతే ఆహారం. ఆయనకి ఒక సహాయకుడు ఉండేవాడు. ఏనాడూ తన బనీను,అండర్ వేర్ అతనికి ఉతకడానికి ఇచ్చేవారుకారట. రాష్త్రపతి భవనంలోకి ఒక బ్రీఫ్ కేసుతో వచ్చి ఆ బ్రీఫ్ కేసుతోనే తిరిగి వెళ్ళారని చెప్తారు.
తుంబా అంతరిక్ష కేంద్రంలో ఒక సైన్ టిస్టు పని చేసేవాడు. పొద్దుట ఆఫీసుకు వెళ్తే ఏ రాత్రికో ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు భార్య తడబడుతూ చెప్పింది . పిల్లలు ఊళ్ళో ఎగ్జిబిషన్ కి వెళ్ళాలనుకుంటున్నారని. సైంటిస్టు బాధపడిపోయాడు. ఆరోజు త్వరగా ఇంటికి వస్తాననీ, పిల్లల్ని సిద్దం చేసి ఉంచమని చెప్పాడు. ఆఫీస్ కు వెళ్ళి బాస్ తో ఆ విషయం చెప్పాడు. నిరభ్యంతరంగా వెళ్ళమని అన్నాడాయన. తీరా పనిలో పడ్డాక రాత్రి 8 గంటలకి ఆ విషయం గుర్తుకొచ్చింది. తుళ్ళి పడ్డాడు. భార్యకిచ్చిన మాట తప్పాడు. సిగ్గుపడుతూ ఇంటికి వచ్చాడు. పిల్లలు కనిపించలేదు. " పిల్లలేరి? " అని అదిగాడు భార్యని. మీ బాస్ వచ్చి ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళారని చెప్పింది. ఆ బాస్ పేరు అబ్దుల్ కలాం.
తన ఉద్యోగంలో ఆయన రెండుసార్లు సెలవు పెట్టారట. ఆయన తండ్రి పోయినప్పుడు, తల్లి పోయినప్పుడు. పొద్దునే భగవత్గీత చదువుకుంటారు. 18గంటలు ఉద్యోగం. రుద్రవీణ వాయిస్తారు. ఆయన రామ భక్తుడిని అని ఆయనే చెప్పుకున్నారు. ఆయన్ని ఒక ఇంతర్వ్యూలో ప్రశ్న అడిగారు " మీ దృష్టిలో నాయకత్వ లక్షణాలు ఏమిటి?" అని. ఆయన చెప్తూ " నేనింతవరకూ సూర్యుని చుట్టూ 76 సార్లు తిరిగాను(అంటే వయసు 76 సంవత్సరాలు) నేను మరిచిపోలేని విషయం ఒకటుంది. శ్రీహరి కోట నుంచి మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు ఒక సాంకేతిక లోపం వచ్చింది. అయినా ప్రయోగించవచ్చు అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ ప్రయోగం విఫలమైంది. అందరూ విమర్శించారు. వెంటనే పత్రికా సమావేశం జరగాలి. మా దైరెక్టర్ నతీష్ ధావన్ " నెను పత్రికా సమావేశం లో మాత్లాడతాను" అన్నారు. విమర్శలని సూటిగా ఎదుర్కున్నారు. రెండో ప్రయోగం విజయవంతం అయింది. నన్ను పిలిచి " పత్రికా సమావేశంలో నువ్వు మాత్లాడు" అన్నారు. ఇది గొప్ప పాఠం. మంచి నాయకుడు వైఫల్యానికి బాధ్యతని ధైర్యంగా తీసుకుంటాడు. విజయాన్ని తన అనుయాయులతో పంచుకుంటాడు".
" మీలో పూడ్చుకోలేని పెద్ద లోపమేమిటి?" అని ఒక తెలివైన పాత్రికేయుడు అడిగాడట. కలాం నవ్వి " నాకు చేతకాని ఒకే ఒక్క విషయం - రాజకీయం" అన్నారట. కలాం వేదికపై నిలబడితే ఉపాధ్యాయులైపోతారు. ఆయన ఉపన్యాసం పాఠం చెప్తునట్టు ఉంటుంది. తన ముందున్న వాళ్ళని తన వాళ్ళుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. విచిత్రంగా ప్రేక్షకులు మొదట ఆశ్చర్యపడి, ఆయన మాటలకు ఆనందపడి - తమకు తెలియకుండానే విద్యార్ధులైపోతారు. చిన్న పిల్లల్లాగా చప్పట్లు కొడతారు.
నాకు చాలా ఇష్టమైన, ఆయన చెప్పిన గొప్ప సూక్తులలో ఒకటి " వైఫల్యం నువ్వు కింద పడినప్పుడు కాదు. వైఫల్యం నువ్వు కింద పడి నేవడానికి ప్రయత్నం చేయనప్పుడు". ఒక మత్యకారుల కుటుంబంలో పుట్టి, అంతులేని పేదరికాన్ని అనుభవించి(ఆయన తల్లి వీలయినంత కిరసనాయిలు ఆదా చేసేవారట - కలాం రాత్రి వేళ్ళలో చదువుకోడానికి కలిసి వస్తుందని) కేవలం స్వశక్తితో పద్మశ్రీ అయి, పద్మ విభూషణ్ అయి, భారతరత్న అయి, ఈ దేశానికి రాష్ట్రపతి అయి, దేశ,విదేశాలలో 40 విశ్వ విద్యాలయాలలో గౌరవ డాక్టరేట్లను అందుకున్న అతి సామాన్య జీవితాన్ని గడిపిన మేష్టారు తప్ప ఈ మాటని ఎవరూ చెప్పలేరు.
ఒక వ్యక్తి గొప్పతనం అతని అవసానం చెప్తుందంటారు. అంతిమ క్షణాలలో తనకి అత్యంత ఆత్మీయులైన యువతతో ప్రసంగిస్తూనే వేదిక మీదే తనువు చాలించడం అతను సిద్ధ పురుషుడని చెప్పడానికి గొప్ప నిదర్శనం.
సాక్షి జీవన కాలం
గొల్లపూడి మారుతీ రావు
Post a Comment