ఇద్దరు దేవకన్యలు


దేవకన్యలు ఎలా ఉంటారు? తెల్లటి చీరల్లో - ' జగదేకవీరుడు అతిలోకసుందరి ' లో శ్రీదేవి లాగా తెల్లటి రెక్కలు టపటపలాడించుకుంటూ ఆకాశంలో ఎగురుతారా?  కాదు బాబూ, కాదు. ఆలోచనలు ఆకాశంలో విహరిస్తుండగా -శరీరం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ - కలలని నిజం చేసే అరుదైన అద్భుతాలుగా దర్శనమిస్తారు.ఈ కాలంలో ఇద్దరిని వారి ఫొటోలతో సహా పరిచయం చేస్తాను.

మెదట ఒక నమూనా దేవకన్య. ఆమె రెండో ఆట టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. నాలుగో ఏట టెన్నిస్ ఆడింది. వాళ్ళ నాన్నకి సరైన డబ్బు లేక భార్యని వదిలేసి, కేవలం ఏడేళ్ళ అమ్మాయిని తీసుకుని అమెరికా వచ్చాడు. 11 ఏళ్ళ తరువాత ఆమె ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచి ప్రపంచాన్ని తన విజయంతో, తన అందంతో మిరుమిట్లు గొలిపింది. ఆ అమ్మాయి పేరు మారియా షరపోవా. ఇది నమూనా మాత్రం. 

మరొక అమ్మాయి జెక్ దేశస్తురాలు - మార్టినా హింగిస్. ఈ అమ్మాయి రెండేళ్ళ్ప్పుడే టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. నాల్గేళ్ళప్పుదు టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొంది. 1994లో 12 సంవత్సరాల హింగిస్ ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ ఛాంపియంగా చరిత్ర సృష్టించింది. విశేషమేమిటంటే ఈమె రికార్డు సృష్టించాలని తల్లి కల. అందుకనే ఆనాటి గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్ర తిలోవా  పేరు కూతురికి పెట్టుకుంది. కొందరి చరిత్రలు తల్లి కడుపులోనుంచే ప్రారంభమవుతాయి. ఇది మరొక నమూనా.

1996. లండన్ లో ఒలింపిక్ క్రీడలు. జిమ్నాస్టిక్స్ విన్యాసాలు జరుగుతున్నాయి. సాదారణంగా ఆ బహుమతిని దక్కించుకునే జర్మనీ, రుమేనియా లు ఆనాడు వెనుకబడ్డాయి. అమెరికా క్రీడాకారిణి కెర్రీ స్ట్రగ్ వాల్ట్స్ మీంచి దూకింది. కాలి మణవ దగ్గర బెణికింది. 32 వేల ప్రేక్షకులకీ, ప్రపంచాన్నికీ అర్దమవుతోందు. కోచ్ కెరోల్యీ కూడా గుర్తుపట్టాడు. ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి. మరో రౌండ్ కి ఆమె కాలి ఎముక టప్పన విరిగింది. 32 వేలమంది గుర్తించారు. విరిగిన కాలితో మరో రౌండ్ చేయగలిగితే ఆమెదే స్వర్ణ పతకం. కెరోల్యీకి గుండె గొంతులో కదిలింది. కెర్రీ నొప్పిని బిగపట్టి బనీనుతో కంటతడిని తుడుచుకుంది. ఆఖరి విన్యాసం అయ్యాక ఒక్క క్షణం నిలవాలి. ఈసారి గాలిలోకి లేచి దూకింది. మరిన్ని ఎముకలు విరిగాయి. నిలబడగలదా? ప్రపంచమంతా లేచి నిలబడింది. ఒకా క్షణం నిలచి కుప్పలా కూలిపొయింది. చప్పట్లు మిన్నుముట్టాయి. కెరోల్యీ వచ్చి ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. " నేను బహుమతిని అందుకోవచ్చా? " అంది. " ప్రపంచమంతా ఎదురయి నిలిచినా నేను నిన్ను తీసుకువెళ్తాను." అన్నాడు కెరోల్యీ. ఆమెని ఎత్తుకునే విజేతలు నిలిచే స్థలంలో నిలిచి ఆమె స్వయంగా స్వర్ణ పతకాన్ని అందుకునేటట్టు చేశాడు కెరోల్యీ. "భగవంతుడు అందమైన రబ్బరు బొమ్మల్ని తయారు చేసి అందులో ఎముకలని ఉంచడం మరిచిపోయాడు " అన్నాడు ఓ పత్రికా రచయిత. తరువాత కెర్రీ స్కూలు టీచరుగా పనిచేసి ట్క్సస్(అరిజోనా) లో రాబర్ట్ ఫిషర్ అనే న్యాయవాదిని పెళ్ళి చేసుకుంది. ఒక కొడుకు పుట్టాడు(ఈ కధని ఈ కాలం లో మూడోసారి రాస్తున్నాను).

2015. న్యూయార్క్ లో స్వీట్ హోం హైస్కూల్ లో చదువుతున్న 15 ఏళ్ళ అమ్మాయి. పేరు శాం పీటర్ మాన్.ఆమెకి న్యూరో కార్డియోజనిక్ వ్యాధి.ఎక్కువగా పరిగెడితే ఈ జబ్బు వల్ల నరాల వ్యవస్థ  అదుపుతప్పుతుంది. ఊపిరి అందదు. ప్రాణం పోవచ్చు. 1500 మీటర్ల పరుగుపందెంలో ఈ అమ్మాయి రోగం తెలిసీ పాలు పంచుకుంది. ఆమె స్కూలులో 6వ స్థానంలో ఉంది. ఇప్పుడు తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి పరుగు. ఆమె ఆరోగ్యం గురించి తెలిసిన తండ్రి డేల్ పీటర్ మ్యాన్ గమ్యం దగ్గర నిలబడతాడు. ఆమె పరుగు అయ్యాక కూలిపోతుంది. అప్పుడు అతని పరుగు ప్రారంభమవుతుంది. ఈసారి మొదటి స్థానంలోకి వచ్చింది. ఊపిరి అందడం లేదు. తండ్రి చేతులు చాచాడు. అతని చేతుల్లోకి వాలిపోయింది. గడ్డి మీద పడుకోబెట్టి శ్వాశ్ అందుకునేట్టు చేసి మంచినీరు ఇచ్చాడు. " నాకు మెడల్ వస్తుందా? " అని అడిగింది శాం. తండ్రి కన్నీళ్ల పర్యంతమై కూతుర్ని పొదివి పట్టుకుని భుజం మీద ఎత్తుకున్నాడు(ఎంత ప్రయత్నించినా ఇంతకంటే మంచి ఫోటో సంపాదించలేకపోయినందుకు క్షమించాలి).

అనూహ్యమైన లక్ష్యశిద్ది , అజేయమిన సంకల్ప బలం ఆయా వ్యక్తులను చరిత్ర సృష్టించేటట్టు చేస్తాయి. అన్నింటికీ మించి - ఆకాశాన్ని కళ్ళ ముందు నిలుపుకుని - అనుకున్నది సాధించడం అపూర్వమైన గుండెబలం. ఈ దేవకన్యల సౌందర్యం శరీరానిది కాదు. కొండలని ఢీకొనే వారి వజ్ర సంకల్పానిది.
                  సాక్షి జీవన కాలం
                        గొల్లపూడి మారుతీ రావు

No comments