బాహుబలి : రివ్యూ


apherald.com RATING :4/5

మంచి

  • నటీనటుల పనితీరు
  • ఆర్ట్ వర్క్
  • సినిమాటోగ్రఫీ
  • విజువల్ ఎఫెక్ట్స్

చెడు

  • కథనం
  • నేరేషన్
  • థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం
  • పేలవమయిన ఫైట్ సీన్స్
  • బలహీనమయిన కథ
  • సంగీతం
  • పలు చిత్రాల పోలికలు

చిత్ర కథ

అమరేంద్ర బాహుబలి(ప్రభాస్) కొడుకు అయిన మహేంద్ర బాహుబలి(ప్రభాస్) ని శివగామి(రమ్యకృష్ణ) భల్లాల దేవా (రానా) నుండి కాపాడి జలపాతం కింద నివసిస్తున్న ఒక తెగ దగ్గరకి చేరేలా చేస్తుంది. అప్పటినుండి ఆ తెగ పెద్ద అయిన రోహిణి ఆ బాబుకి శివుడు(ప్రభాస్) అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేస్తుంది. శివుడికి చిన్నతనం నుండి జలపాతం అవతల ఏమి ఉందని సందేహం వెంటాడుతుంది. అప్పటి నుండి ఆ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించి విఫలం అవుతూ ఉంటాడు.  ఇలా ఉండగా అతనికి ఒకరోజు జలపాత పర్వతం మీద నుండి ఒక ముసుగు దొరుకుతుంది. అది అవంతిక(తమన్నా) ముసుగు అని తెలిసి ఆమెను కలవాలి అన్న తపన ఆమె ఊహ ఇచ్చిన ప్రేరణతో పర్వతాన్ని ఎక్కేస్తాడు. అక్కడికి వెళ్లి అవంతిక ను చుసిన శివుడు ఆమెకు తెలియకుండా ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అవంతిక మరియు కొంతమంది కలిసి భల్లాల దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుంటారు. వీరి ఆశయం పాతికేళ్ళుగా భల్లాల దగ్గర బానిసగా చిత్ర హింసలకు గురవుతున్న దేవసేన(అనుష్క) ని కాపాడి తీసుకురావడం. కాగా వీరిలో పలువురు ప్రయత్నించి భల్లాలదేవుడి సైన్యం చేతిలో చనిపోతుంటారు. ఈసారి దేవసేనను తీసుకొచ్చే అవకాశం అవంతికకి వస్తుంది, తను ప్రేమించిన అమ్మాయి ఆశయం తన ఆశయం అని దేవసేన ను భల్లాల దేవుడి నుండి విడిపించుకు రావడానికి బయలుదేరుతాడు శివుడు. ఆ తరువాత ఏం జరిగిందో తెర మీద చూడవలసిందే.. 

నటీనటుల ప్రతిభ

ప్రభాస్ , ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడు అనేది తెర మీద కనిపిస్తుంది , ప్రభాస్ మూడు రకాలుగా కనిపించారు. శివుడి పాత్ర ఒకటి , అమరేంద్ర బాహుబలి పాత్రలో రెండు రకాలుగా కనిపించి తన అంకిత భావాన్ని చాటి చెప్పారు. అమాయకత్వం మరియు మొండితనం కూడిన పాత్రలో చాలా బాగా ఆకట్టుకున్నారు ప్రభాస్. మనోహరి పాటలో కాస్త విభిన్నంగా కనిపించారు, ఇక బాహుబలి పాత్రలో రాజసం ఉట్టిపడేలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో అన్నింటికన్నా ముఖ్యమయిన పాత్ర మరియు అందరికన్నా ఎక్కువ ఆకట్టుకున్న నటి రమ్యకృష్ణ. కనిపించింది కాసేపే అయినా మొత్తం ప్రేక్షకుల దృష్టి తన వైపు మళ్ళించు కోవడంలో విజయం సాదించింది.  రమ్యకృష్ణ చాలా బలమయిన మరియు తెలివయిన రాజమాత పాత్రలో నటించారు ఆ పాత్ర ఆమెకోసమే తీర్చిదిద్దినట్టు కనిపించింది, ఆ పాత్రకు అంత న్యాయం చేసింది రమ్యకృష్ణ. ఈ పాత్ర తరువాత అంత ప్రభావం చూపించిన పాత్ర భల్లాల దేవ , రానా కాకుండా మరొకరిని ఈ పాత్రలో ఊహించలేము ఆ స్థాయి నటన కనబరిచారు ముఖ్యంగా దున్నతో చేసే పోరాటం సన్నివేశంలో అయన నటన అమోఘం. నమ్మిన బంటు పాత్రలో సత్యరాజ్ ఆకట్టుకున్నారు ఈయన పాత్ర మగధీర లో రామ్ చరణ్ మరియు గేమ్ అఫ్ త్రోన్స్ లో పలు పాత్రలను గుర్తు చేస్తుంటాయి. తమన్నా అటు అందంతోను ఇటు నటనతో ఆకట్టుకుంది కొన్ని సన్నివేశాలలో అమె స్థాయికి మించిన నటన కనబరిచింది. కాళకేయ పాత్రలో నటించిన ప్రభాకరన్ ఆకట్టుకున్నారు. అడవి శేష్ పాత్రకి ఒక కారణం అంటూ లేదు ప్రభాస్ చేతిలో చావడానికే అన్నట్టు ఆ పాత్ర మరియు అతని నటన ఉంటుంది. అనుష్క కనిపించేది కాసేపే అయినా ఆమె శైలి నటనతో పాత్రకి ప్రాముఖ్యత తెచ్చారు. నాజర్, రోహిణి, తనికెళ్ళ భరణి, రాకేశ్ వర్రే అలా కనిపించి ఆకట్టుకున్నారు. గాబ్రియెల్ బెర్తన్తే, నారా ఫతేహి మరియు స్కార్లెట్ విల్సన్ ఐటెం సాంగ్ లో అందాలతో ఆకట్టుకున్నారు. మిగిలిన వారందరు పరవాలేధనిపించారు. 

సాంకేతికవర్గం పనితీరు

భారతదేశంలోనే అత్యంత ఉన్నతమయిన సాంకేతిక అంశాలు ఉన్న చిత్రం అన్న లేబిల్ తో వచ్చిన చిత్రంలో కొన్ని అంశాలు అదే స్థాయిలో ఉన్నాయి. ముందుగా అవేంటో చూద్దాం , సబు సిరిల్  అందించిన ఆర్ట్ అద్భుతం అని చెప్పుకోవాలి , పూర్వకాలంలో వస్తువులకు మరియు ప్రదేశాలకు తన ఆలోచనలతో జీవం పోశారు. యుద్ద సన్నివేశాలలో వాడిన సామగ్రి మరియు రాజ మందిరం ఇలా చాలా చిన్న చిన్న విషయాలను కూడా ప్రతిస్పుటంగా కనిపించేలా తీర్చిదిద్దారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో  శ్రీనివాస్ మోహన్ ని మెచ్చుకొని తీరాల్సిందే. మాహిష్మతి రాజ్యాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ నాసిరకంగానే ఉన్నా కొన్ని సన్నివేశాలలో మునుపెన్నడూ తెర మీద చూడని స్థాయిలో ఉంటాయి గ్రాఫిక్స్ . సినిమాటోగ్రఫీ అందించిన సెంథిల్ కుమార్ పనితనం అద్భుతం అని చెప్పవచ్చు దర్శకుడి కథను తన కళ్ళతో చూసి కెమెరా తో మనకి చూపించారు. షూటింగ్ సమయంలో నటీనటులు మరియు సెట్ ప్రాపర్టీస్ కాకుండా గ్రాఫిక్స్ ని కూడా ఊహించుకొని ఈయన తెరకెక్కించిన విధానం అద్భుతం.  రమా రాజమౌళి మరియు ప్రశాంతి త్రిపునేని అందించిన వస్త్రాలు చాలా బాగున్నాయి. ఇక కథ, కథనం, మాటలు, దర్శకత్వం విషయానికి వస్తే కథ ఇప్పటికే పలు చిత్రాలలో చూసినది పలు జానపద కథల్లో విన్నదే, దీనికి రాసుకున్న కథనంలో నే సమస్య వచ్చింది. కథను దేవసేన కోణం నుండి మొదలుపెట్టి ఉంటె ప్రేక్షకుడు మొదటి పది నిమిషాల్లోనే కథలో లీనం అయ్యేవాడు కాని ఈ చిత్రంలో అలా జరగలేదు, చిత్రంలో లీనం అయ్యే అవకాశం ప్రేక్షకుడికి ఎక్కడా కలగనివ్వలేదు. ఏ చిత్రం అయినా ఒక పాత్రతోనే ప్రేక్షకుడు ప్రయాణిస్తాడు ఈ చిత్రంలో ఏ పాత్రా ఆ అవకాశాన్ని ఇవ్వదు, రాజమౌళి గారు అన్నట్టు "ఒక చిత్రాన్ని ఎమోషన్స్ నడిపిస్తుంది" అవును ఒక చిత్రంలో ఒక పాత్రకి ఉన్న ఎమోషన్స్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అయినప్పుడు మాత్రామే ఎమోషన్స్ చిత్రాన్ని నడిపించగలవు. ఈ చిత్ర కథనంలో లోపించింది అదే, ఏ పాత్రతోనూ  ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు. మాటలు రచించిన విజయ్ కుమార్ మరియు అజయ్ కుమార్ లు సరళమయిన పదాలను ఉపయోగించారు వీరి మాటల్లో పదును లేకపోవడంతో పాత్రలను ఎలివేట్ చెయ్యలేకపోయాయి. రాజమౌళి దర్శకత్వ పరంగా తన స్థాయి నిలబెట్టుకున్నారు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతంలో పాటలు బాగున్నాయి కాని వాటిని తెరకెక్కించిన విధానం ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో ఆశ్చర్య పరిచే విషయం కీరవాణి నేపధ్య సంగీతం , చాలా సన్నివేశాలలో చాలా పేలవంగా ఉంది కీరవాణి నేపధ్య సంగీతం. కొన్ని సన్నివేశాలలో పాత్రలకు ప్రాణం పోయాలి అన్న ప్రయత్నం విఫలం అయ్యింది. మొత్తంగా చూస్తే కీరవాణి సంగీతం ఈ చిత్రానికి పెద్దగా తోడ్పడింది లేదు. పీటర్ హెయిన్స్ పోరాట సన్నివేశాలు కూడా ఆకట్టుకోలేదు ఎక్కడా థ్రిల్లింగ్ గా అనిపించలేదు. అక్కడక్కడ ప్రభాస్ చేత చేయించిన స్టంట్స్ మాత్రం నోరేల్లబెట్టేలా చేసాయి. కోటగిరి వెంకటేశ్వర రావు అందించిన ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 

చిత్ర విశ్లేషణ


రాజమౌళి , అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్న అతి తక్కువ దర్శకుల్లో ఇతను ఒకరు, అతని చిత్రాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి గతంలో అపజయం ఎరుగని ఈ దర్శకుడి నుండి చిత్రం అనగానే అంచనాలు ఆకాశాన్ని చేరాయి మరి ఆ స్థాయి అంచనాలతో థియేటర్ లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడికి నిరాశ మాత్రమే మిగిలింది. గత కొద్ది రోజుల నుండి  ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వం అని చెప్పుకున్నారు అవును నిజమే సాంకేతికంగా కొన్ని అంశాల్లో భారతదేశ చిత్రానికి నేర్పించే స్థాయి ప్రతిభను కనబరిచారు. కాని సమస్య మొత్తం కథనంలోనే ఉంది, ఈ చిత్రాన్ని అరవై సన్నివేశాలుగా ముక్కలు ముక్కలు చేస్తే అందులో ఇరవై ముక్కలు అయినా అద్భుతంగా అనిపిస్తాయి. కాని వాటన్నింటిని ఒక వరుస పేర్చినప్పుడు చాలా బలహీనంగా తయారయ్యింది కథనం, " పునాది బలంగా లేని భవనం ఎంత అందంగా ఉన్నా చివరికి మిగిలేది పతనమే" అన్నట్టు చిత్రానికి పునాది లాంటి కథ మరియు కథనం బలహీనంగా ఉంటె నటీనటుల పనితీరు, గ్రాఫిక్స్ మరియు ఆర్ట్ వర్క్ ఎంత బాగుంటే మాత్రం ఎం లాభం. ఇకపోతే ఈ చిత్రం ఇంగ్లీష్ లో పలు చిత్రాలను పోలి ఉంటుంది దాదాపుగా అన్ని మంచి సన్నివేశాలు ఏదో ఒక ఆంగ్ల చిత్రాన్ని గుర్తు చేస్తుంది. స్వంతంగా అద్భుతమయిన సన్నివేశాలు రాసుకోగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి ఇలా ఆంగ్ల చిత్రాల నుండి ప్రేరణ పొందటం కాస్త బాధాకరమయిన విషయం. రాజమౌళి ఆయువుపట్టు అయిన ఫైట్స్ విషయంలో కూడా ఈ చిత్రంలో తడబడ్డారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కొన్ని వందలమంది పడ్డ కష్టం బూడిద పాలు అయ్యిందన్న బాధ మాత్రం ప్రతి ప్రేక్షకుడి మనసులో మిగిలిపోతుంది. రాజమౌళి చిత్రం అనగానే ఇరవై నిమిషాల పాటు అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలోనూ ఇరవై నిమిషాలు అద్భుతంగానే ఉంది కాని ఇరవై నిమిషాలు ఒక్కో నిమిషం లా ఇరవై సార్లు వచ్చాయి అంతే తేడా, ఈ చిత్రాన్ని చూడటానికి ప్రధాన కారణం ఏదయినా ఉంది అంటే తరువాతి భాగం చూడాలన్న ఆశ , తరువాత వచ్చే భాగం అర్ధం అవ్వాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ఈ పాత్రలను ఇప్పుడు అలవాటు చేసుకుంటే తరువాత భాగం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ మధ్య వస్తున్న చిత్రాలతో పోలిస్తే పై స్థాయిలోనే ఉన్నా రాజమౌళి చిత్రాలలో ఇది చాలా బలహీనమయిన చిత్రం అని చేపుకోవచ్చు.. 
source:http://www.apherald.com/Movies/Reviews/39531/Baahubali-(Bahubali)-Telugu-Movie-Review/

1 comment:

  1. super mOVIE REVIES

    News, views and reviews. Sumantv.com publishes sophisticated writings about political scenario at state and national levels. sumantv.com also provides entertainment news, wonderful star gallery, gossips, and movie trailers, movierulz telugu movies and many amazing special stories that drive you crazy.

    visit: http://www.sumantv.com/

    ReplyDelete