చావనైనా చస్తాం.. తిరిగి వెళ్లం..

 The Global Refugee Crisis

జనం.. జనం.. ఎటు చూసినా వెల్లువలా వచ్చి పడుతోన్న జనం. గుట్టలు గుట్టలుగా.. ఆడా మగా, పిల్లా పాప, ముసలీ ముతకా.. అందరూ అందరిదీ ఒకే బాట. ఎలాగోలా సరిహద్దులు దాటాలనే ఆశ కొంతమందిది. ఎలాగైనా సరే అవతలికి వెళ్లాలనే తెగింపు మరి కొందరిది. పొలాల్లో  నుంచి పరుగులు తీస్తూ.. ఇనుప కంచెల్ని దాటుకుని.. సైనికుల తుపాకీ తూటాల్ని కాచుకుంటూ, లాఠీ దెబ్బల్ని ఓర్చుకుంటూ... వీళ్లు పడే యాతనంతా కేవలం బతకడం కోసమే.  శరణార్దులంతా ఇప్పటికిప్పుడే వచ్చిన వాళ్లు కాదు. కొంతమంది రోజుల తరబడి యూరోపియన్‌ సరిహద్దుల్లోనే ఉంటున్నారు. క్షణకాలం కలిసొస్తే చాలు.. సరిహద్దులు దాటి వెళ్లవచ్చనేది వీరి ఆశ. మా దేశంలోకి ఎందుకొస్తున్నారు. వెళ్లండి . మీ దేశానికి వెళ్లిపొండి అంటే.. ఇక్కడే చావనైనా చస్తాం కానీ .. అక్కడకు మాత్రం వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. లక్షల సంఖ్యలో వస్తున్న సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పించలేక ఐరోపా సమాఖ్య దేశాలు తల పట్టుకుంటున్నాయి. సమస్య తీవ్రం కావడం, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో జర్మనీ ముందుకొచ్చినా మిగిలిన దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మానవ హక్కులు, మానవత్వం అంటూ కబుర్లు చెప్పే దేశాలు, వాటి నేతల నైజం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. 
కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతోన్న శరణార్థుల్ని ఆపలేక.. మాసిడోనియా ప్రభుత్వం సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. శరణార్థుల్ని ఆపేందుకు బోర్డర్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. వీరిని అడ్డుకునేందుకు సైన్యం లాఠీచార్జ్‌, బాష్పవాయు గోళాల ప్రయోగం, అప్పుడప్పుడూ కాల్పులు జరపాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంతగా వారించినా, నివారించినా, నిషేధించినా సరే... ఇక్కడ నుంచి కదిలేది లేదంటున్నారు శరణార్థులు. ఎందుకంటే .. ఇప్పటి వరకూ వారు పడ్డ కష్టాలతో పోలిస్తే.. ఇదొక భూలోక స్వర్గం.
భయం నిండిన కళ్లు, అలసిపోయిన వళ్లు, బతుకు మీద భయంతో బతకాలనే ఆశతో... ఒకరిద్దరు కాదు.. లక్షల్లో  వస్తున్నారు. ఆస్తిపాస్తుల్ని, అమ్మానాన్నల్ని వదిలేసి, తట్టాబుట్టా సర్దుకుని పరుగులు పెడుతున్నారు. స్వదేశం వదిలేసి మరో దేశం దాటి ఇంకో దేశంలో బతకాలని, కనీసం తలదాచుకోవాలనే ఆశతో, ఆత్రుతతో పరుగులు పెడుతున్నారు. రైళ్లు, బస్సులు, వ్యాన్లు ఏది దొరికితే అది. ఏదీ దొరక్కపోతే నడిచి, పరుగెత్తైనా సరే... ప్రాణాలు దక్కించుకోవాలనే ఆశ. సరిహద్దుల్లో సైనికులు, తుపాకులు, తూటాలు, ఆంక్షలు, అధికారాలు ఏవీ వారిని ఆపలేకపోతున్నాయి. ఎందుకిలా?

 
 
వేలాది మంది పిల్లలు, మహిళలు, మాసిడోనియా సరిహద్దుల్లో ఉన్న పొలాల్లో ఆరు బయటే పొలాల్లోనే నిద్ర పోతున్నారు. వీళ్లకు ఆహారం కాదు కదా. కనీసం మంచినీళ్లైనా ఇచ్చే దిక్కు లేదు. రాత్రి పూట భయంకరమైన చలి గాలుల నుంచి తట్టుకునేందుకు పగటి పూట కట్టెలు ఏరుకుని రాత్రిళ్లు చలి మంటలు వేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ కురిసే వర్షాలు వీరి కష్టాల్ని రెట్టింపు చేస్తున్నాయి. మంచినీళ్లు లేకపోతే అక్కడే గుంటల్లో ఉన్న వర్షపు నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నారు. విషాదం ఏంటంటే చిన్న పిల్లలకు కూడా అవే తాపుతున్నారు.
ఈ ప్రయాణంలో చాలా మంది చిన్నారులు తమ పెద్ద వారి నుంచి తప్పిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి. పాలు తాగే పిల్లలకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. సైనికులు దాడిచేసినప్పుడు తగిలిన గాయాలకు కనీసం కట్టు కట్టే దిక్కు కూడా లేదు. జబ్బులో బాధ పడేవాళ్లలో కొంతమంది వైద్య సాయం అందక సరిహద్దుల్లోనే చనిపోతున్నారు. చిన్నారుల్ని తమతో తీసుకెళుతున్న తల్లిదండ్రులు, తప్పిపోయిన చిన్నారులు, పిల్లల ఆకలి కేకలు, కనీసం ఒక్క పూటైనా బోజనం పెట్టలేక తల్లిదండ్రులు పడుతున్న బాధ... దేవుడా పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి వద్దనేలా ఉంది. చిన్నారుల కష్టాల్ని చూసి సైనికుల హృదయాలు ద్రవిస్తోన్నా... నిబంధనలు వాళ్ల చేతుల్ని కట్టేస్తున్నాయి.  
ఇదంతా గ్రీస్- మాసిడోనియా సరిహద్దుల మధ్య పరిస్థితి. మిడిల్ ఈస్ట్, సిరియా నుంచి వస్తోన్న శరణార్థులు గ్రీస్ గుండా ప్రయాణించి మాసిడోనియా సరిహద్దులకు వస్తున్నారు. వీరందరినీ భరించే శక్తి ఈ చిన్న దేశానికి లేదు. సిడోనియాలోని జెవలిజా పట్టణానికి చేరుకుంటే.. అక్కడ నుంచి రైల్లో యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్లవచ్చనేది శరణార్థుల ఆశ. శరణార్థుల్ని ఆపేందుకు  సైన్యం ఇనుప కంచె వేసినా,  టియర్ గ్యాస్, షన్ గ్రనేడ్లు ప్రయోగిస్తున్నా పరిస్థితుల్లో మార్పు లేదు. దీంతో గంటకు వెయ్యి మంది చొప్పున.. రోజుకు 8 గంటల పాటు శరణార్థుల్ని తమ దేశంలోకి అనుమతించేందుకు మాసిడోనియా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమ వంతు ఎప్పుడు వస్తుందా అని వేలాది మంది ఎదురు చూస్తున్నారు.
source:ntvpost.com

No comments