ద్రౌపతి పతివ్రతా? నిజమా !?

ద్రౌపతి పతివ్రతా? నిజమా !?
ఎందుకు మీకా సందేహం... ద్రౌపతి నిజంగా పతివ్రతే. అదెలాగండీ..ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ...అయిదుగురు భర్తలు గల ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందండీ? అబ్బ..ఎందుకండీ అంత కోపం..కాస్త శాంతంగా ఉంటే, మీ సందేహానికి సరైన సమాదానం నేను చెప్తాను కదా. ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి.. ద్రౌపతిగా జన్మించింది. ముందుగా ఒక చిన్న లెక్క. ఒక రూపాయికి వంద పైసలు.,పది పైసలు పది..,పావలాలు (ఇరవై ఐదు పైసలు) నాలుగు..,అర్థరూపాయిలు రెండు. అలాగే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు. పంచపాండవులు, ద్రౌపతి, నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనిజులే. ద్రౌపతి యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. ఇక ధర్మరాజాదులు కుంతి, మాద్రులకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే. కానీ...అలా జన్మించడానికి వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు. ఆ అసలు కథ ఏమిటంటే..
త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని’ ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. ‘మహేంద్రా.. ఎంతటి పాపమైనా తపస్సుతో తొలగిపోతుంది. కనుక తపస్సు చెయ్యి. అయితే.. బ్రహ్మహత్య దోషంతో ఉన్న నీకు, ప్రస్తుతం దైవీకశక్తులు ఏవీ తోడుగా ఉండవు. అటువంటి నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టం కాదు. కనుక, నీ పంచ ప్రాణశక్తులలో నాలుగు ప్రాణశక్తులను నీకు నమ్మకమైన మిత్రుల దగ్గర దాచివుంచి, ఒక ప్రాణశక్తిని నీదగ్గర ఉంచుకుని తపస్సు చేసి బ్రహ్మహత్యపాతక పరిహారం చేసుకో’ అని సలహా ఇచ్చాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన నాలుగు ప్రాణశక్తులను యమడు, వాయువు, అశ్వినీదేవతల దగ్గర దాచి తపస్సు ప్రారింభించాడు.

పాండురాజు భార్యలైన కుంతి, మాద్రులు... దూర్వాసుడు అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. కుంతి ప్రార్థనకు ప్రసన్నులైన యముడు, వాయువు, ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్వినీదేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..నకుల, సహదేవులు జన్మించారు. కనుక., పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ‘ఇంద్రుడు’. ఏ ఒక్కరు తగ్గినా.. పరిపూర్తి ఇంద్రుడు కాజాలడు. ఇక..ఇంద్రుడు బ్రహ్మహత్యపాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో, అతని భార్య శచీదేవి, అసురుల ఆగడాలకు భయపడి, తన భర్త తిరిగి వచ్చేవరకు తనకు ఆశ్రయం ఇమ్మని అగ్నిదేవుని అర్థించి ఆయన నీడలో కాలం గడుపుతోంది. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి..యఙ్ఞకుండం నుంచి ద్రౌపతిగా జన్మించి, పంచపాండవులకు అర్థాంగి అయింది. భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. ఒక్కరితో (ఒకే భర్త అయిన ఇంద్రునితో) ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ‘ద్రౌపతి’(శచీదేవి) కచ్చితంగా పతివ్రతే. సందేహం లేదు.
ఆమె ‘పంచభరృక’ కాదు. సినిమా కథలు నమ్మకండి. పురాణాలు చదవండి. వాటినే నమ్మండి. ఈ కథ ‘మార్కండేయ పురాణంలో’ ఉంది.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం
source:http://www.teluguone.com/devotional/content/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AE%E0%B0%BE-278-32984.html

1 comment:

  1. Drupathi's request at 1:34:30

    https://www.youtube.com/watch?v=JB1_n0LtUCY must be wrong then.

    ReplyDelete