మాగీ యాగీ





ఇందులో మోనోసోడియం గ్లూటా మేట్ పాలు ఎక్కువ కావడం వల్ల రక్తహీనత మోతాదు మరీ మించితే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా తెలుసుకోవలసిన అవసరం ఎంతవరకు ఉంది?


వ్యాపారానికి విస్వాసం పెట్టుబడి. మనకు తెలియని సమాచారాన్ని, మనకు తెలిసిన,మనం అభిమానించే వ్యక్తి తెలియచేయడమే ప్రకటన.బజారులో అమ్మే మిఠాయి తినవద్దంది అమ్మ.అటు వేపు కూడా చూడం. బజారులో ఉన్న ఫలానా పకో డి బాగుంటుందన్నాడు పక్కింటాయన. 'ఆయనెవరయ్యా చెప్పటానికి?' అంటాం.ఇంకా, పక్కింటాయన మేద కోపం ఉంటే పకోడి తిని మరీ ఆయన మాట తప్పని నిరూపిస్తాం. ప్రకటనకు పెట్టుబడి ఆ పెద్ద మనిషి పరపతి. 'పెద్దమనిషీ అంటున్నాను కాని, 'సినీ నటుడూ అనడం లేదు. కారణం ఈ మద్య ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం , సిరివెన్నెల, మనూ కూడా ప్రకటనల్లో పాల్గొంటున్నరు. ఆయా వ్యక్తుల పట్ల ప్రజల అభిమానం, విశ్వాసం ఆ ప్రకటనకు దన్ను.పిండి కొద్దీ రొట్టె.


మరీ బొత్తిగా ముఖం తెలియని వ్యక్తులతో ప్రకటనలు - చాలా సందర్బాలలో వారి అందమో, మాటలో ఆటలో చమత్కారమో కావచ్చు. కత్రినా కైఫ్, జెనీలియా, ప్రీతీజింట మొదలైనవారు ప్రకటనల ద్వారా వెండి తెరకు వచ్చినవారు. ఇర్ఫాన్ ఖాన్, ఓం పురీ లంటి వాళ్ళు వెండి తెర ద్వారా ప్రకటనలలో ప్రకటనల్లో జొరబడిన వారు. దేనికైనా పరపతి, ప్రచారమే ముఖ్యం.  


బొత్తిగా ప్రకటనల వ్యవహారం తెలియని వారు కొందరు ఈ మద్య నన్ను అదిగారు, "అయ్యా! ఒక నిమిషం ప్రకటన సినిమాలో నటించటానికి అంత డబ్బు ఎందుకండీ?" అని. చూడటానికి ఇది విపర్యం లానే కనిపిస్తుంది. కాని ఇందులో తిరకాసు ఉంది. బండగా చెప్పాలంటే 'సినిమా' నూనె తయారు చేసే గానుగ. 


ప్రకటన సీలు వేసి నూనెను సూపర్ మార్కెట్ లో అమ్మే దుకాణం. ప్రకటన కరెన్సీ. ప్రకటనకు ఎక్కువ డబ్బు ఇచ్చేది - వ్యవధిని బట్టి కాదు. ఆ వ్యక్తి పరపతిని బట్టి. "మీరు ఖరీదు చేసేది ఆ నిమిషాన్ని కాదు. డబ్బు చేసుకొనేది - ముప్పై సంవత్సరాలు ఆ నటుదు కూడబెట్టుకున్న పరపతిని. అమితాబ్ బచ్చన్ చేతిలో కొంగమార్క్ పళ్ళపొడి పొట్లం ఉంతే కోటి మంది దాన్ని గుర్తిస్తారు. అప్పలకొండ అనే వ్యక్తి చేతిలో ప్రఖ్యాత టూత్ పేస్ట్ ట్యూబ్ ఉంటే పక్కవాడు కూడా గుర్తించడు. 

ఎన్.టి.రామరావుకి వేసే వోటు ఆయన నిరూపించిన ఒక జీవితకాలపు సంప్రదాయం పట్ల చూపే విశ్వాసం. స్క్రీన్ ప్లే రచనలో  బండ సూత్రం - తెలియని విషయాన్ని తెలిసిన మార్గంలో పరిచయం చేయాలి. మరొక్కసారి -గుర్తింపుకి 'విశ్వాసం' పెట్టుబడి. కావాలనే ఈ సారి వ్యాపారం అనడం లేదు.


అమితాబ్ బచ్చన్ తెరమీద తొడుక్కోమన్న చెప్పుల్ని మనం తొడుక్కుంటున్నమంటే అర్దం - మనకు తెలిసిన, మనం అభిమానించే , మనం నమ్మిన ఓ వ్యక్తి మనలాగే ఆ పని చేసి త్రుప్తి చెందాడు కనుక. అమితాబ్ బచ్చన్ చెప్పుల తయారీ దిగ్రీ సంపాదించినవాడు అని కాదు. " ఈ కారు అద్భుతం " అని మనకు తాళాలు చూపించే హిందీ నటుదు షారుఖ్ ఖాన్ ని, "ఎమయ్యా! నువ్వెప్పుడైనా ఆటోమొబైల్స్ కోర్స్ చేసవా?" అని ఎవరైనా అడిగారా?


ఇప్పుడు అసలు కధ. అలా అడగాలా?వద్దా? దేశమంతా ఆవురావురని తింటున్న మాగీ నూడిల్స్ , గొప్పవని, మంచివని ముగ్గురు తారలు మనకుచెప్పారు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా. గత ముప్పై సంవత్సరాలుగా దేశమంతా తింటోంది. ఇప్పుడు మాగీ నూడిల్స్ ను చాలా రాష్ట్రాలు బహిష్కరించాయి. నెస్లే సంస్తే ఈ సరుకుని ఈ దేశం నుంచి ఉపసమహరించింది.


ఇందులో సినీ తారల బధ్యత ఎంత వరకు ఉంది? ప్రపంచమతటా వ్యాపారం చేస్తున్న ఓ కార్పోరేట్ సంస్థ సరుకును ఆ సంస్థ పరపతి ద్రుష్ట్యా అంగీకరించి బోలెడంత డబ్బు పుచ్చుకొని ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇందులో మోనో సోడియం గ్లుటా మేట్ పాలు ఎక్కువ కావడం వల్ల రక్త హీనత , మోతాదు మరీ మించితే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా తెలుసుకోవలసిన అవసరం ఎంతవరకు ఉంది?


వారి మేద కేసులు నమోదయ్యయి. తీరా వాదప్రతివాదనలు జరుగుతాయి. తమ విశ్వసాన్ని పెట్టుబడిగా వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి సరుకును ఏమాత్రం మంచి చెడ్డలు తెలుసుకోకుండా సమర్దించడం నేరమే కదా! అయితే ముప్పై సంవత్సరాలు తెలుసుకోవలసిన, తెలియజెప్పవలసిన జాతీయ సంస్తకే ఈ నిజం తెలియ లేదు కద!అయితే ఇది సమర్దించుకొనే 'కారణం' అవుతుందా? 


విశ్వాసాన్ని పెట్టుబడిగా వినియోగించుకుంటున్న వ్యాపారికి, దాన్ని డబ్బు చేసుకుంటున్న 'సినీతార 'కి సామాజిక బాధ్యతల పాళ్ళు ఎంతవరకూ ఉన్నాయి? ఇది నీతికీ,న్యాయానికీ,చట్టానికీ కొరుకుడు పదనివిచికిత్సే విచారణ, న్యాయవాదుల వాదనలూ ఆసక్తికరం గా ఉండక తప్పవు.
                                                                 --  జీవన కాలం
                                                                 గొల్లపూడి మారుతీరావు

No comments