లక్ష్మిదేవి కుమార్తె, పార్వతిదేవి కూమారుని వివాహం

శ్రీకుమారస్వామి కల్యాణ వైభోగం ...




.ఒకసారి శివపరమాత్మ తనయుడు సుబ్రహ్మణ్యస్వామి తన తండ్రితోపాటు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో విష్ణుదేవుని కుమార్తెలైన అమృతవల్లి, సుందరవల్లిలు సుబ్రహ్మణ్యేశ్వరుని చూసిన మొదటిచూపులోనే ప్రేమావేశపూరితు లై, తాము ఆయనను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. వారి కోరికను మన్నించిన సుబ్రహ్మణ్యస్వామి ,వారి కోరిక నెరవేరాలంటే, వారు మరొక జన్మ ధరించక తప్పదని చెప్పాడు. ఫలితంగా అమృతవల్లి ఇంద్రుని కూతురు దేవసేన అనే పేరుతో, సుందరవల్లి పుళింద దంపతుల పుత్రిక శ్రీవల్లిగా అవతరించారు. అయితే సుందరవల్లి ఆవిర్భావం అమృతవల్లిలా ఏమంత సులభంగా జరుగలేదు. ఆమె సుందరవల్లి రూపాన్ని ధరించడానికి పెద్ద తంతే జరిగింది.పూర్వం ఒకసారి విష్ణ్యంశ సంభూతుడైన ఉపేంద్రుడు, సర్వాంతర్యామియైన విష్ణుమూర్తి దర్శనం కోసం వైకుంఠానికి వెళ్లాడు.

స్వామిని దర్శించుకున్న ఉపేంద్రుడు, విష్ణుమూర్తి, లక్ష్మీ దేవీలతో మాట్లాడుతుండగా, వైకుంఠానికి కణ్వ మహర్షి రావడం జరిగింది. మాటలలో మునిగిపోయిన ఈ ముగ్గురూ కణ్వమహర్షి రాకను గమనించలేదు. ఫలితంగా కోపోద్రిక్తుడైన కణ్వమహర్షి, ఆ ముగ్గురిని శపించాడు. విష్ణుమూర్తిని కొన్ని జన్మలపాటు మూగవానిగా ఉంటూ శివభక్తునిగా బతుకును ఈడ్చుకురావాలనిశపించి, లక్ష్మీదేవిని లేడిరూపాన్ని పొంది కారడవులలో తిరుగాడుతుండాలని శపించాడు. ఉపేంద్రుని ఓ పుళిందునిగా (వేటాడి జీవించే వాడు) జన్మించమని శపించాడు. వెంటనే శ్రీమహా విష్ణువు పరుమశివుని తలచుకోగానే, అక్కడ ప్రత్యక్షమైన శివుడు, తన భక్తు డైన కణ్వమహర్షితో ఎన్నో జన్మలపాటు కొనసాగే ఆ శాపాన్ని ఒక జన్మతో సరిపెట్టవలసిందంటూ సూచించాడు. కణ్వమహర్షి కూడ జరిగిన తప్పిదానికి నొచ్చుకుని శాపాన్ని ఓ జన్మకే పరిమితం చేశాడు.

ఫలితంగా విష్ణువు - శివముని అనే పేరుతో వల్లీ పర్వతప్రాం తాలలో సంచరించడం మొదలెట్టాడు. అక్కడే లక్ష్మీదేవి లేడిరూపంలో సంచరించసాగింది. ఒకసారి శివముని అడవిలో తిరుగాడుతున్న లేడిని చూసి ముగ్ధుడై, ఆ లేడితో మానసిక రతికేళి గావించాడు. ఫలితంగా ఆ లేడి గర్భం ధరించి ఓ స్ర్తీశిశువుకు జన్మనిచ్చి, స్తన్యమిస్తూ కాపాడుతూ వస్తోంది. ఇలా విష్ణుపుత్రిక సుందరవల్లి ఈ బిడ్డ రూపంలో భూలోకాన అవతరించింది. ఈలోపు కణ్వమహర్షి శాపానికి గురైన ఉపేంద్రు డు, తొండైనాడు ప్రాంతంలో వల్లిమలై కొండలమధ్య నంబి అనే పేరుతో జన్మనెత్తి, యుక్తవయస్కుడై పెళ్లి చేసుకున్నాడు. అతనికి సంతానభాగ్యం కలిగినప్పటికీ, అందరూ మగపిల్లలే కావడంతో, తనకు ఆడపిల్ల కలుగలేదనే విచారం అతడిని పట్టి పీడిస్తుండేది.

ఓకసారి నంబి దంపతులు వేట కోసం అడవికి వెళ్ళగా, మనుషుల అలికిడిని విన్న లేడి దూరంగా వెళ్ళిం ది. లేడి దూరంగా వెళ్ళడంతో పసికందు బిగ్గరగా ఏడవసాగింది. ఆ పసిబిడ్డ ఏడుపు వినిపిస్తున్న దిక్కుకు వెళ్ళి చూసిన నంబి దంపతులు, అక్కడున్న ఆడబిడ్డను చూసి, మిక్కిలి సంతోషించినవారై, తమకు స్ర్తీ సంతానం లేని లోటు తీర్చడానికి భగవంతుడే ఈ విధంగా ఆశీర్వదించాడని తలచి, ఆ బిడ్డను తమ వెంట తీసుకెళ్ళి, వల్లి కొండలలో దొరికినందున శ్రీవల్లి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.దినదిన ప్రవర్ధమానమైన వల్లి యుక్తవ యస్కురా లైన పిదప తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం జొన్నచేలు దగ్గరకెళ్ళి, మృగపక్ష్యాదుల నుండి పంటలను కాపాడుతూ, మంచెను ఎక్కి పాట లు పాడుతూ, వడిసెలతో రాళ్ళను రువ్వుతూ, ఎంతో ఆనం దంగా పొద్దుపుచ్చుతుండేది.

ఒకసారి అటుగా వచ్చిన నారదమహర్షి, జొన్నచేలో కాపలా కాస్తున్న అపురూప సౌందర్యరాశి శ్రీవల్లిని చూసాడు. ఆయన మనసులో చటుక్కున ఓ మెరుపులాంటి ఆలోచన. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యస్వామి కి చెబితే, అంతా మంగళప్రదంగా జరుగుతుందనుకున్న నారదుడు, వెంటనే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు ఉన్న తణికై అనే ప్రదేశానికి వెళ్ళి, శ్రీవల్లి గుణగణ, రూప లావణ్యాలను గురించి చెప్పాడు. నారదుని మాటలకు స్పందించిన స్వామివారు వేటగాని వేషంలో వెళ్ళి వల్లి పర్వత ప్రాంతంలో పొలంలోనున్న శ్రీవల్లిని తిలకించాడు. ఆమె సౌందర్యం ఆయనను పరవశింపజేసింది. ఆ సమయంలో శ్రీ వల్లికి ఆమె తల్లిదండ్రులు అన్నం పెడుతున్నారు. అప్పుడక్కడకు వెళ్ళడం సమంజసం కాదు.

కాబట్టి కాసేపు చెట్టు చాటున నక్కి, వారు వెళ్ళిన తర్వాత వల్లిని సమీపించాడు. వేటగాని రూపంలోనున్న స్వామివారిని చూడగానే వల్లిలో సిగ్గులు మొగ్గలు తొడిగాయి. మాయారూపంలోనున్న శ్రీస్వామి వారు, తన వృత్తాంతాన్ని శ్రీవల్లికి చెప్పి, తాను ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని, తాను జాతి మత కుల భేదాలకు అతీతుడనైనందున పెళ్ళికి అంగీకరించమని కోరాడు. స్వామివారు చెప్పిన మాటలను వినగానే శ్రీవల్లికి కోపం వచ్చింది. పరపురుషుడైన అతడు అంత చనువుగా మాట్లాడటం ఆమెకు గిట్టలేదు. ‘ఒకరి జీవితంలో వివాహమనేది అత్యంత కీలకమైన ఘట్టం.

అటువంటి విషయాన్ని పెద్దల సమ్మతం లేకుండా ఒంటరిగా వున్న తనతో మాట్లాడటం తగదని చెప్పిన వల్లి, స్వామి వారి కోర్కె ను తృణీకరించింది. ఇంతలో పాటలు పాడుతూ, డప్పుల శబ్దం చేస్తూ, పాటలు పాడుకుంటూ, వేటగాళ్ళు అక్కడకు గుంపులు గుంపులుగా రావడాన్ని చూసిన వల్లి, స్వామితో, తనవాళ్లు కఠిన హృదయులని, ఒంటరిగావున్న కన్యతో పరపురుషుడు మాట్లాడటం వారికి నేరంగా తోస్తుందని, అట్టి వారిని కఠినంగా శిక్షిస్తారని, కాబట్టి వెంటనే వెళ్ళిపొమ్మని హెచ్చరించింది. వెంటనే స్వామివారు ముసలిరూపంతో శివభక్తునిగా రూపొందాడు.

అక్కడికి వచ్చిన నంబి, అతని పరివారం శివభక్తునికి నమస్కరించి, ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళిపోయారు. శివభక్తునికి, శ్రీవల్లి భోజనం పెట్టి, మంచినీళ్ళ కోసం దగ్గర్లోనున్న కొలను దగ్గరకు తీసుకెళ్ళింది.మంచినీళ్ళు తాగి సేదతీరిన స్వామివారు, ‘నువ్వు ఆకలితోవున్న నా క్షుద్భాదను తీర్చావు. కానీ, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకోవడం లేదు. ఇద్దరు కలసి ఏడడుగులు నడిస్తే స్నేహితులవుతారని అంటారు. మనమిప్పుడు స్నేహితులం. కాబట్టి, నా కోరికను మన్నించి, నన్ను పెళ్ళిచేసుకో’ అని స్వామి వారు శ్రీవల్లిని అర్థించాడు. ఆమె మారుమాట్లాడకుండా మౌనంగా పొలం వద్దకు వెళుతోంది.

అంతలో స్వామివారు ఆమె వెనుకగా నడుస్తూ, తన సోదరుడైన వినాయకుని, తనకు వల్లితో పెళ్ళి జరిగేందుకు సాయపడమని ప్రార్థించాడు. వినాయకుడు ‘తథాస్తు’ అన్నాడు. వెంటనే అక్కడొక ఏనుగు ప్రత్యక్షమైంది. ఆ హఠాత్‌ పరిణామానికి, భయవిహ్వలురాలైన శ్రీవల్లి పరుగెత్తుకుంటూ పెళ్ళి స్వామివారిని ఆలింగనం చేసుకుంది. స్వామివారు ఆమెను అనురాగపూర్వకంగా అనునయిస్తూ, తన నిజ స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. అంబికా తనయుడైన షణ్ముఖుడు మయూరవాహనుడై, పన్నెండు చేతులతో, వేయి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ, శక్తి ఆయుధాన్ని చేతబట్టి కుక్కుట ధ్వజాన్ని ధరించి, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క కార్యాన్ని నిర్వహిస్తున్నట్లుగా దర్శనమిచ్చాడు.

ఒక ముఖం ప్రకాశవంతమై శుభసందర్శన సందేశం ఇస్తోంది. రెండవ ముఖం పరమేశ్వరునికి ఓంకార అర్థాన్ని తెలియజేస్తూ విజ్ఞానవంతమై భాసిల్లుతోంది. మూడవ ముఖం తనను సేవించే భక్తుల యొక్క క్రూరకర్మలను నశింపజేయడానికి ఉన్నట్లుగా ప్రకాశిస్తోంది. నాలుగవ ముఖం దుష్టశక్తులను నిర్మూలించడానికి ఏర్పడినట్లుగా వెలుగొందుతోంది. ఐదవ ముఖం ప్రసన్నమై భక్తుల కోరికలను తీర్చడానికి కొంగుబంగారమై వెలసి ఉంది. ఆరవ ముఖం శ్రీవల్లిని వివాహం చేసుకునే కూతుహలంతో ప్రేమాభిమానములను వెదజల్లుతున్నట్లుంది.

అప్పుడు శ్రీవల్లి షణ్ముఖునికి పాదాభివందనం చేసి, ఆయనతో వివాహానికి సుముఖురాలయ్యింది. వీరిద్దరి ప్రేమ ఫలించింది కానీ, పెళ్ళి ఘడియలు ఇంకా దగ్గరపడ లేదు. పొలాల్లో పంట ధాన్యం ఇళ్ళకు చేరగానే, శ్రీవల్లి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. స్వామి వారి ఎడబాటును తట్టుకోలేక పో యిన వల్లి, తన తల్లిదండ్రులతో ముభావంగా ఉండసాగిం ది. ఈ విషయాన్ని గమనించిన శ్రీవల్లి తల్లి సోదె చెప్పే కురువంజిని పిలిపించి, తన కుమార్తె వ్యధ వెనుకగల కారణాన్ని అడిగింది.

అప్పుడు సోదెగత్తె శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో జరిగిన ప్రే మ వృత్తాంతాన్ని చెప్పింది. ఇంతలో శ్రీవల్లి కోసం పొలాల దగ్గరకు వెళ్ళిన స్వామివారు, ఆమె అక్కడ కనిపించకపోవడంతో, ఆమెను వెదుక్కుంటూ ఆమె యొక్క ఊరు మేర్పట్టికి చేరుకున్నాడు.
స్వామివారు తన గ్రామానికి వచ్చిన విషయా న్ని తన స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న వల్లి, ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళింది. ఇంట్లో కూతురు కనబడకపోవడంతో వల్లి తండ్రి నంబి, ఆమెను వెదకడానికి వేటగాళ్ళను పంపాడు. అడవిలో శ్రీవల్లి, షణ్ముఖులను చూసిన నంబి సైన్యం, ఆయనపై బాణవర్షాన్ని కురిపించింది. స్వామి వాటినన్నింటినీ, తన వేలాయుధంతో భగ్నం చేశాడు.

అనంతరం స్వామి, వారికి తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి, తన పుట్టుకలోని అంతరార్థాన్ని వారికి విరించాడు. అప్పుడక్కడకు వచ్చిన నారదుడు, నంబి దంపతులతో శ్రీవల్లిని షణ్ముఖునికి ఇచ్చి వివాహం చేసి జన్మసార్థకం చేసుకొమ్మని చెప్పగా, ఆ దంపతులు తమ పూర్ణసమ్మతిని తెలియ జేశారు. అనంతరం కొండ జాతి వారి ఆచారం ప్రకారంచ పులిచర్మంపై వధూవరులను కూర్చోబెట్టి, వినాయకుని సమక్షంలో శ్రీదేవసేన అంగీకారంతో, ఆది దంపతులు ఆశీర్వదించగా, ముక్కోటి దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తుండగా, పదునాల్గు భవునాలు ఆనందించేటట్లుగా, అంగరంగ వైభవంగా శ్రీవల్లీ శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుల వివాహం జరిగింది.

అంతకు ముందు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుని వివాహం జరిగింది. వారి పెళ్ళికి ముందు సమస్త లోకాలు తారకాసురుని పాలనలో విపరీతమైన కష్టనష్టాలకు లోనవుతున్న సమయం. దేవేంద్రుని కూతురు దేవసేనను కుమార స్వామికిచ్చి పెళ్ళి చేస్తే తారకాసురుని సంహారానికైన మార్గం సుగ మం అవుతుందని బ్రహ్మదేవుడు చెప్పగా, ఇంద్రుని కూతురైన దేవసేనకు, కుమార స్వామికి అత్యంత వైభవంగా పెళ్ళి జరిగింది. అనంతరం కుమార స్వామి తారకాసురుని సంహరించాడు.
కసారి శివముని అడవిలో తిరుగాడుతున్న లేడిని చూసి ముగ్ధుడై, ఆ లేడితో మానసిక రతికేళి గావించాడు. ఫలితంగా ఆ లేడి గర్భం ధరించి ఓ స్ర్తీశిశువుకు జన్మనిచ్చి, స్తన్యమిస్తూ కాపాడుతూ వస్తోంది. ఇలా విష్ణుపుత్రిక సుందరవల్లి ఈ బిడ్డ రూపంలో భూలోకాన అవతరించింది.

వేటగాని రూపంలోనున్న స్వామివారిని చూడగానే వల్లిలో సిగ్గులు మొగ్గలు తొడిగాయి. మాయారూ పంలోనున్న శ్రీస్వామి వారు, తన వృత్తాంతాన్ని శ్రీవల్లికి చెప్పి, తాను ఆమెను పెళ్ళి చేసుకోవాల నుకుంటున్నానని, తాను జాతి మత కుల భేదాలకు అతీతుడనైనందున పెళ్ళికి అంగీకరించమని కోరాడు.ఈవిధంగా కుమారస్వామి పెళ్ళిళ్ళు అత్యంత వైభవోపేతంగా జరిగాయి.
శ్రీ వల్లీ వివాహం ....
మరో కథనం ప్రకారం లక్ష్మిదేవి కుమార్తె పార్వతిదేవి కూమారుని వివాహం .....
సుబ్రహ్మణ్యస్వామికి, లక్ష్మిదేవి కుమార్తె అయిన శ్రీవల్లీదేవితో వివాహం చెయ్యాలని పార్వతిదేవి మనసు పడిందట. బుద్ధిమంతురాలు, మహాసౌందర్యవతి, పైగా సంపదల తల్లి తనయ శ్రీవల్లి.
ఆ విషయమే తన భర్త అయిన శివభగవానుడితో చెబితే ఆయన నవ్వి ధ్యానంలోకి వెళ్ళిపోయాడట. దాంతో పార్వతి లక్ష్మిదేవితో విషయం కదిలించింది. ’ మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేస్తే మా అమ్మాయికి లభించేదేముంది? మంచుకొండ, రుద్రాక్షమాలలు, ఇంత విభూది తప్ప ’అని పెదవి విరిచేసరికి, పార్వతిదేవి కన్నీటి పర్యంతమై శివునికి విషయం చెప్పి విచారించింది.

అప్పుడు శివుడు తన ఒంటిమీది ఓ రుద్రాక్షనిచ్చి ’ఈ ఎత్తు బరువు తూగే బంగారాన్ని ఇమ్మని అడుగు’ అని పంపిస్తాడు. పార్వతిదేవి శివుడిచ్చిన రుద్రాక్షతో లక్ష్మిదేవిని కలిసి, తన వచ్చిన పని చెబుతుంది. లక్ష్మిదేవి ఆ రుద్రాక్షను ఓ త్రాసు తెప్పించి తూచాలని చూసింది, తన ఒంటిమీది ఆభరణాలేకాదు, తన సంపదనంతా వేసి తూచినా ఆ రుద్రాక్ష తూగక పోయేసరికి ఆ సంపదల తల్లి ఖిన్నురాలైపోతుంది.

’ఇంకా ఇలాంటి రుద్రాక్షలు నా స్వామివద్ద ఎన్నో వున్నాయి’ అని పార్వతి అనేసరికి పశ్చాత్తాపం చెంది తన కుమార్తెను షణ్ముఖునికిచ్చి వివాహం చేస్తుంది. ఆ తర్వాత దేవసేన అనే మరొ యువతితో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని వివాహం జరుగుతుంది.

No comments