మా సినిమాలు:బాపు-మొదటి భాగం
సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని భావాలను అలవోకగా ప్రకటించినా, తన సినిమాల గురించి అరుదుగా మాట్లాడే ’మితభాషి.’ మొదటిసారిగా తన చిత్రాల సిత్రాలను పాఠకుల ముందు పరుస్తున్నారు. ఆస్వాదించండి….
నవతరంగం లో ఈ వ్యాసాల సీరీస్ ను ప్రచురించే అవకాశం కల్పించిన తెలుగునాడిసంపాదకులకు, మా తెలుగు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – TAL, ) సంపాదకులకు మరియు మనందరికీ వారి సినిమాల గురించి తెలుసుకునే అవకాశం కల్పించిన బాపు-రమణ లకు హృదయపూర్వక ధన్యవాదాలు.
——–*——–
మా సినిమాలు
పరిచయం:నా గురించి నేను చెప్పుకోకూడదుగానీ- ఆంధ్ర ప్రేక్షక మహాశయుల హృదయాల్లో నాకొక ప్రత్యేక స్థానం ఉందని గర్వంగా చెప్పుకొంటున్నాను. ఆంధ్ర ప్రేక్షక మహాశయులందరూ కాదనుకోండి- ఒక ఉత్తమయిల్లాలు. ఆవిడ భర్తతో తప్ప సినిమాకి వెళ్ళదు. నా సినిమా రాగానే భర్తతో, ’ఏవండీ బాపుగారి సినిమా రిలీజయింది, ఇవాళ మొదటాత కెడదామండీ,’ అనేది. ఆయన ’ఇవాళ శుక్రవారం కదే.రేపాది వారం వెడదాం’ అనేవారు. ఆవిడ, ’అంతవరకూ ఉండదండీ,’ అని కంటనీరు తుడుచుకొనేది.
రమణగారి స్క్రిప్టు ప్రతి సీనూ విజువలైజ్ చేసుకొని, లొకేషన్ & యాక్షన్ తో సహా వుంటుంది. స్టార్టు, కట్టు చెప్పడమే ప్రతిభ. సాక్షి సినిమా కథ డైలాగుల వల్ల నిలిచింది గానీ, పాత్రల నటనలో నాటకీయత, ఓవరాక్షన్ లేకుండా చూడవలసిన దర్శకుని బాధ్యత బొత్తిగా కనిపించదు. నా గాడ్ ఫాదర్ అయిన ఒక దొరగారు, “If our people see it, they will laugh at the wrong places” అన్నారు. కానీ మొత్తం సినిమా ఔట్ డోర్ లో నాచురల్ సరౌడింగ్స్ తీశామన్న తృప్తి. మా ఫ్రెండు బి.వి.యస్. రామారావు పులిదిండిలోనే ఒక గుడిసె సెట్ వేశాడు. (అప్పుడు మాకు డైరెక్టరూ, డ్యాన్సు డైరెక్టరూ అంటూ లేరు. నటులు కూడా మా ఆఫీసుకొచ్చి షూటింగుకి వెళ్ళేముందు రిహార్సల్స్ చేసేవారు.) ఆ సెట్ ఎంత బాగా వేశాడంటే ఊళ్ళో పాడుపడిపోయిన ఇంటివారికి కొత్తవి కొనిచ్చి ఆ పాత ద్వారబంధాలు తెచ్చి కట్టాడు.
పులిదిండి లాంటి కుగ్రామానికి ARC and BRUTE లాంటి లైట్లు తెప్పించారు సెల్వరాజ్ గారు. అవి మోసే లారీకి కాలవపక్క రోడ్డు పట్టకపోతే కొమ్మలు కొట్టి మరీ దారి వేశాం. మొదటి రోజు షూటింగు వేణుగోపాలస్వామి గుడిలో (ఇక్కడే కృష్ణగారు, విజయనిర్మలగారు పెళ్ళి చేసుకొన్నారు) అమ్మకడుపు చల్లగా….అత్త కడుపు చల్లగా….బతకరా బతకరా పచ్చగా…అన్న ఆరుద్రగారి పాటతో మొదలెట్టాం. మధ్యాహ్నం నాలుగింటికల్లా పాట అయిపోయింది. మొత్తం పంతొమ్మది రోజుల్లో షూటింగు పూర్తయింది.
ఎన్ని రోజుల్లో తీస్తే అన్ని పూటలే ఆడుద్ది అని పెద్దలు దీవించడం వల్ల దాని డబ్బు దానికొచ్చేసింది.
విజయనిర్మల చెరువొడ్డున దిగులుగా కూచుని చెర్లో రాళ్ళేస్తున్న కృష్ణతో- రాయి బుడుంగుమని పడిన చుట్టూరా అలలు చూపించి, “సెర్లో రాయేస్తే సెరువంతా కదులుద్ది. మంచి మడిసిని కొడితే ఊరంతా తగులుద్ది,” అంటుంది. గూండాని ఎదిరించడానికి సాయం చేయడానికి భయపడి ఊరంతా తలుపులేసేసుకుంటే నిర్మల, “పక్కిల్లు అంటుకున్నప్పుడు మనిల్లు తలుపులు వేసేసుకుంటే మనం క్షేమంగా ఉంటామా,” అని నిలదీస్తుంది.
పబ్లిసిటీ డిజైన్లు బాగా వచ్చాయి. సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక లక్షా ఎనభై వేలు.
మా శ్రేయోభిలాషి అక్కినేని నాగేశ్వరరావుగారు- “మీ మొదటి పిక్చరు హిట్టవపోవడం నాకు ఆనందంగా ఉంది. అయితే, మొదణ్ణించే కళ్ళు నెత్తికెక్కే ప్రమాదం ఉండేది,’ అన్నారు.
సీన్ తీసే ముందు రోజు అసిస్టెంట్ డైరెక్టరు-స్క్రిప్టు చూసి కావలసిన స్పెషల్ ప్రాపర్టీస్ (అంటే మంచం, టూత్‍బ్రష్, దువ్వెన, మరచెంబు-ఇలాటివి) లిస్టు వేసుకు ప్రొడక్షన్ మేనేజరుకి చెప్పి మన్నాడు సెట్ లో ఉండేట్లు చూస్తాడు. ఈ లిస్టులో చూస్తే ’పడుకొన్న అబ్బాయికి ఒక కొంటె కిరణం వచ్చి పొడిచింది. అతను అటు ఇటు తిరిగి దుప్పటి మొహం మీదకి లాక్కొన్నాడు,’ అనీ, ఇంకో సీనులో ’అతని మొహం నలిగిన కాయితంలా ఉంది’ అని ఉంది. గ్రాఫిక్స్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో రమణ గారి భావం తప్పక తీసుకువాచ్చు. కానీ ఆ రోజుల్లో మా అసిస్టెంటు కాగితం ఉండలోంచి మొహం ఎలా తయారు చేద్దాం అనుకొన్నాడో ఇప్పటికీ అర్థం కాదు.
సినిమా ఖరీదు రెండున్నర లక్షలు. (అందులో యాభై వేలు స్టార్స్ కి ఇచ్చిన సెగరెట్లూ మొదలైన వాటికే అయిందిట. తరువాత నుంచి రమణగారు ఊరికే సిగరెట్లు ఇవ్వడం ఆపేశారు.)
జంధ్యాలగారు బంగారు పిచిక టూ ఎర్లీ, పెళ్ళికొడుకు టూ లేట్ అని ప్రశంసించారు.
—బాపు
Post a Comment