శ్రావణ మాసం విశిష్టత
మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు . ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడనున్నాయి. శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరిన్చుకొని ప్రతి జిల్లాలోని ఆలయాల్లో చళువ పందిళ్ళు, బారీకేడ్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు .
శ్రావణమాసము శుభఫలాల నెల . ముత్తైదువులందరూ ఉత్సాహముగా , సంబరముగా పండుగలు , పూజలు , పేరంటాలు జరుపుకునే మాసము . శ్రావణమాసము లో లక్ష్మీదేవిని మనసరా పూజిస్తే సిరి సంపదులు చేకూరుతాయి.
ఈ నెలలో ప్రతిరోజూ కూ ఒక ప్రత్యేకత ఉన్నది . విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రము న పుట్టినారు . ఈ నెలలో జన్మించినవారు వేదొక్త కర్మలు నిర్వహించడము , సకలజనుల గౌరవమన్ననలు పొందడము , సిరిసంపదల సమృద్ధి తో జీవనము సాగించ గలరని నమ్మకము . ఈ నెలలో జనిమించిన మహానుభావులలో -- శ్రీకృష్ణ పరమాత్మ , హయగ్రీవోత్పత్తి , అరవింద యోగి ముఖ్యులు .
మాఘమాసము లో ఆదివారాలు , కార్తీక మాసములో సోమవారాలు , మార్గశిరమాసములో లక్ష్మివారాలు -- ఇలా ఒక్కోమాసములో ఒక్కొక్క రోజు పవిత్రదనాలుగా భావిస్తారు . ఐతే శ్రావణమాసములో అన్నిరోజులు పవిత్రమైనవే ... ప్రతిదినము ముఖ్యమైనదే .
ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.
సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం,
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,
భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అళ్ళుల్లు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది.
పరమశివుడి వారం ... సోమవారం భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ కొలువగానే కొలువుదీరే శివునికి శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటిని శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూళం, దక్షణ సమర్పించి భక్తులు శివుడికి హారతిస్తారు. బిలువ పత్రాలు, ఉమ్మెత, కలువతుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితీ.
శుభాలు కలిగే .. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.
నాగపంచమి శ్రావణమాసం మొదలైన నాలుగవ రోజునే వచ్చే పండుగ నాగపంచమి, శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే ... పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
బ్రాహ్మణులు ఈ మాసంలో పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు.
వరాలిచ్చే తల్లి ... వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శనిగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.
అనురాగ బంధాల ప్రతీక... రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల అనురాగ బంధాల ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుంది. పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి రాఖీ పౌర్ణమి అని అంటారు. సకల వేళల తమకు రక్షణగా నిలువాలని కోరుకుంటూ స్త్రీలు తమ సోదరుల ముంజేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు. సోదరులకు తీపి తినిపించి ప్రేమతో ఇచ్చే కానుకలను అందుకుంటారు. ముకుందాష్టమి ముకుందా....ముకుందా అంటూ శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు కోలహాలాల మధ్య నిర్వహించుకుంటారు. అష్టమి తిథి రోజున వచ్చే శ్రీ కృష్ణుని పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. చిన్నారులు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. సాయంత్రం వేళలో నైవేద్య కార్యక్రమాలు పూర్తయ్యాక ఉట్టిగట్టి కోలహాలం చేస్తారు.
శ్రావణ వంటలు -- ఆరోగ్యప్రదాయము :
ఆషా్ఢ మాసము వెళ్ళిపోయి శ్రావణము వచ్చిందంటే మహిళలకు సందడే సందడి . వరలక్ష్మికి తొలిపూజ చేయడం ద్వారా తకము సౌభాగ్యము , ఐశ్వర్యము కలగాలని కోరుకుంటారు . అయిటే ఇందులో అంతర్లీనము గా ఆరోగ్య రహస్యము కూడా ఇమిడి ఉంది . వర్షాకాలము ప్రారంభం లో సాదారణము గా ప్రబలే పలు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి ఈ వ్రతాల ద్వారా లభిస్తుంచి . వరలక్ష్మీ పూజలో తొమ్మిది రకాల పిందివంటలు , ఈ ఋతువులో లభించే పండ్లు , వివిధ పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదం గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు . ఇంకా కుటుంబ సభ్యులలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది . మహిళలు పేరంతం పేరుతో ఇరుగుపొరుగు వానిని ఆహ్వానించి పరస్పరము వెళ్ళి వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహభావము పెరుగుతుంది .
తొమ్మిది రకాల పిండివంటలు :
పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేసిన ఈ బూరెలు తినడం ద్వారా ప్రోటీన్లు సమంద్దిగా లభిస్తాయి .
పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు . గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు , తగినంత పంచదార , జీలకర్ర వేస్తారు .. ఇది భుజించడం ద్వారా మేధస్సు వికసిస్తుంది .
గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . గారెలంటే అందరికీ ఇస్టము . ఇందులొ ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయి .
పరమాన్నము : పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్న, పంచదార .. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది . దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది .
చెక్కెర పొంగలి : బియ్యము , పాలు , నెయ్యి . పెసరపప్పు , జీడిపప్పు , కిస్ మిస్ , మిరియాలు వేసి తయారవుతుంది గాన మెదడు , ఇతర అవయవాలు చురుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి .
పులిహోరా : బియ్యము , పసువు , జీడిపప్పు , వేరుసెనగ పప్పు , ఇంగువ వేసి తయారవుతుంది . దీనిని తినడం వల్ల శరీరము లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .
చిట్టి బూరెలు : మునపపప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చేస్తారు . ఇవి పిల్లలకు చాలా ఇస్టము . చలువ చేస్తుంది .
పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెలు లలో ప్రోటీన్లు లభిస్తాయి .
గోధుమ ప్రసాదము : గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో తయారుచేస్తారు . ఇది బలమైన ఆహారము
Post a Comment