సర్పనాగబంధం గురించి మీకు తెలుసా..!?



వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న ఆరో నేలమాళిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదనే విషయం తెలిసిందే. నాగజాతి విశేషాల సమాహారం ఇది.

“అనల తేజులు దీర్ఘ దేహులు నైన యట్టి తనూజులన్ వినుత సత్త్వుల గోరె గద్రువ వేపురం వేడ్కతో…” కశ్యపునికి ఇద్దరు భార్యలు. కద్రువ, వినత. ఇది కృతయుంగంలోని విషయం. పుత్ర కామేష్ఠ యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు ఐదు వందల ఏళ్ల పాటు నేతి కుండలలో భధ్రపరచగా కద్రువ గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ ఇత్యాది నాగుల వెలువడ్డారు. తల్లి తొందర పాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తరువాత మరో ఐదు వందల ఏళ్లకు గరుడుడు జన్మించారని భారతంలోని అది పర్వం ద్వితియాశ్వాసంలో పేర్కొన్నారు.

హారంగా, పడకగా…
ఆది శేషుడు భూభారాన్ని వహించగా, వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి, జనమేజయుడు నిర్వహించిన సర్ప యాగానికి హేతువులైనాయి. కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం. శివుని కంఠంలో హారంగా, విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనాయి.

తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం, పిల్లల మధ్య విరోధానికి ఎలా దారి తీస్తుందో నాగులు, గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది. తన ఆజ్ఞను మీరినందుకు ఆదాం, ఈవ్‌లను దేవుడు ఈడెను తోట నుంచి బహిస్కరించి వారిని అందుకు పురికొల్పిన సాతాను సర్పాన్ని… నీవు నీ పొట్టపై పాకుతూ, మట్టి తింటూ నీ జీవితం గడుపు. ఈ స్త్రీ, ఆమె కుమారులు నీకు శత్రువులగుదురు గాక! నీవు వారి కాలిపై కాటు వేస్తావు, వారు నీ తలపై గాయపరుస్తారు అని ఆజ్ఞాపించారు.

సర్పం-సప్త ప్రతీకలు
ప్రాచీన కాలం నుంచి సర్పం (సర్పెంట్) సప్త విషయాలకు ప్రతీకగా ఉంది.
1. దేవునిగా- తన తోకను తానే మింగుతుంది కాబట్టి. అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు.
2. తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు. నవీన శాస్త్రజ్ఞుడు ‘కెకూలే’ ఈ చిహ్నాన్ని కల గని ‘బెంజిన్’ అణు నిర్మాణాన్ని ఊహించాడని, అదే రసాయన శాస్త్రంలో మరో ముందడగు అయిందని చెబుతారు.
3. పునరుజ్జీవనానికి, పునర్ యవ్వనానికి, కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా ఎస్కులేపియస్ దేవునికి ప్రీతిపాత్రమై, సర్పం వైద్యరంగానికి చిహ్నమైంది.
4. గ్రీకులకు, రోమన్లకు సంరక్షక దేవత. హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది. కౌరవుల యుద్ధ పతాకం సర్పం.
5. జ్ఞానానికి
6. సైతానుకు కూడా సర్పాలే గుర్తు.

తొలి మానవుల పతనం
ఈజిప్షియన్లకు, హిబ్రూలకు, కాననైట్లకు, మధ్యధరా ప్రాంతం వారికి, ఉగ్రాయిట్లు, సుమేరియన్లకు సర్పాలు సరప్ (మంట పుట్టించేవి), నాహాస్, పెటెన్, బెటెన్, నాగులుగా సుపరిచితమే. గిల్గామేష్ కథలో నానా కష్టాలు పడి గిల్గామేష్ సాధించుకు వచ్చిన మృత సంజీవనీ లతను సర్పం అపహరించుకొని పోయి మానవులకు మృత్యువు తప్పని సరి చేస్తుంది. ఉదంకుని దగ్గరి కుండలాలపహరించుకొని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణ భూతుడవుతాడు.

జ్ఞాన ఫలాన్ని ఈవ్, ఆదాం తొలి మానవ దంపతులు తినేలా చేసి సాతాన్ సర్పం తొలి మానవుల పతనానికి కారణమయ్యాడు. ఈజిప్షియన్లకు నాగ దేవతలున్నారు. యురియస్ సర్పం రక్షణకు, ఎపెప్ కీడుకు, ఎనెప్ సంతానానికి దేవతలు. గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం. ప్రాచీన గాథల్లో డ్రాగన్‌లు ఎక్కువ. నాగుల చవితి మనకు అత్యంత ప్రియమైన పండగ. ఓహియో దేశంలో ప్రసిద్ధి కెక్కిన మహా సర్పపు దిబ్బ అమెరికన్ ఇండియన్లకు పవిత్రమైనది. దీని పొడవు అరకిలోమీటరు.

మహారాజయోగం
జూపిటర్ దేవత సర్ప రూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జనించాడని ఓ ఐతిహ్యం. మార్క్ ఏంటోని క్లియోపాత్రను ముద్దుగా ‘ద సర్పెంట్ ఆఫ్ ఓ ల్డ్ నైల్’ నైలు నదీ సర్పంగా పిలిచేవారట. క్లియో పాత్ర మరణించేప్పుడు ‘ఏస్ప్’ సర్పాలను పెదాలకు, హృదయంపై కాటు వేయించు కొని నిశ్శబ్దంగా నిష్క్రమించడం మనకు తెలుసు. మొదలయిన పదం తిరిగి వాక్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పెంటైన్ వర్సెస్ అంటారు. సర్ప బంధ కవిత్వం మనకు తెలుసు.

సర్పజాతులు
ఆస్ట్రేలియన్ల ఆదిమ తెగలు ఇంద్రధనుస్సు సర్పం భూమికి పర్వతాలతో, నదులతో నిర్మించిందని నమ్ముతారు. సర్పం కలలోకి రావడం శృంగారానికి, కామేచ్ఛకి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు. సంవత్సరానికి లక్షమందిని మృతుల్ని చేసే విష జాతి సర్పాలు 600 ఉంటే, మొత్తం 3,000 రకాల పాముల ఉన్నాయని ఒక అంచనా అర్జునుడు నాగకన్య ఉలూచిని పెళ్లాడాడు. కంబోడియాలోని అంగ్‌కోర్ రాజ వంశీకులు తాము బ్రహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు. హితుడిగాను, శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే. అందుకే భగవానుడిలా వాక్రుచ్చినాడు.
“సర్పాణా మస్మి వాసుకిః అనంత శ్చాస్మి నాగానాం…”

No comments