70 సంవత్సరముల క్రితం ఇదేరోజునాడు 18-08-1945 సుభాష్ చంద్రబోస్ విమానం కూలిపోయింది


సుభాష్ చంద్రబోస్ గారు పయనిస్తున్న విమానం కూలిపోయింది. నాటినుంచి నేటివరకూ బోస్ గారు ఉన్నారా మరణించారా అన్న ప్రశ్నకు ఎన్ని కమిటీలు వేసినా సరియైన సమాధానం రాలేదు. అజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ సంస్థానాధీశులకు కంటిమీద కునుకు లేకుండా చేయటమేకాదు హిట్లర్ వంటి వ్యక్తితో చర్చలు జరిపి భారతీయుల కీర్తిపతాక విశ్వవ్యాప్తం కావించిన ధీశాలి. నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వరాజ్యం ఇస్తా అని బహిరంగంగా ప్రకటించి యువతలో స్వరాజ్య స్పూర్తి రగిలించిన మార్గదర్శి బోస్ గారు.


సుభాష్ చంద్రబోస్ గారూ, ఇదేరోజున మీరు పయనిస్తున్న విమానం అదుపుతప్పి మీరు మరణించి ఉండవచ్చని పెద్దలు చెప్పగా విని నేడు మీవర్ధంతి గా భావించి సజలనయనాల సుజల ధారలతో మిమ్ము స్మరించుకుంటూ స్పూర్తిని పొందుతున్నాం. కోల్‌కత్తా రబీంద్ర సరోవర్ నుంచి కాళీఘాట్ వరకు నడుస్తుంటే కొన్ని సంవత్సరల క్రితం మీరు నడిచిన ఆ ప్రాంతంలోని మీ స్పూర్తి నేటికీ దర్శనమిస్తుంది. కాళీమాత దర్శనం చేసుకుని మీ స్మృత్యర్ధం నిర్మించిన బాసుశ్రీ ధియేటర్ ఏమూల చూసినా మీరింకా అక్కడ సజీవంగా ఉన్నారా అనిపిస్తుంది.


ఓ అజాద్ హింద్ ఫౌజ్ నేతాజి, మీకు శాశ్వత స్మృతి చిహ్నాలు దేశభక్తులైన భారతీయుల పవిత్ర హృదయాలలో నిరంతరం ప్రశాంత జ్యోతివలే దేదీప్యమానమౌతూ ఉంటాయి.

No comments