చైనా భాషలో భగవద్గీత…!!!
కమ్యూనిస్టు దేశమైన చైనాలో భారతీయ గ్రంథరాజం భగవద్గీత విజయబావుటా ఎగురవేసింది. మొదటిసారిగా భగవద్గీత యథాతథంగా చైనా భాషలో అనువాదమయింది. ఈ అనువాద గ్రంథావిష్కరణ 2015 జూన్ 17న జరిగింది. జెజియాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వంగ్ ఛు చెంగ్, ప్రొఫెసర్ లింగ్ హైలు ఈ యధాతథ అనువాదాన్ని గావించగా, సిచుయాన్ పీపుల్స్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సుమారు 700 మంది ప్రముఖ యోగశాస్త్ర నిపుణులు హాజరైన సదస్సులో ఈ గ్రంథ ఆవిష్కరణ జరిగింది. చైనాలోని ప్రముఖ పత్రికలు టీవీ చానళ్లు ఈ సందర్భాన్ని ప్రసారం చేశాయి. చైనా, భారత సాంస్కృతిక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని అవి ప్రశంసించాయి.
చైనా దేశానికి , భారత దేశానికి గత రెండు వేల సంవత్సరాల నుంచి సాంస్కృతిక సంబంధాలున్నాయని, చైనా దేశంలోని బౌద్ధ మతం భారతదేశం నుంచే వచ్చిందని, బౌద్ధం, హిందూ ధర్మం సరైన సమన్వయంతో సోదర భావంతో వ్యాప్తి చెందాయని – చైనాలోని భారత రాయబారి శ్రీ అశోక్ కె. కాంత గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ అన్నారు.
ఇండియన్ కాన్సలేట్ జనరల్ శ్రీ కె. నాగరాజ నాయుడు ఈ గ్రంథానికి ముందు మాట రాశారు. ‘భగవద్గీత సార్వజనీన గ్రంథం..దీనిని హిందూ మతగ్రంథంగా చూడటం సరికాదు. నిగూఢమైన ఎన్నో తాత్త్విక విషయాల సమాహారమైన ఈ గ్రంథం చైనాలో ప్రజాదరణ పొందగలదని ఆశిస్తున్నాను’ అని ఆయన రాశారు.
శ్రీ నరేంద్ర మోడీ చైనా పర్యటనలో షాంఘై నగరంలో జరిగిన ‘మేకిన్ ఇండియా’ సదస్సులో ప్రసంగిస్తూ, ఇటీవల కాలంలో చైనాలో భగవద్గీత ఎంతో ఆదరింపబడుతోందని, అందుకు సహాయపడుతూ భారతీయ విజ్ఞానాన్ని చైనా దేశస్తులకు పరిచయం చేస్తున్న పండితులను ప్రశంసించారు.
పెకింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్ జి జియాన్ లిన్ తన జీవితంలో చాలా భాగాన్ని వాల్మీకి రామాయణం పరిశోధనకే.అంకితం చేశారని, 2008లో భారత ప్రభుత్వం ఆయనను సముచితంగా సన్మానించిందని పేర్కొన్నారు. భారత ప్రధాని చైనాతో సత్సంబంధాల కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఈ అనువాద గ్రంథం ఒక మైలురాయిగా నిలవగలదని పలువురు మేధావులు ప్రశంసలు అందజేస్తున్నారు.
Post a Comment