హలీం..హరిగా మారాడు. తనకిష్టమైన కళ కోసం ఓ యువకుడి పోరాటం.
అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఎవరైనా తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు అనేక ఆటుపోట్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్కోసారి సొంత వారి నుంచే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని ముందుకు దూసుకెళ్లిన వారే విజయం సాధించగలుగుతారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ యువకుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇంతకీ అతను అనుకున్నదేంటి, సాధించిన లక్ష్యమేంటి? తెలుసుకుందాం రండి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో హలీం ఖాన్ జన్మించాడు. కాగా హలీం ఖాన్‌కు చిన్నప్పటి నుంచి తెలుగు సాంప్రదాయ నృత్యమైన కూచిపూడిపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. అయితే ముస్లిం కుటుంబంలో జన్మించడంతో తనకు కూచిపూడి నేర్చుకోవడం ఇబ్బందిగా మారింది. ఆ డ్యాన్స్ నేర్చుకుంటానని ఇంట్లో చెబితే కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోరని భావించాడు. దీంతో ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్‌కు వచ్చేశాడు. వచ్చీ రాగానే కూచిపూడి నాట్యం నేర్పే గురువును అన్వేషించడం మొదలు పెట్టాడు. ముస్లిం అని చెబితే తనకు డ్యాన్స్ నేర్పరని భావించి తన పేరు హరిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో నాగ మోహిని అనే గురువు వద్ద మొదట కూచిపూడి నృత్యం నేర్చుకోవడం ఆరంభించాడు. అనంతరం వేరే గురువు దగ్గర శిష్యరికం చేశాడు. అలా ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు హలీంఖాన్ కూచిపూడి నృత్యాన్ని సాధన చేశాడు. ఈ క్రమంలో హలీం ఖాన్ 5 సంవత్సరాల పాటు కఠోర సాధన చేసి కూచిపూడి నృత్యాన్ని ఎంతో చక్కగా నేర్చుకున్నాడు.
హలీంఖాన్ కేవలం నృత్యంపై శ్రద్ధ పెట్టడమే కాదు చదువునూ ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. ఓ వైపు కూచిపూడిని జాగ్రత్తగా అభ్యసిస్తూనే మరోవైపు ఎంబీఏ కూడా పూర్తి చేశాడు. అయినా అతనికి ఉద్యోగం చేయాలని అనిపించలేదు. కారణం కూచిపూడిపై అతనికి ఉన్న మమకారమే. ఆ నృత్యానికి ఎలాగైనా ప్రాణం పోయాలని అనుకున్నాడు. ఆ డ్యాన్స్‌లో ఉన్న గొప్పతనాన్ని తన ద్వారా అందరికీ తెలియజేయాలని అనుకున్నాడు. దీంతో తనకు వచ్చిన కూచిపూడి నృత్యాన్ని అందరి ఎదుటా ప్రదర్శించాలని సంసిద్ధుడయ్యాడు. అయితే స్టేజిపై యువకుడిలా నృత్యం చేస్తే దాన్ని చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని, ఈ క్రమంలో యువతి వేషధారణలో డ్యాన్స్ చేస్తే దాని గురించి అందరూ చెప్పుకుంటారని, అప్పుడు ఈ నృత్యానికి ఆదరణ పెరుగుతుందని హలీం ఖాన్ భావించాడు. దీంతో అతను ఆ విధంగానే ముందుకు కదిలాడు. యువకుడిలా కాకుండా యువతి వేషం వేషంలో చీరకట్టుకుని, చక్కగా ముస్తాబు చేసుకుని స్టేజిపై ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాడు.
ఈ క్రమంలో హలీంఖాన్ అలియాస్ హరి హైదరాబాద్ నగరంలో ముందుగా చిన్న చిన్న ప్రదర్శనలను ఇవ్వడం మొదలు పెట్టాడు. అయితే అతనిలో దాగి ఉన్న ప్రతిభే అతన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా చేసింది. తనదైన శైలిలో హావభావాలను పలికిస్తూ ఎలాంటి పాటకైనా, పద్యానికైనా మహిళలు కూడా చేయలేనంతగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తుండడంతో అనతి కాలంలోనే అతని పేరు అంతటా మారుమోగిపోయింది. ఆ డ్యాన్స్ చేస్తుంది యువతి కాదు యువకుడు అన్న విషయం ఒకటి, అతను అసలు హిందువు కాదు ముస్లిం అన్న ఇంకో విషయం… ఈ రెండు విషయాలను తెలుసుకున్న ప్రేక్షకులు అతని పట్టుదలకు, కృషికి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి హలీంఖాన్ తన నృత్య ప్రదర్శనలతో ఆ డ్యాన్స్‌కు మరింత పేరు తెస్తూ వచ్చాడు. ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని ఆ విధంగా సాధించగలిగాడు.
హలీంఖాన్ ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో దాదాపు 800 వరకు ప్రదర్శనలిచ్చాడు. కేవలం తెలుగే కాదు హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లోని కవితలు, పద్యాలు, గజల్స్‌కి నృత్య రీతులను సమకూర్చి హలీంఖాన్ ఇచ్చే ప్రదర్శన చూస్తే ఎవరికైనా విస్మయం కలగక మానదు. 2008లో రవీంద్ర భారతిలో బాలే అనే ఫ్రెంచ్ సంప్రదాయ నృత్యాన్ని, కూచిపూడిని మిళితం చేసి హలీంఖాన్ ఇచ్చిన మిలాంజ్ ఆఫ్ డ్యాన్సెస్ అనే ప్రదర్శనకు ఆహుతులు మంత్రముగ్ధులయ్యారు. తన కళ్ళతో ఒక స్త్రీ కంటే బాగా హావభావాలు పలికించగలగడం, అమ్మాయిల కంటే బాగా వయ్యారాన్ని ఒలికించగలగడం హలీంఖాన్ ప్రత్యేకత.
రవీంద్ర భారతిలోనో, లలిత కళా తోరణంలోనో ప్రదర్శిస్తే సంస్కృతి సాంప్రదాయాలు, కళల అభిమానమున్న కొంతమంది మాత్రమే చూస్తారు. కానీ యూత్‌కి తెలియాలంటే వారు తిరిగే చోటైనటువంటి బంజారాహిల్స్ లామకాన్ లాంటి ప్రదేశాల్లోనే ప్రదర్శనలివ్వాలని హలీంఖాన్ చెబుతున్నాడు. అమెరికాలో జరిగిన ఆటా మహాసభల్లో, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రారంభించినప్పుడు హలీంఖాన్ ఇచ్చిన ప్రదర్శనలు చూసిన వారు అతనికి జేజేలు పలికారంటే నమ్మగలరా! ఇదే కాదు ఓ సారి మెదక్ జిల్లా సంగారెడ్డిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు హలీంఖాన్ అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్యం చేశాడు. ఆ నృత్య ప్రదర్శనకు అక్కడి భక్తులు మంత్రముగ్ధులై స్వామి వారి కోసం తెచ్చిన పండ్లు, పూలను హలీంఖాన్‌పై అక్షింతలుగా చల్లారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతని నాట్య ప్రదర్శన ఎలా ఉంటుందో! తెలుసుకున్నారుగా, ఓ కళాపిపాసి గురించి. ఇలాంటి వారు చాలా అరుదుగానే ఉంటారు. ఏది ఏమైనా కళ పట్ల హలీంఖాన్‌కు ఉన్న అభిమానానికి, ఆ కళను బతికించాలని, నలుగురికీ తెలియజేయాలని అతను పడుతున్న తపనకు నిజంగా మనం అతన్ని వేనోళ్ల పొగడాల్సిందే. ఏమంటారు, అంతే కదా!
Ongole bidda adaragottu
ReplyDelete