గెలుపోటములకు అతీతుడు.. అతనే పవర్‌స్టార్‌.!


ఓ సినిమా హిట్టయితే, తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఫ్లాపొస్తే, హిట్‌ కోసం కసిగా పనిచేయడం సంగతెలా వున్నా, హిట్టుని నిలబెట్టుకోవడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. హిట్టొచ్చాక కాలర్‌ ఎగరెయ్యకూడదు, ఫ్లాప్‌ వస్తే కుంగిపోకూడదు.. సినీ రంగంలో ప్రతి ఒక్కరూ చెప్పేమాటే ఇది. కానీ, పవన్‌కళ్యాణ్‌ చెప్పడు, చేసి చూపిస్తాడు. దటీజ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. 

తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా.. పవన్‌కళ్యాణ్‌ యాటిట్యూడ్‌లో పెద్దగా వచ్చిన మార్పులేమీ లేవు సినిమా పరంగా. 'ఈ అబ్బాయెవరో తెలుసా.?' అంటూ తొలి సినిమాకి వాల్‌ పోస్టర్లు అంటించారు పవన్‌కళ్యాణ్‌ ఫొటోతో. 'ఈ అబ్బాయే మన కళ్యాణ్‌' అంటూ తదుపరి పోస్టర్‌ వచ్చింది. అప్పుడే అతను మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడన్న విషయం అందరికీ తెల్సింది. తొలి సినిమాలోనే తనకు బాగా ఇష్టమైన కరాటే స్టంట్స్‌ చేసి యూత్‌ని ఎట్రాక్ట్‌ చేశాడు. 

'గోకులంలో సీత' పేరుతో పవన్‌ చేసిన సినిమాలో అతని క్యారెక్టర్‌ నెగెటివ్‌ షేడ్స్‌ వుంటుంది. అదీ హిట్‌ సినిమానే. 'సుస్వాగతం' ఇంకా డిఫరెంట్‌ షేడ్స్‌ వున్న పాత్ర. యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాడు పవన్‌ ఆ సినిమాతో. ఇక, 'తొలిప్రేమ' విషయానికొస్తే, తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిందీ సినిమా. తొలి వారం, రెండో వారం.. అబ్బే, సినిమాలో మేటర్‌ లేదు.. అన్నవాళ్ళే, మూడో వారం పూర్తయ్యి, నాలుగోవారంలోకి వచ్చేసరికి సినిమా ట్రెమెండస్‌ హిట్‌.. అనేశారు. 

'తొలిప్రేమ' సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం అందరికీ అనుభవమే. అదేంటంటే, ఈ సినిమాకి తొలి వారం టిక్కెట్లు దొరికాయేమోగానీ, మూడో వారం తర్వాత 50 రోజుల వరకూ టిక్కెట్లు దొరకలేదు. అంత పెద్ద విజయం సాధించింది 'తొలిప్రేమ'. ఇక అక్కడినుంచి పవన్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. అలాగని చకచకా సినిమాలూ చేసెయ్యలేదు. ఏడాదికి ఒకటి, ఒక్కోసారి ఏడాదిపాటు గ్యాప్‌.. ఇలా చేసుకుంటూ వెళ్ళాడు. 'జానీ' సినిమా మాత్రం పవన్‌ కెరీర్‌కి పెద్ద బ్రేక్‌ వేసింది. కాస్త ఆలోచనలో పడ్డాడు.. ఫ్లాపుల మీద ఫ్లాపులొచ్చినా సినిమాలు చేస్తూనే వున్నాడు. 'అన్నవరం' బాగున్నా, పవన్‌ అభిమానులకే ఆ సినిమా ఆనలేదు. 'జల్సా' సినిమా సైతం, 'పవన్‌ స్టామినాకి తగ్గ హిట్‌ కాదు' అనేశారు అభిమానులు.

'గబ్బర్‌సింగ్‌' రూపంలో పవన్‌కి నిఖార్సయిన హిట్టొచ్చింది. పవన్‌ హిట్‌ కొడితే ఎలా వుంటుందో బాక్సాఫీస్‌కి ఆ పంచ్‌ ద్బె రుచి చూపించింది 'గబ్బర్‌సింగ్‌'. మళ్ళీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' నిరాశపర్చింది. 'అత్తారింటికి దారేది' రూపంలో మళ్ళీ ఇండస్ట్రీ హిట్‌. తెలుగు సినీ పరిశ్రమలో ఇంకే సినిమాకీ సాధ్యం కాని విజయం 'అత్తారింటికి దారేది' సాధించిందనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే, సినిమా రిలీజ్‌కి ముందే ఫుల్‌ క్వాలిటీ పైరసీ డీవీడీ మార్కెట్‌లోకి వచ్చేసింది. ఆ టైమ్‌లో పవన్‌ అభిమానులు, సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి సినిమాలోని కంటెంట్‌ తోడయ్యింది. వెరసి ఇండస్ట్రీ హిట్‌. 

రొటీన్‌కి భిన్నంగా మల్టీస్టారర్‌ సినిమా చేయాలనుకున్న పవన్‌, 'గోపాల గోపాల' సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నాడు. తమ అభిమాన హీరోని దేవుడిలా కొలిచే అభిమానులకు, తెరపై నిజంగానే పవన్‌ దేవుడిలా కన్పించడం బోల్డంత ఆనందాన్ని మిగిల్చింది. ఇప్పుడిక 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' అంటూ 'గబ్బర్‌సింగ్‌'కి సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు పవన్‌. 

'జానీ', 'పంజా', 'పులి', 'తీన్‌మార్‌' సినిమాలు పవన్‌కెరీర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్స్‌.. అయినా అవేవీ పవన్‌ యాటిట్యూడ్‌ని మార్చలేకపోయాయి. హిట్‌ కొట్టినా అభిమానం పెరిగింది.. ఫ్లాపొచ్చినా అభిమానం పెరిగింది.. 'పవనిజం' సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి అతీతం.. అనుకున్నారు అభిమానులు. తమ అభిమాన హీరో గెలుపోటములకు అతీతంగా వ్యవహరిస్తున్నప్పుడు తామూ అలానే వుండాలనే యాటిట్యూడ్‌ని అభిమానులూ అలవర్చుకోవడం విశేషమే మరి. 
source:greatandhra.com

No comments