సర్వం శివమయం జగత్!




శివ స్వభావం ఎంతో ప్రాచీనమైంది. ఆదిశంకరులు ప్రతిపాదించిన ఆరు సంప్రదాయాలలో శైవమే మొదటిది.

‘త్యాగే నైకేనమృతత్వ మానశుః’ (యజుర్వేదం)- త్యాగైక తత్వం కలిగిన సదాశివునికి స్థిర నివాసం లేదు. నిన్నటి గుర్తు లేదు. రేపటి పట్ల చింత లేదు. జీవితమే ఆనందమయమన్న సూత్రానికి ఉదాహరణగా నిలిచే ఆదర్శ దంపతులు పార్వతీ పరమేశ్వరులు.
‘‘పరమశివుడి త్యాగనిరతి భారత సంస్కృతికి ప్రతిబింబం’’ అన్న వివేకానందుని వాక్కు అక్షర సత్యం. అందరికీ అన్నీ ఇచ్చే ఆదిభిక్షువు తనకోసం తాను ఏమీ మిగుల్చుకోడు. ఆయన ధరించే పాము ప్రకృతిలోని జీవి.

ఆయన ఆహార్యమైన పులి వనజీవిలో భాగం. ఆయన అధిరోహించే ఎద్దు (వృషభం) శ్రమైక జీవన సౌందర్యానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచే వ్యవసాయ సంస్కృతిలో భాగం. ఆయనకు అందమైన హర్మ్యాలు (మిద్దెలు) అవసరం లేదు. అందరూ చివరికి చేరుకునే స్మశానం అతడికి విశ్రాంతి. శివ స్వభావం ఎంతో ప్రాచీనమైంది. ఆదిశంకరులు ప్రతిపాదించిన ఆరు సంప్రదాయాలలో శైవమే మొదటిది. శైవంలోనే మిగతా ఐదు సంప్రదాయాలు అంతర్గతంగా గోచరిస్తాయి.

వైదిక వాజ్మయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే శివుడే రుద్రుడిగా దర్శనమిస్తాడు. వైదిక వాజ్మయంలోని దైవ స్వరూప అంశాలకు కొన్ని నిర్దిష్టమైన లక్షణాలున్నాయి. ఆ రకంగా చూస్తే రుద్రుడు మహాశక్తిశాలి. ఇక విద్యలన్నింటిలో వేదవిద్య ముఖ్యమైంది. వేదాలలో యజుర్వేదం గొప్పది. అందులో సంహిత గొప్పది. ఆ సంహితలో నాల్గవ కాండ. అందులో ఐదవ అనువాకం మధ్యలో మణిపూస వంటిది పంచాక్షరీ మహామంత్రం. ‘ఓం నమశ్శివాయ’. పరమ శివున్ని ప్రసన్నం చేసుకోవడానికి నమక చమకాలు ఆతని విభిన్న శక్తి ముఖాలను పరిచయం చేస్తున్నాయి. అయితే వైదిక వాజ్మయంలో దైవ స్వభావాలే ఉన్నాయి కాని, స్వరూపాలు కనిపించవు. బహుషా ఆనాటి ఆరాధనా పద్ధతులు కూడా ఇదే దిశలో ఉండేవేమో!
‘యస్య నిశ్వసితో వేదాః’ అతని నిట్టూర్పులే వేదాలు. సద్యోజాత, వామదేవ, ఆఘోర, తత్పురుష, ఈశానములనే, పంచ ముఖాల నుండి 28 ఆగమములు ఆవిర్భవించాయి. ఈ శైవాగమములే శివాలయ నిర్మాణ ప్రతిష్టాది కార్యక్షికమములకు దశా దిశా నిర్దేశం చేస్తాయని వేద పండితులు చెప్తారు.

పరమేశ్వరుని దివ్య తత్వాన్ని, ఆతని విభూదిని అర్థం చేసుకోవాలంటే పురాణ వాజ్మయం, ప్రజల విశ్వాసంలో ఉన్న ఐతిహ్యాలు పరిగణనలోకి తీసుకోవాలి. క్రీస్తు పూర్వం నుండే దక్షిణ భారతదేశంలో శివుడి మూర్తి పూజ ప్రచారంలో ఉంది. దీనికి తమిళ సీమ ఆరంభ కేంద్రమని చెప్పవచ్చు. పరమశివుని ప్రత్యేకతను నిశితంగా పరిశీలిస్తే నాట్యశాస్త్రానికి నాయకుడిగా, వ్యాకరణ శాస్త్రానికి వాచస్పతిగా, మధుర శబ్దార్థాలకు మూల విరాట్టుగా తాను దర్శనమిస్తాడు.

ఆర్య సంప్రదాయాన్ని లేదా ద్రావిడ సంప్రదాయాన్ని పరిశీలిస్తే శివుడే ఆదిదేవుడిగా ఆరాధింపబడుతున్నాడు. ఆర్య 

సంస్కృతిలో రుద్రుడిగా, దక్షిణభారతంలో శివుడిగా పూజింపబడే మహనీయుడే మహాదేవుడు. వైదిక పరంగా ఆరాధనా రూపంలో శివుడు పూజలు అందుకుంటున్నాడు. రుద్ర రూపంలో భావనకు ప్రాధాన్యమైతే శివరూపంలో భక్తికి ప్రాధాన్యం. భక్తి భావనలకు లొంగే ఆశుతోషుడే ఆదిదేవుడు. అతడే మహదేవుడు భోళాశంకరుడు, భవనాశంకరుడు.

ముఖ్యంగా భారతీయార్ష విజ్ఞానం ద్వారా తెలుసుకోవలసింది త్యాగం.‘త్యాగే నైకేనమృతత్వ మానశుః’(యజుర్వేదం)- ఈ విధమైన త్యాగైక తత్వం కలిగిన సదాశివునికి స్థిర నివాసం లేదు. నిన్నటి గుర్తు లేదు. రేపటి పట్ల చింత లేదు. జీవితమే ఆనందమయమన్న సూత్రానికి ఉదాహరణగా నిలిచే ఆదర్శదంపతులు పార్వతీ పరమేశ్వరులు.
భారతదేశంలో ఏక కాలంలో సంపూర్ణంగా ఆచరించే ఏకైక పర్వదినం మహా శివరాత్రి. నిరంతర త్యాగానికి శాశ్వత చిరునామాగా ప్రకాశించే పరమేశ్వరునికి ఒక్క మహాశివరాత్రి రోజు మన ఆహారాన్ని త్యాగం చేయడంలో ఆశ్చర్యం లేదు. అనుభూతితో కూడిన శివలీలా తత్వాలు ఆధ్యాత్మిక సోపానాన్ని అధిష్టింప జేస్తాయి.

మహదేవుడే మరో రూపంలో నటరాజుగా దర్శనమిస్తాడు. నిత్య చైతన్య స్వరూపానికి ప్రతీకగా నటరాజును ఆరాధించడం చోళుల కాలం నుండి ప్రారంభమైంది. జడత్వాన్ని తొలగించడానికి నటరాజు పాదుకం కింద రాక్షసుడుంటాడు. ఒక చేతితో ధరించిన ఢమరుకానికి సంకేతం శబ్ధ సంచలనం . మరొక చేతిలోని జ్వాలకు సంకేతం జ్ఞానం. ఎవరికీ ఎందుకూ పనికిరాని జిల్లేడు పూల మాలను పరమానందంగా ధరించే నటరాజే నాట్యశాస్త్రానికి ఆదిదేవత. పేరిణీ శివతాండం అందరికీ తెలిసిందే.
శివపూజ మానసిక సంతృప్తిని, నిత్య జీవనావసరాల పరిపూర్తిని కలిగిస్తుంది. అందుకే ఆనాటి నయనార్లు మొదలుకొని బసవేశ్వరుడి వరకు నేటి సిద్ధసాధు సత్పురుషులు, ఆసామాన్యులు, సామాన్యులు అందరూ శివారాధన చేస్తునే ఉన్నారు.

No comments