శ్రీరాముడు మానవులందరికీ ఆరాధ్యదైవం


శ్రీరాముడు వనవాసం చేసే రోజులలో మహర్షులందరూ రాముని చేరి శరణుకోరగా, "సర్వరాక్షస సంహారం చేసి, ఈ దండకారణ్యాన్ని మునిజన వాస యోగ్యం చేస్తాను'' అని వారికి మాట ఇచ్చాడు. అప్పుడు సీత, "ఆర్యపుత్రా! కారణం లేని వైరం, వైరం లేని హింస పాపహేతువులు కాదా ! ఈ రాక్షసులతో మనకు వైరం లేదు కదా! మరి వారిని సంహరించడం ఎంతవరకు ధర్మం'' అని హితవు చెబుతుంది. "సీతా! క్షత్రియ వంశసంజాతుడు అరణ్యంలోవున్నా, రాజ్యంలోనున్నా సజ్జన సంరక్షణ కోసం దుష్టశిక్షణ చేసి తీరాలి. ఇది క్షత్రియ ధర్మం. ధర్మసంరక్షణ కోసం అవసరమైతే నిన్నేకాదు, నా ప్రాణాలు సైతం పరిత్యజించడానికి వెనుకాడను'' అంటాడు శ్రీరాముడు. ఇదీ, రాముని ధర్మరక్షణ దీక్ష. సీతను అపహరించాలనే సంకస్పంతో రావణుడు మారీచుని దగ్గరకు వచ్చి, శ్రీరాముని నిందిస్తూ మాట్లాడుతుంటే భరించలేని మారీచుడు "రావణా! శ్రీరాముని స్వరూప స్వభావాలు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. రాముడెవరనుకున్నావు."రామో విగ్రహవాన్ ధర్మః'' సాధుస్సత్యపరాక్రమః'' అని నిర్భయంగా ప్రశంసించాడు. శతృవు చేత కూడా కీర్తించబడే ధర్మచరిత్ర గలవాడు శ్రీరాముడు.

రామధనుర్విముక్త శరాఘాతానికి మహాబలి వాలి నేలకూలాడు. కొనూపిరితోనున్న వాలి, శ్రీరాముని నానా దుర్భాషలాడి "రామా! సీతాన్వేషణకోసం నువ్వు సుగ్రీవునితో చేతులు కలిపే బదులు, నా సహాయం అర్థించి వుంటే, నేనే రావణసంహారం చేసి, సీతను నీకు సమర్పించేవాడిని'' అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు "వానరేశ్వరా! సీతాన్వేషణ అనే నా స్వార్థప్రయోజనం కోసం నిన్ను శిక్షించలేదు. కడుపున పుట్టిన కుమార్తెతో బాటు, సోదరుని భార్యం కోడలు, శిష్యుని భార్య కూడా కుమార్తెలతో సమానం. ఇది సనాతన ధర్మం. నువ్వు ఈ ధర్మాన్ని విస్మరించి నీ సోదరుడైన సుగ్రీవుని భార్యను అపహరించావు. అందుకే మరణమే శిక్ష. ఆ శిక్షే నీకు విధించాను'' అంటాడు. ధర్మపాలన విషయంలో శ్రీరాముడు అంత నిరంకుశంగాను ఉంటాడు.

శ్రీరాముని దేశభక్తి :
శ్రీరాముడు రావణసంహారం కోసం సర్వవానర సైన్యంతో కలిసి లంకానగరం చేరాడు. త్రికూట గిరిపైనున్న సుందర లంకానగరాన్ని రామలక్ష్మణులు వానరులు చూసారు. బంగారు శోభతో అత్యంత వైభవోపేతంగానున్న లంకా నగరాన్ని చూసి లక్ష్మణుడు ఆశ్చర్యంగా "అన్నా! ఈ లంకానగరం ఎంత అందంగా ఉందొ చూడు'' అన్నాడు. అందుకు శ్రీరాముడు చిన్నగా నవ్వి :
అపి స్వర్ణమయీం లంకామ్ లక్ష్మణ కాననరోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
లక్ష్మణా! సువర్ణ నిర్మితమైన ఈ లంకానగరం ఎంత అందంగా ఉన్నా, మన అయోధ్యానగర సౌందర్యానికి సరిపోతుందా! జన్మనిచ్చిన తల్లి పుట్టి పెరిగిన వూరు స్వర్గం కన్నా ఎక్కువ సుందరమైనవి'' అంటాడు.
అదీ శ్రీరాముని మాతృదేశాభిమానం.

శ్రీరాముని శరణాగతి - క్షమాగుణం :
యుద్ధరంగంలో రామరావణులు తొలిసారి తలపడ్డారు "రావణా! ఇప్పటికైనా మించిపోయినది లేదు. సీతను నాకు అప్పగించి శరణుకోరు క్షమిస్తాను'' అంటదు. ఎంతటి శతృవునైనా క్షమించగల స్థిరచిత్తుడు శ్రీరాముడు. శ్రీరాముని హితవులు వినలేదు రావణుడు. యుద్ధానికి దిగాడు. వీరోచితంగా పోరాడి మరణించాడు. మరణించిన తన అన్న మహాపాపాత్ముడని, అతనికి అగ్నిసంస్కారం చెయ్యడం కూడా నరకహేతువనీ నిష్ఠూరంగా పలుకుతాడు విభీషణుడు. అప్పుడు శ్రీరాముడు "
మరణాన్తాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనం
క్రియాతామస్య సంస్కారో మయాప్యేష యథాతవ

విభీషణా! ఎంతటి వైరమైనా మరణంతో నశించిపోవాలి ఇప్పుడు రావణునిపై నాకు కోపంలేదు. ఈతడు నీకెంతో నాకూ అంతే. ఈ మహావీరునికి అగ్నిసంస్కారం చెయ్యి'' అంటాడు. అదే రాముని క్షమాగుణం.

రామం దశరధాత్మజం :
రావణ సంహారం చేసిన రాముని ముందు సకల దేవగణాలు ప్రత్యక్షమై "రామా! రావణసంహారం చేసి, సకల లోకాలకు శాంతి చేకూర్చావు. నీవు శ్రీమహావిష్ణువువు. రావణసంహారం కోసం నరునిగా అవతరించావు'' అని వేనోళ్ళ శ్రీరాముని కీర్తిస్తారు. వారి మాటలు శ్రీరాముడు నమ్మాడు. దేవతలందరూ శ్రీరామునికి నమ్మకం కలిగించడం కోసం స్వర్గంలోనున్న దశరథుని రప్పిస్తారు. దశరథుడు రాముని చూసి "రామా! దేవతలు పలికిన మాటలు సత్యాలు. రావణసంహారం కోసం నీవు నరునిగా, నాకుమారునిగా జన్మించడం నా అదృష్టం. నీవు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువువి, సందేహం లేదు'' అన్నాడు. అప్పుడు శ్రీరాముడు భక్తిగా చేతులు జోడించి :
"ఆత్మానం మానుషం మన్వే రామం దశరధాత్మజం''
"నేను మానవుడను, దశరథుని కుమారుడను. అంతే మరేమియును కాదు'' అని వినయంగా పలికాడే కానీ ... దైవత్వాన్ని ప్రకటించలేదు. అందుకే రామావతారం పూర్నావతారం. ఇన్ని ధర్మాలు తాను ఆచరించి, సర్వలోకాలకూ ఆదర్శమూర్తిగా నిలిచాడు కనుకనే శ్రీరాముడు మానవులందరికీ ఆరాధ్యదైవం అయ్యాడు.

No comments