ద్రౌపది ఆలయం .... ద్రౌపది ఎలా జన్మించింది?


హిందూ మత పురాణం మహాభారతంలో ఐదుగురు పాండవులకు ఉమ్మడి భార్య అయిన ద్రౌపది పాంచాల రాజు అయిన ద్రుపదుడుకి అగ్ని ద్వారా జన్మించింది. ఆ కాలంలో ఆమె చాలా అందమైన మహిళ.
ద్రౌపది, ఐదుగురు కుమారులను కలిగి ఉంది. పాండవుల ఒకొక్కరి నుండి ఒక కుమారుడిని పొందెను. వారు యుధిష్టురుడు నుండి ప్రతివింధ్యుడు,భీమ నుండి శ్రుతసోముడు,అర్జునుడు నుండి శ్రుతకర్ముడు,నకులుడు నుండి శతానీకుడు మరియు సహదేవుడు నుండి శ్రుతసేనుడు.
చిత్తూరు జిల్లా ప్రతి గ్రామంలో ధర్మరాజు ఆలయం, పాండవుల గుడి, ద్రౌపదమ్మ నిలయం పేరుతో పాండవులకు సంబంధించి అనేక ఆలయాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని అనేక ధర్మరాజు ఆలయాల్లో కుప్పం తాలూకా యామిగాని పల్లెలోని ఆలయం అతి ముఖ్యమైంది. ఈ ఆలయం దాదాపు 5,6 శతాబ్దాలకు పూర్వమే నిర్మించినట్లు స్థానికుల కథనం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ధర్మరాజు తిరునాళ్ళు జరుపుతూ ఉంటారు. ఈ ఉత్సవం, వైశాఖ శుద్ధ పంచమి నుండి, బహుళ అష్టమి వరకు 18 రోజులు జరుగుతుంది. అంకురార్పణతో ప్రారంభమై తిలక తర్పణంతో అంతమవుతుంది.
తిలక తర్పణం ఉత్సవాన్ని గౌడ బ్రాహ్మణులు తొలి రోజు అంటే అంకురార్పణ (ధ్వజారోహణం) రోజున ఆలయంలో పూజలు జరిపి, పసుపు బట్టలు ధరించి ఉత్సవంలో జరిగే 18 రోజులు ఆలయమందే నివాసముంటారు. ఈ ఉత్సవ దినాల్లో పూజారులు స్త్రీలు వండిన భోజనాన్ని ఆరగించరు. ఉత్సవ దినాలలో 12 రోజులు ప్రతి రోజు ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలు (ఉదంక చరిత్రతో ప్రారంభించి, ధర్మరాజు పట్టాభిషేకం వరకు మహాభారత పురాణ శ్రవణం జరుగుతుంది.
పగటి పూట వినిపించిన కథనే రాత్రులందు నాటకరీతిలో ప్రదర్శిస్తారు. ఈ నాటకకర్తలు చిత్ర విచిత్రమైన అలంకరణలతో హావభావాలతో కౌరవ, పాండవ పాత్రలు ధరిస్తారు. ఈ ఉత్సవంలో పేర్కొనదగిన ఘట్టాలు 9వరోజు జరిగే బకాసురవధ, దాదాపు 10 మూటల బియ్యం అన్నం వండి ఒక బండిలో పోసి, బండిని అలంకరించి బీమవేషధారి దానిపై ఆసీనుడై, బకాసురుని వద్దకు వెళ్ళి వానితో పోరాడి అతడిని హతమారుస్తాడు. బండిలోని అన్నాన్ని గ్రామ ప్రజలందరూ ఒక చోట చేరి వేడుకతో భుజిస్తారు. 13వ రోజు ధర్మరాజు రాజసూయయాగాన్ని ప్రదర్శిస్తారు. యాగసమయంలో అచ్చట చేరిన భక్తులందరికీ తాంబూల, ఫల, పుష్పాలు పంచుతారు. 14వ రోజున అర్జున తపస్సు, అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించడం కోసం ఆచరించే యాగం, ప్రజలు ఆలయం ముందు పెద్ద (పొడవాటి) తాటి చెట్టు నాటుతారు. అర్జునుడు ఆ మానును పూజిస్తాడు.
ఆ తరువాత ఉత్సవాలలో ఉత్తర గోగ్రహణం, శ్రీ కృష్ణ రాయబారం, భక్తులనెంతగానొ ఆకర్షిస్తాయి. 18వ రోజు దుర్యోధన వధ ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించబడుతుంది. ఆ రోజు సాయంకాలం, పూజారులు ఏడు బావులలో నీటిని తోడుకొని వేపాకు, పసుపు, కుంకుమలతో పూజించిన కుండలతో తెచ్చి, అప్పటికే ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో పోసి పూజ చేస్తారు. దీన్నే ‘గార్గేయ పూజ’ అంటారు. పూజారి ఒక కుండను నెత్తిన పెట్టుకొని అగ్ని గుండం చుట్టూ మైమరచి నృత్యం చేస్తాడు. ఉపవాసం వున్న పూజారి, అతడి తోటి ఆ రోజు అంతా ఉపవాసం ఉన్న భక్తులు అగ్ని గుండంలో ప్రవేశిస్తారు. వారు గుండమందు ఒక వైపు నుంచి మరొక వైపు సలసలమండే అగ్నిలో నడుస్తారు. మహాభారత ఉత్సవం ధర్మరాజు పట్టాభిషేకంతో ముగుస్తుంది.
ద్రౌపది ఎలా జన్మించింది ?..
ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. ఆమెకు భోగేచ్ఛ అత్యధికంగా ఉండడం వలన మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు.
రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా 'నాకు పతి కావాలి' అని ఐదుసార్లు కోరింది. శివుడు తధాస్తు అన్నాడు. తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.
మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపదిగా జన్మించింది. ద్రోణాచార్యుని ఆఙ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి దృపదుని భందించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన దృపదుడు, ద్రోణుని చంపగల కుమారుడు, మరియు పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యఙ్ఞం చేస్తాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది మరియు ధృష్టద్యుమ్నుడు జన్మించుట జరుగుతుంది.
కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ఈ కథ ప్రారంభమౌతుంది. యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది.
ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. కర్ణుడు తన భర్తలకి అన్న అనే విషయం ద్రౌపదిని విస్మయపరిచింది. ఈ విషయం ముందే తెలిసిఉంటే తనకూ కర్ణుడికీ మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండేవన్న సందేహం ఆమెకు కల్గింది. ఆమె అంతకు ముందు కర్ణుని రెండుసార్లే చూసింది. ఆ రెండు సందర్భాలలోనూ ఆమెకు కర్ణుడిపట్లా తిరస్కారభావమో, అసహ్యమో కల్గాయి. తాను కర్ణుని రెండు సార్లే కలసినా తనజీవితమంతా కర్ణుని చుట్టే తిరిగినట్లుందని ఆమెకు తోచింది. ఆమె కర్ణుని మొదటిసారి చూసింది తన స్వయంవర సమయంలో. సూతపుత్రుడన్న కారణంతో కర్ణుని మత్స్యయంత్రం చేదించటానికి ప్రయత్నం చేయకుండా ఆమే ఆపించింది. ఆ తరువాత ఆమె కర్ణుని చూసింది కౌరవసభలో. ఆరోజున తనను అవమానించటంలో కర్ణుడు ప్రముఖ పాత్రే వహించాడు. కర్ణుని హీనునిగా తలపోస్తున్న ద్రౌపదికి, కుంతి, కృష్ణుడు చివరిరోజుల్లో పశ్చాతప్త హృదయుడైన కర్ణుడి ఉదాత్తప్రవర్తన గురించి ఆమెకు తెలిపారు. మరణించిన కర్ణుడు అదృష్టవంతుడు. అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది. అతనికి అద్భుత, విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది. తమకూ, కర్ణుడికీ ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కల్గింది. అతన్ని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవలసి వచ్చింది.
పట్టమహిషైన ద్రౌపదికి తన జీవనపథమ్మీద, తన వివాహంపైన ఉన్న ధర్మశంకలను, కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు), కృష్ణుడు తీర్చారు. పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆమె పాతివ్రత్యానికి మెచ్చిన మౌద్గల్యుడు ఆమెతో ఏకకాలంలో ఐదురూపాల్లో (త్రిమూర్తులు, ఇంద్రుడు, మన్మథుడు) రమించాడు. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. ఆమెను పార్థునికివ్వాలన్న తలపుతో ఉన్న ద్రుపదుడు, పాండవులు మరణించారన్న మాట విని, ఆమెకు స్వయంవరం ప్రకటించాడు.
ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.
అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది.

No comments